కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న పడవ లాంటిదని.. అలాంటి పార్టీకి ప్రజలు ఓటు వేయరని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ అన్నారు. హుజూర్‌నగర్ నియోజకవర్గంలో తెరాసకు ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నారన్నారు. హుజూర్‌నగర్ ప్రచార బాధ్యులతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉప ఎన్నికలో తెరాస భారీ మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రం, రాష్ట్రాల్లో అధికారంలో లేని కాంగ్రెస్ ఎలా అభివృద్ధి చేయగలదని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ గెలుపుతో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. పోటీలో ఉన్న తెదేపా, భాజపాలకు ప్రజల నుంచి పెద్దగా మద్దతు ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. హుజూర్‌నగర్‌లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హుజూర్‌నగర్ అభివృద్ధి విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి అవాస్తవాలు మాట్లాడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతు బీమా, ఆసరా పింఛన్, అన్ని రకాల ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ అమలవుతున్నాయని.. అవన్నీ ఉత్తమ్‌కు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ఈ విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తున్న అసత్య ఆరోపణలను ప్రజలు పట్టించుకోరని కేటీఆర్ చెప్పారు. ఈ ఐదేళ్లలో అక్కడ తెరాస ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని ప్రచార బాధ్యులకు కేటీఆర్ సూచించారు.
క్షేత్రస్థాయిలో తెరాసకు బలం
Related tags :