శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భక్తులకు నిరంతరాయంగా లడ్డూ ప్రసాదాలు – శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాధ్
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో తిరుమలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిరంతరాయంగా లడ్డూ ప్రసాదాలు పంపిణీకి పటిష్ఠమైన చర్యలు తీసుకుంటున్నట్లు శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాధ్ తెలిపారు. తిరుమలలోని పిఏసి-4లోని సమావేశ మందిరంలో బుధవారం శ్రీవారి ఆలయం, పోటు, విజిలెన్స్, బ్యాంక్ అధికారుల సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా డెప్యూటీ ఈవో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సమయంలో ముఖ్యంగా గరుడసేవనాడు లడ్డూ ప్రసాదాల పంపిణీలో ఏదైన సాంకేతిక సమస్య ఎదురైతే, ప్రత్యమ్నాయ చర్యలపై సమాలోచనలు చేశామన్నారు. లడ్డూ కౌంటర్లకు అదనంగా మరో ఇంటర్నెట్ లైన్, సాంకేతిక సిబ్బందితో టీంను ఏర్పాటు చేయాలన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, శ్రీవారి ఆలయం, లడ్డూ కౌంటర్లలో ఎలాంటి సమస్యలు లేకుండా విధులు నిర్వహించాలని సిబ్బందిని కోరారు.
ఈ సమావేశంలో టిటిడి విజివోలు శ్రీ మనోహర్, శ్రీ ప్రభాకర్, పోటు ఏఈవో శ్రీ శ్రీనివాసులు, ఏవిఎస్వోలు, వివిద బ్యాంక్‌ల ప్రతినిధులు, లడ్డూ కౌంటర్ల సూపర్వైజర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.