Politics

18లక్షల మంది భవిష్యత్తుతో నాటకాలు ఆడుతున్నారు

Chandrababu On Secretariat Employee Exams

సచివాలయ ఉద్యోగ నియామక పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీ ఆరోపణలపై ప్రభుత్వం, పంచాయితీరాజ్‌ శాఖ ఎందుకు నోరు మెదపడం లేదని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. 18 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తుతో ప్రభుత్వం నాటకాలు ఆడుతోందని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు చంద్రబాబు ట్వీట్‌ చేశారు. ఏపీపీఎస్సీని ప్రశ్నిస్తే పరీక్షలను తాము నిర్వహించలేదని, తమకు సంబంధం లేదంటోందని.. ఈ గందరగోళానికి కారణం ఎవరని ఆయన నిలదీశారు. వైకాపా విజయాలను చూసి తెదేపా ఓర్వలేకపోతుందంటున్నారని.. అంతగా ఓర్వలేకపోవడానికి వైకాపా చేసిన ఘనకార్యాలేంటని చంద్రబాబు దుయ్యబట్టారు. సచివాలయ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు. యువతకు వైకాపా ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని సహించేదే లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.