Food

పండ్లు అనగా Fruits నేరుగా తినాలి

Eat Fruits Directly Without Juicing Them

ఆకు కూరలను మాత్రమే తినడాన్ని ‘విజిటేరియనిజం’ అన్నట్లుగా పండ్లను మాత్రమే తినడాన్ని ‘ఫ్రూటరియనిజం లేదా ఫ్రూజివోరిజం’ అని అంటారు. అయితే పండ్లను ఎలా తినాలి? ఆహారానికి ముందు తినాలా? తర్వాత తినాలా? ఏ రకమైన పండ్లను తినాలి? పండ్లను నమిలి తినాలా? జూస్‌గా చేసుకొని తాగాలా? ఇటీవల చాలా మందిని వేధిస్తున్న అనుమానాలు ఇవి. పరగడుపున పండ్లు తింటే మంచిదని, అప్పుడు అవి మంచిగా జీర్ణం అవుతాయని, అన్నంతోపాటు తింటే టాక్సిక్‌ ఆసిడ్‌లు రిలీజై కడుపు పాడవుతుందని ఇటీవల కొందరు కొత్త సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. ఇది పూర్తిగా తప్పని, కడుపులో ఒకోరకమైన పదార్థాలకు ఒకో రకమైన జీర్ణ వ్యవస్థ ఉండదని, మోతాదులో తింటే పరగడుపున తిన్నా, అన్నంతోపాటు తిన్నా పండ్లు ఒకే రకమైన ఫలితాలను ఇస్తాయని స్పెయిన్‌లోని ‘పాలిటెక్నిక్‌ యూనివర్శిటీ ఆఫ్‌ వాలెన్సియా’లో బయోటెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న జోస్‌ మైగుల్‌ ములెట్‌ తెలియజేశారు. ఆయన కథనం ప్రకారం స్పెయిన్‌లో ఓ సామెత ప్రచారంలో ఉంది. ‘మిలన్‌ ఇన్‌ ది మార్నింగ్‌ ఈజ్‌ గోల్డ్, ఆఫ్టర్‌నూన్‌ ఇట్‌ ఈజ్‌ సిల్వర్, ఎట్‌ నైట్‌ ఇట్‌ కిల్స్‌ యూ’ (పుచ్చకాయ లేదా కర్భూజా ఉదయం బంగారం, మధ్యాహ్నం వెండిలాంటిది. రాత్రి తింటే నిన్ను చంపేస్తుంది). ఆస్ట్రియా చక్రవర్తి ఆల్బర్ట్‌–2 1358లో, పోప్‌ పాల్‌–2 1471లో, పోప్‌ క్లెమెంట్‌–8 1605లో పుచ్చకాయల విందులో వాటికి ఎక్కువగా తినడం వల్ల వారు ముగ్గురు ప్రముఖులు మరణించారనే ప్రచారం ఉంది. ఈ కారణంగా పుచ్చకాయలు తినడంపై సామెత పుట్టుకొచ్చి ఉండవచ్చని ప్రొఫెసర్‌ ములెట్‌ వివరించారు. ఒకప్పుడు ఈ పండ్లు ఖరీదు ఎక్కువ అవడం వల్లన ధనవంతులకే అందుబాటులో ఉండేవి కనుక, రాత్రి పూట అవి తినడం మంచిది కాదన్న వాదను పుట్టుకొచ్చి ఉండవచ్చన్నది ప్రొఫెసర్‌ వాదన. కేవలం పండ్ల వలనే మన శరీరానికి కావాల్సిన పోషకాలు రావని, వంటకాలను కూడా తినాలని, వండేటప్పుడు కూడా కొన్ని కూరగాయల నుంచి ఆ వేడికి కొన్ని పోషకాలు ఉత్పత్తి అవుతాయని ఆయన చెప్పారు. పండ్లు తినే జంతువులకన్నా మానవులు ఎక్కువ తెలివి తేటలు కలిగి ఉండడానికి, తక్కువ ఆహారం తిన్నా ఎక్కువ శక్తి రావడానికి కారణం అవుతున్నది వంటేనన్నది కూడా ఆయన వాదన. అందుకే కోతులు, చింపాజీలీ లాంటి జంతువులు శక్తి సరిపోక ఎప్పుడూ పళ్లను తింటూనే ఉంటాయని ఆయన చెప్పారు. పండ్లలో డీ విటమిన్‌ అస్సలు ఉండదని దాని కోసం పాలు, గుడ్లు, మాంసం, చేపలు తీసుకోవడం లేదా ఎండలో కూర్చోవడం లాంటివి చేయాల్సిందేనని ఆయన చెప్పారు. పండ్లను ఎప్పుడైనా తినవచ్చని, అయితే జూస్‌ బదులు పండ్లను నేరుగా తినడమే మంచిదని ఆయన తెలిపారు. ఉదాహరణకు బత్తాయి తీసుకుంటే మహా అంటే ఒకటి, రెండు తీసుకుంటామని, అదే జూస్‌ తాగితే నాలుగైదు పండ్ల రసం తాగుతామని, దానివల్ల శరీరంలోని రక్తంలో సుగర్‌ స్థాయి హఠాత్తుగా పెరుగుతుందని ఆయన అన్నారు. అదే బత్తాయి పండును నమిలి తిన్నట్లయితే అందులోని ఫైబర్‌ (పీచు) పదార్థం కడుపులోకి వెళ్లి జీర్ణ వ్యవస్థకు తోడ్పడుతుందని ఆయన చెప్పారు. ఏ సీజన్లో వచ్చే పండ్లను ఆ సీజన్‌లో తీసుకుంటే మంచిదని, ఆకు కూరలు, పండ్లు, మాంసాహారం అన్న తేడా లేకుండా ఎవరి అలవాట్లనుబట్టి వారు తమ శరీర శ్రమకు తగ్గట్లుగా పరిమితంగా ఆహారాన్ని తీసుకోవడం మంచిదని ‘వాట్‌ ఈజ్‌ ఈటింగ్‌ హెల్తీ’ అనే పుస్తకాన్ని రాసిన ప్రొఫెసర్‌ ములెట్‌ సూచిస్తున్నారు.