కశ్మీర్ అంశంపై మధ్యవర్తిత్వం నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు.
న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి సమావేశాలకు హాజరైన పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో ట్రంప్ భేటీ అయ్యారు.
ఆ తర్వాత ఇద్దరూ మీడియాతో మాట్లాడారు. ఒకవేళ పాక్, భారత్ కావాలనుకుంటే, కశ్మీర్ అంశంపై మధ్యవర్తిత్వం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ట్రంప్ అన్నారు.
కశ్మీర్ ఓ సంక్లిష్టమైన సమస్య అని, కానీ రెండు దేశాలు అంగీకరిస్తేనే దానిపై రాజీ కుదిర్చే ప్రయత్నం జరుగుతుందని ట్రంప్ అన్నారు.
భారత ప్రధాని మోదీ, పాక్ ప్రధాని ఇమ్రాన్‌తోనూ తనకు మంచి సంబంధాలు ఉన్నట్లు చెప్పారు.
గతంలో తానెప్పుడూ మధ్యవర్తిగా విఫలం కాలేదని, కశ్మీర్ సమస్యపై తాము కావాలనుకుంటే అందుబాటులో ఉంటానన్నారు.
అమెరికా, పాక్ సంబంధాలపైన కూడా ట్రంప్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
గతంలో అమెరికా దేశాధ్యక్షులు పాక్‌తో సరైన సంబంధాలు నెలకొల్పుకోలేదన్నారు.
పాకిస్థాన్‌ను నమ్ముతానని, ఇమ్రాన్ ఖాన్‌ను కూడా విశ్వసిస్తానని ట్రంప్ తెలిపారు.
అమెరికా ప్రపంచలోనే శక్తివంతమైన దేశమని, ఆ దేశానికి సమస్యలను పరిష్కరించే సత్తా ఉందని ఇమ్రాన్ అన్నారు.