-సిఎం క్యాంప్ కార్యాలయంలో శ్రీ గుర్రం జాషువా జయంతి.
-ఘనంగా స్వర్గీయ గుర్రం జాషువాకు నివాళి.
-పాల్గొన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికార భాషాసంఘం చైర్మన్.
-ఈ సందర్బంగా పలువురు సాహిత్యకారులకు పురస్కారాలు.
-సీనియర్ నేత మరణంతో విశాఖకు వెళ్లాల్సి రావడంతో హాజరు కాలేకపోయిన సిఎం.
తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ప్రఖ్యాత రచయిత గుర్రం జాషువా 124వ జయంతిని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆధ్వర్యంలో పలువురు ప్రముఖులు, సాహితీ వేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీలు నందిగం సురేష్, రఘురామకృష్ణంరాజు, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, మల్లాది విష్ణు తదితరులు ఈ కార్యక్రమంకు హాజరయ్యారు. తొలుత స్వర్గీయ గుర్రం జాషువా చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో వక్తలు మాట్లాడారు. సామాజిక అంశాలను, అసమానతలను ఎత్తిచూపుతూ స్వర్గీయ గుర్రం జాషువా చేసిన రచనలు అభ్యుదయ రచయితలకు స్పూర్తిగా నిలిచాయని అన్నారు. సామాజిక చైతన్యం కోసం నడుం కట్టి నేటి తరం కవులకు ఆయన ఆదర్శ ప్రాయంగా నిలిచారని కొనియాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రముఖ రచయితలు కత్తి పద్మారావు, బోయి హైమావతి, ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి, ఆచార్య చందు సుబ్బారావులకు పురస్కారాలు అందజేశారు. పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి బలిరెడ్డి సత్యారావు ఆకస్మిక మరణంతో, విశాఖపట్నంకు వెళ్ళడం వల్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరుకాలేక పోయారు.