పెళ్లి.. ఒక అమ్మాయి జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం ఇది. మరి.. అంతటి ప్రాముఖ్యం ఉన్న వేడుకలో సింపుల్‌గా కనిపిస్తే ఎలా. అందుకే ఇప్పుడు ప్రతిఒక్కరూ ఖర్చుకు వెనకాడకుండా పెళ్లి బట్టల షాపింగ్ చేసేస్తున్నారు. చక్కటి చీరలతో పాటు రిసెప్షన్ లాంటి ఫంక్షన్లకు మంచి లెహెంగాలను కూడా ఎంచుకుంటున్నారు. అయితే పెళ్లి సందర్భంగా ప్రత్యేక లుక్ సొంతం కావాలంటే మాత్రం చీరతో పాటు దుపట్టా(Dupattas) ఉండాల్సిందే. అటు సంప్రదాయంతో పాటు ఇటు ఫ్యాషనబుల్‌గా కనిపించేలా చేసే ఈ దుపట్టాతో చీరకు మరింత లుక్ తేవడమెలాగో చూద్దాం రండి.
1. సింపుల్ అండ్ స్వీట్‌గా..
మీ చీర మరీ హెవీగా ఉంటే.. మీ లుక్‌ని మరీ గ్రాండ్‌గా మార్చడం మీకు ఇష్టం లేకపోతే.. సింపుల్ అండ్ స్వీట్‌గా ఉండే దుపట్టాని ఎంచుకోవడం మంచిది. ఇందుకోసం సింపుల్‌గా అక్కడక్కడా బుటీ వర్క్ లేదా సన్నని బోర్డర్ వచ్చిన దుపట్టాని ఎంచుకుంటే సరిపోతుంది. ఇది కూడా చీర రంగుతో మ్యాచవ్వాలని రూలేం లేదు. సింపుల్‌గా మీకు నచ్చిన రంగులో ఉన్న దుపట్టా వేసుకున్నా ప్రత్యేకంగా కనిపించే వీలుంటుంది.
2. అచ్చం అలాగే ఉండేలా..
కొంతమంది ఎంత గ్రాండ్ లుక్ ఉన్నా ఫర్వాలేదు.. పెళ్లి వేడుకల్లో అందరి కంటే మనమే ప్రత్యేకంగా కనిపించాలి అనుకుంటారు. తమ స్నేహితురాళ్లు వారి పెళ్లిళ్లలో ధరించిన దుస్తుల కంటే బెస్ట్ ఎంచుకొని ప్రశంసలు అందుకోవాలనుకుంటారు. ఇలాంటివారు ప్రత్యేకంగా పెళ్లి చీర, దాని బోర్డర్ ఏ రంగుల్లో ఉన్నాయో.. దుపట్టాని కూడా అవే రంగుల కాంబినేషన్‌లో ఎంచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇది మార్కెట్లో దొరకకపోతే మీ చీర రంగు దుపట్టా కొని దానికి బోర్డర్ రంగులో ఉండే బోర్డర్ లేస్ కుట్టించుకోవచ్చు. ఇది మీ చీరకు మరింత అద్భుతమైన లుక్‌ని జోడిస్తుంది.
3. విభిన్న రంగులతో..
ప్రస్తుతం వేర్వేరు రంగుల ఫ్యాషన్ నడుస్తోంది. మీ చీర బోర్డర్ రంగులోనే మీ బ్లౌజ్‌ని ఎంచుకుంటే దుపట్టాని వేరే రంగులో ఎంచుకొని ప్రత్యేకంగా కనిపించవచ్చు. ఈ లుక్ మిమ్మల్ని ఎంతో ప్రత్యేకంగా కనిపించేలా చేయడంతో పాటు మిమ్మల్ని రంగురంగుల సీతాకోక చిలుకలా మార్చుతుంది. ఇందుకోసం మీ చీర రంగుకి పూర్తి వ్యతిరేకంగా ఉండే రంగు దుపట్టా ఎంచుకోవడం వల్ల ప్రత్యేకమైన లుక్ సొంతమవుతుంది.
4. అదే రంగులో వేరే షేడ్..
చాలామంది ఒక రంగంటే చాలా ఇష్టపడుతుంటారు. అదే రంగును పెళ్లికి ధరించాలని కూడా భావించి అన్నీ అదే రంగులో ఎంచుకుంటారు. కానీ పై నుంచి కింది వరకూ ఒకటే రంగులో ఉంటే బాగుండదని అనిపిస్తే.. దుపట్టాని మాత్రం కాస్త మార్చి చూడండి. దీనికోసం మీకు నచ్చిన రంగును వదిలేయాల్సిన అవసరం లేదు. అదే రంగులో కాస్త లైట్ లేదా డార్క్ కలర్‌ని ఎంచుకొని స్ఫెషల్ లుక్ సొంతం చేసుకోవచ్చు.
5. పట్టుతో ప్రత్యేక లుక్
మీ పట్టు చీరకు కేవలం నెట్ దుపట్టాలను, సిల్క్‌లో ఉండే వాటిని ఎంచుకోవడం మాత్రమే కాదు.. వాటినీ పట్టులో కూడా ఎంచుకునే వీలుంటుంది. అయితే మీకు రాయల్ లుక్ కావాలనుకుంటేనే ఈ పట్టుపై పట్టు లుక్‌ని ప్రయత్నించండి. లేదంటే ఈ లుక్‌ని ఎంచుకోకపోవడం మంచిది. ఎందుకంటే ఈ లుక్ అందరికీ నప్పకపోవచ్చు. మీ నగలు, చీర లుక్ ఆధారంగా దీన్ని సెలెక్ట్ చేసుకొని మెరిపించండి.