Politics

నాకైతే గా కోరిక లే

kcr doesnt want to be prime minister

కేంద్రంలోనూ ప్రాంతీయ పార్టీల పెత్తనం ఉంటేనే రాష్ట్రాల సమస్యలు తీరుతాయని తెరాస అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ రోజూ తిట్టుకుంటున్నారని మండిపడ్డారు. ఇన్నాళ్లు దేశాన్ని పాలించింది ఆ రెండు పార్టీలేనని.. 70 ఏళ్లు గడిచినా దేశంలోని సమస్యలను ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు. వరంగల్‌లోని అజాంజాహీ మిల్లు మైదానంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. దేశంలో 70వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉందని, సమృద్ధిగా నీరు ఉన్నప్పటికీ వినియోగించుకోలేని నేతలు పాలించారని ధ్వజమెత్తారు. దేశంలోని వనరులన్నీ ప్రజల సౌభాగ్యం కోసం ఉపయోగంలోకి తేవాలని కోరారు. ప్రధాని ఎవరైనా తనకు సంబంధం లేదని, ప్రధాని కావాలనే కోరిక కూడా తనకు లేదని వ్యాఖ్యానించారు. ప్రధాని ఎవరైనా ప్రజల అభీష్టం నెరవేరాలనేదే తన ఆకాంక్ష అని చెప్పారు. పన్నుల రూపంలో తెలంగాణ నుంచి దిల్లీకి రూ.లక్షల కోట్లు వెళ్తున్నాయి గానీ.. రాష్ట్రానికి మాత్రం కేవలం రూ.25వేల కోట్లు మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెసేతర, భాజపాయేతర కూటమే కేంద్రంలో అధికారంలోకి రానుందని జాతీయ ఛానెళ్లు చెబుతున్నాయని.. 16 ఎంపీ స్థానాల్లో తెరాసను గెలిపిస్తే దేశ దశదిశను మార్చే రాజకీయాలు చేస్తామని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం అందించిన ప్రజలకు కేసీఆర్‌ ధన్యవాదాలు చెప్పారు. లోక్‌సభ ఎన్నికలు చాలా కీలకమైనవన్నారు. వరంగల్‌ ఉద్యమాల గడ్డ అని.. చైతన్యవంతులైన ఇక్కడి ప్రజలు ఐదేళ్ల క్రితం తెలంగాణ ఎలా ఉంది? ఇప్పుడెలా ఉందో ఆలోచించాలన్నారు. విద్యుత్‌ తలసరి వినియోగంలో తెలంగాణే నంబర్‌ వన్‌ అన్నారు. వ్యవసాయానికి 24గంటలు ఉచితంగా విద్యుత్‌ ఇచ్చేది మనమేనన్నారు. ఇంకా అనేక అంశాల్లో అగ్రస్థానంలో ఉన్నట్టు చెప్పారు. వరంగల్‌కు ఆరోగ్య విశ్వవిద్యాలయం తీసుకొచ్చినట్టు గుర్తుచేశారు. అలాగే దేవాదుల ద్వారా 75టీఎంసీల నీళ్లు వస్తున్నాయని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా భూ సంస్కరణలు అమలు చేశామని, ఎవరికీ రూపాయి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు.