ఏపీలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దళారీ వ్యవస్థకు ప్రభుత్వం చరమగీతం పాడనుంది. స్థిరాస్తి లావాదేవీల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సరళతరం చేసి పబ్లిక్ డేటా ఎంట్రీకి శ్రీకారం చుడుతోంది. ఏపీ ఆర్ధిక రాజధాని విశాఖలో ఈ పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభించనున్నారు. మరోవైపు అవినీతిపరులను నియంత్రించేందుకు ఏసీబీ నిర్వహిస్తున్న అకస్మిక తనిఖీల్లో అనధికారిక సిబ్బంది హవా బయటపడటం ఆందోళన కలిగిస్తోంది.
రిజిస్ట్రేషన్ల శాఖలో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. డాక్యుమెంట్ రైటర్ల పెత్తనానికి కత్తెర వేయనుంది. వాళ్ల ప్రమేయం లేకుండానే స్థిరాస్తి అమ్మకాలు, కొనుగోళ్ళు జరిగేలా చర్యలు చేపడుతోంది.సులభ రిజిస్ట్రేషన్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తోంది. దీనికి సంబంధించి విశాఖ జిల్లాలో అక్టోబరు 2 నుంచి పైలట్ ప్రాజెక్టును ప్రారంభిస్తోంది. ప్రభుత్వం సూచించిన విధంగా డాక్యుమెంట్ రిజిష్టర్ చేసుకుంటే లంచాల బాధ తప్పిపోతుంది. ఆస్తి కొన్నా, బహుమానంగా ఇచ్చినా, పంపకాలు జరిగినా దానిని రిజిష్టర్ చేసుకుంటునే ఆ లావాదేవీ పరిపూర్ణం అవుతుంది.
రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఎలా రాయించుకోవాలో తెలియక జనం రైటర్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దళారులు రాజ్యమేలుతున్నారు. పర్సంటేజీల లెక్క కట్టి జనం దగ్గర ముక్కుపిండి మరీ వసూళ్ళకు పాల్పడుతున్నారు. కొందరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ఉద్యోగులే దళారులను పెంచి పోషిస్తున్నారు. లిటిగేషన్లతో భయపెట్టి వేలకు వేలు కొట్టేస్తున్నారు. గాజువాక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అకస్మిక తనిఖీల్లో బయటపడ్డ అక్రమాలే ఇందుకు నిదర్శనం. షీలానగర్ రిజిష్ట్రార్ కార్యాలయం దాడులు చేస్తే పన్నెండుమంది బ్రోకర్లు కార్యాలయంలో వున్నారు. అనధికారంగా మల్లేష్, పాపారావు కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నట్లు ఏసీబి విచారణలో బయటపడింది. ఇక్కడ డాక్యుమెంట్ రైటర్లే రింగ్ మాస్టర్లని ఓ అంచనాకు వచ్చిన ఏసీబీ.. విస్తృతమైన సోదాలు చేపట్టింది. ఈ తనిఖీల్లో 2 లక్షల 44 వేలు అదనంగా వున్నట్లు విచారణలో తేలింది.
రైటర్ల అవసరం లేకుండా ఎవరికి వారే డాక్యుమెంట్ తయారు చేసుకునే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీనికి పబ్లిక్ డేటా ఎంట్రీ విధానమని పేరుపెట్టింది. అమ్మేవారు, కొనేవారు నేరుగా వివరాలతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్తే చాలు మీ పని అయిపోయినట్టే. ప్రస్తుతం సేల్ డీడ్ డాక్యమెంట్ ఏడు పేజీలు ఉంది. అదే బహుమానం అయితే ఐదు పేజీలు, ఆస్తి పంపకాలకైతే పది పేజీల డాక్యుమెంటు ఉంది. ఇప్పుడు వీటిలో ఏదైనా సరే రెండు పేజీలతోనే డాక్యుమెంట్ తయారవుతుంది. ఇందులో ముఖ్యమైన అంశాలు అన్నీ ఉంటాయి.ఆ వివరాలు నింపితే చాలు. ప్రతి లావాదేవీకి యూజర్ ఐడీ క్రియేట్ అవుతుంది. వివరాలు నమోదు చేశాక…సబ్ మిట్ కొట్టగానే అది సబ్ రిజిస్ట్రార్ దగ్గరకు వెళుతుంది. అధికారి అన్నీ పరిశీలించి ఏమైనా కరెక్షన్లు వుంటే వెనక్కి పంపుతారు. వాటిని సవరించాక ఒకే చేస్తారు. వెంటనే రెండు పేజీల డాక్యుమెంట్‌ను ప్రింట్ తీసుకొని దానికి ఇంతకు ముందులా లింక్ డాక్యుమెంట్, ఆధార్ తదితరాలన్నీ జత చేసి ఫొటోలు, వేలిముద్రలు తీయించుకోవాలి. అక్కడి నుంచి ప్రాసెస్ అంతా ఇప్పటిలాగే జరుగుతుంది. డాక్యుమెంట్ నేరుగా కొనుగోలుదారుకే ఇస్తారు.
ఈ కొత్త విధానంలో డాక్యుమెంట్ రైటర్ అవసరం ఉండదు. దళారీలకు లంచాలు ఇవ్వాల్సిన పని లేదు. ఈ విధానాల్ని ఇప్పుడు విశాఖలో పరిశీలించనున్నారు. ప్రస్తుతం విశాఖపట్నం జిల్లాలో డాక్యుమెంట్ లు అన్నీ ఇంగ్లీష్‌లోనే చేస్తున్నారు. ఇకపై తెలుగులో కూడా డాక్యుమెంట్ లు తయారు చేసుకునేలా సాఫ్ట్‌వేర్ తీసుకువస్తున్నారు. పబ్లిక్ డేటా ఎంట్రీని మొదట పైలేట్ ప్రాజెక్ట్ క్రింద సూపర్ బజార్ కార్యాలయంలో ప్రారంభిస్తున్నారు. విశాఖలోనే రిజిస్ట్రేషన్లు ఎక్కువగా ఉండటమే కాకుండా అన్ని రకాలు రిజిస్ట్రేషన్లు ఇక్కడే ఎక్కువగా జరగడంతో విశాఖను ప్రాజెక్ట్ కేంద్రగా ఎంచుకున్నారు.