వాహనాల అమ్మకాల్లో మందగమనం నేపథ్యంలో దేశీయంగా ప్రయాణికుల వాహనాలను (పీవీ) తయారు చేసే మారుతీ సుజుకీ, టాటామోటార్స్ మార్కెట్ వాటాలు పడిపోయాయి. ఏప్రిల్-ఆగస్టు అమ్మకాల్లో ఆ కంపెనీలు క్షీణత చూశాయి. అదే సమయంలో హ్యుందాయ్, మహీంద్రా విక్రయాలు తగ్గినప్పటికీ మార్కెట్ వాటాను మాత్రం పెంచుకోగలిగాయని సియామ్ లెక్కలు చెబుతున్నాయి.
దేశంలో అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ అయిన మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) ఏప్రిల్-ఆగస్టు మధ్య కాలంలో రెండు శాతం మేర తన మార్కెట్ వాటాను కోల్పోయింది. దీంతో ఆ కంపెనీ మార్కెట్ వాటా 50 శాతం దిగువకు చేరింది. మొత్తంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ కాలంలో 5,55,064 వాహనాలను విక్రయించింది. గతేడాది ఇదే సమయంలో 7,57,289 వాహనాలను విక్రయించింది. దీంతో గతేడాది 52.16 శాతంగా ఉన్న మార్కెట్ వాటా 49.83కు పడిపోయింది. ఇక మొత్తంగా ఈ కాలంలో ప్రయాణికుల వాహనాలు 11,09,930 యూనిట్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే సమయంలో వీటి విక్రయాలు 14,51,647గా నమోదవ్వడం గమనార్హం. మరో అతిపెద్ద వాహన తయారీ దారు టాటామోటార్స్ సైతం ఇదే కాలంలో 60,093 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో 98,702 యూనిట్ల మేర ప్రయాణికుల వాహనాలను విక్రయించింది. దీంతో ఆ కంపెనీ మార్కెట్ వాటా 6.79శాతం నుంచి 1.39 శాతం మేర పడిపోయి 5.41 శాతంగా నమోదు చేసింది.
మరోవైపు హ్యుందాయ్ మోటార్ తన మార్కెట్ వాటాను పెంచుకోగలిగింది. ఏప్రిల్-ఆగస్టు మధ్య కాలంలో ఆ కంపెనీ 2,03,729 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే సమయంలో 2,26,396 యూనిట్లు విక్రయించింది. అమ్మకాల సంఖ్య తగ్గినప్పటికీ ఆ కంపెనీ తన మార్కెట్ వాటాను 15.59శాతం నుంచి 18.36 శాతానికి పెంచుకోవడం గమనార్హం. మహీంద్రా అండ్ మహీంద్రా సైతం ఇదే కాలంలో 89,733 యూనిట్లను విక్రయించగా.. గతేడాది ఇదే కాలంలో 1,00,015 వాహనాలను విక్రయించింది. కానీ అదే సమయంలో తన మార్కెట్ వాటాను 6.89 శాతం నుంచి 1.19 శాతం మేర పెంచుకుని 8.08 శాతం వాటాను సొంతం చేసుకుంది.
ఇక మిగిలిన కార్ల కంపెనీలైన టయోటా కిలోస్కర్ మోటార్ తన మార్కెట్ వాటాను 4.62 శాతం నుంచి 4.86 శాతానికి పెంచుకుంది. రెనో ఇండియా, స్కోడా ఆటో, ఫోక్స్ వ్యాగన్ కంపెనీలు సైతం తమ మార్కెట్ వాటాలను స్వల్పంగా ఈ కాలంలో పెంచుకోగలిగాయి. మరోవైపు హోండా కార్స్ మార్కెట్ షేర్ 5.48 నుంచి 4.64కి తగ్గగా.. ఫోర్డ్ ఇండియా మార్కెట్ షేర్ 2.81 నుంచి 2.7కి, నిస్సాన్ మోటార్ ఇండియా మార్కెట్ వాటా 1.14 నుంచి 0.73 శాతానికి తగ్గాయి.