మంగళగిరి సమీపంలో 2.5లక్షల చదరపు అడుగులతో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయాన్ని నవంబరు 8న ప్రారంభించనున్నారు.
అప్పటివరకు పార్టీ కార్యకలాపాలన్నీ గుంటూరు నుంచి నిర్వహిస్తారని తెదేపా వర్గాలు తెలిపాయి.
గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో జాతీయ రహదారి పక్కనే నిర్మిస్తున్న తెదేపా కేంద్ర కార్యాలయాన్ని నవంబరు 8న ప్రారంభించనున్నారు.
రాత్రి 7గంటల 19 నిమిషాలకు ముహూర్తం నిర్ణయించారు.
తెదేపా కార్యాలయ అవసరాల కోసం మొత్తం మూడు భవనాలు నిర్మిస్తున్నారు.
మొదట పూర్తి స్థాయిలో ఒక భవనాన్ని సిద్ధం చేయనున్నారు.
ఈ భవనాన్ని ప్రారంభించాక పార్టీ కార్యకలాపాల్ని పూర్తిస్థాయిలో అక్కడి నుంచే నిర్వహించనున్నారు. కొత్త కార్యాలయం సిద్ధమయ్యేంత వరకు …
ప్రస్తుతం గుంటూరు నుంచే పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తారు.
తెదేపా కేంద్ర కార్యాలయ భవనాల మొత్తం నిర్మిత ప్రాంతం 2.5 లక్షల చదరపు అడుగులు కాగా…,మొదటి భవనం నిర్మిత ప్రాంతం 75 వేల చదరపు అడుగులు. దీన్ని జీ + 3 విధానంలో నిర్మిస్తున్నారు.
ఈ భవనం మూడో అంతస్తులో చంద్రబాబు, లోకేశ్ చాంబర్లతో పాటు పొలిట్ బ్యూరో సమావేశ మందిరం ఉండనున్నాయి.
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి చాంబర్ మొదటి అంతస్తులో ఉంటుంది .
రెండో అంతస్తులో నాలెడ్జ్ సెంటర్ , సమాచార కేంద్రం వంటివి ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్లో మీడియా సమావేశాలు నిర్వహిస్తారు.