Politics

త్రిభాషా సూత్రాన్ని పాటించాల్సిన అవసరం ఉంది

Yarlagadda Lakshmiprasad Requests Parents Support To Nurture Telugu

తెలుగు భాషా అమలులో అధికారులతో పాటు తల్లిదండ్రుల పాత్ర కీలకం

• విభజనచట్టంలోని 9,10వ షెడ్యూల్లోని నిబంధనలను తూ.చా తప్పకుండా పాటించాలి

• ఈ విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులు చొరవ చూపాలి : అధికార భాషా సంఘం అధ్యక్షుడు, ప్రముఖ సాహితీవేత్త ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌

తెలుగు భాషా అమలులో అధికారులతో పాటు తల్లిదండ్రుల పాత్ర ఎంతో అవసరమని, అధికార భాషా అమలులో వారి వారి మానసిక పరిపక్వత పెంచుకోవాల్సిన అవసరముందని అధికార భాషా సంఘం అధ్యక్షుడు, ప్రముఖ సాహితీవేత్త ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ అభిప్రాయపడ్డారు.

మంగళవారం వెలగపూడి సచివాలయంలోని ప్రచార విభాగంలో యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ మాట్లాడుతూ… హిందీ భాషా అమలును బలవంతంగా రుద్దడం ఎంత తప్పో వద్దు అనడం కూడా అంతే తప్పు అన్నారు.

రాష్ట్ర విభజన అనంతరం దామాషా ప్రకారం తెలుగు విశ్వవిద్యాలయంకు సంబంధించి 60:40 నిష్పత్తి ప్రకారం విభజనను చేపట్టడంతో పాటు చట్టంలోని 9,10వ షెడ్యూల్లోని నిబంధనలను తూ.చా తప్పకుండా పాటించాల్సిన అవసరముందని ఈ విషయమై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులు చొరవ చూపాలని ఆయన కోరారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీశైలం, కూచిపూడి, రాజమహేంద్రవరంలో ఉన్న తెలుగు విశ్వవిద్యాలయాల విస్తరణ కేంద్రాల్లో మూడు కోర్సులను మాత్రమే బోధిస్తున్నారు.

అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, వరంగల్ లాంటి రెండు ప్రదేశాల్లో ఎక్కువ కోర్సులను అందజేయడం జరుగుతోందని ఆయన వెల్లడించారు.

కోర్టు ఉత్తర్వుల నుండి అధికారులు వెలువరించే ఉత్తర్వుల వరకు అన్ని ఉత్తర్వులు తెలుగులో ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ విషయమై జిల్లాల నుండి అమలు అయ్యే విధంగా ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో చర్చించి చర్యలు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.

తాను వివిధ పర్యాటక ప్రాంతాలు, విదేశాల్లో పర్యటించడం జరిగిందని పలు పర్యాటక ప్రాంతాల్లో అక్కడి గైడ్ లు పర్యాటకులకు అనువైన భాషలో వివరించుటకు చాలా ఇబ్బందులు పడటం గుర్తించామన్నారు.

త్రిభాషా సూత్రాన్ని విధిగా పాటించాల్సిన అవసరముందన్నారు.హిందీని అనుసంధాన భాషగా మాత్రమే పరిగణించేలా చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నట్లు ఆయన తెలిపారు.

తమిళనాడులో సైతం దక్షిణ భారత మహాసభ వంటి కేంద్రాలు ఉన్నాయని, అక్కడ హిందీ నేర్చుకోవడంతో పాటు రాజకీయ లబ్ధికి వాడుకుంటారని అయినప్పటికీ వారి మాతృభాష అయిన తమిళంను మరవలేదని ఆయన వెల్లడించారు.

రాజమహేంద్రవరంలో తెలుగు విశ్వవిద్యాలయం త్వరితగతిన ఏర్పాటుకు చర్యలు చేపట్టాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

హిందీ భాషా ప్రావీణ్యత లేకపోవడం వలన మాజీ ప్రధాని దేవేగౌడ వంటి వారు పలు సమస్యలను ఎదుర్కొన్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.

ఇటీవల గుంటూరు జిల్లా పెనుమాకలో నిర్వహించిన రాజన్నబడి కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగును ఒక బోధనాంశంగా గుర్తించి అమలు చేయడం జరుగుతుందని తెలిపారని ఇది శుభపరిణామమని ఆయన కొనియాడారు.