Politics

పద్మావతి అభ్యర్థిత్వం ఖరారు

Uttam Padmavathi Reddy Confirmed As Congress Candidate Of Huzurnagar

హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికకు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసింది. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి సతీమణి, మాజీ ఎమ్మెల్యే పద్మావతికే టికెట్‌ను కేటాయిస్తూ ఏఐసీసీ ప్రకటన జారీ చేసింది. పద్మావతి అభ్యర్థిత్వానికి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆమోదం తెలిపారని ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ముకుల్‌వాస్నిక్‌ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్‌నగర్‌ శాసనసభ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆయన నల్గొండ ఎంపీగా గెలుపొందారు. దీంతో తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేసిన ఉత్తమ్‌.. ఎంపీగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో హుజూర్‌నగర్‌ శాసనసభ స్థానానికి ఉపఎన్నిక నిర్వహించేందుకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. హుజూర్‌నగర్‌ అభ్యర్థి విషయంలో కాంగ్రెస్‌లో తొలుత కొంత గందరగోళం ఏర్పడింది. శ్యామల కిరణ్‌రెడ్డికి టికెట్‌ ఇవ్వాలంటూ ఎంపీ రేవంత్‌ సూచించారు. ఏకపక్షంగా ఉత్తమ్‌ పద్మావతికి ఆ టికెట్‌ను ఎలా కేటాయిస్తారంటూ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు కుంతియాను ఆయన ప్రశ్నించారు. ఆ పార్టీలోని మరికొంతమంది నేతలు మాత్రం దీన్ని వ్యతిరేకించారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సహా పలువురు నేతలు ఉత్తమ్‌ పద్మావతికే తమ మద్దతు అంటూ ప్రకటించారు.