మహిళలు గర్భం ధరించారంటే చాలు.. ఆహారపు అలవాట్లు, జీవనశైలిని పూర్తిగా మార్చుకోవాల్సి ఉంటుంది. వారాలు గడుస్తున్న కొద్దీ తినే ఆహారంలో, తాగే నీరు, ఇతర ద్రవాల పట్ల, ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక గర్భిణీలు పుల్లగా ఉండే నిమ్మ, ఊరగాయ, ఇతర పండ్లను తినేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. అయితే అలాంటి పండ్లలో చింతపండు కూడా ఒకటి. ఇది మనం సహజంగా తరచూ తినే పండ్ల మాదిరి పండు కాకపోయినా గర్భిణీలకు మాత్రం చింతపండు ఎంతో మేలు చేస్తుంది. మరి దాని వల్ల గర్భిణీలకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. చింతపండు లేదా చింతకాయల్లో విటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
2. చింతకాయల్లో ఉండే నియాసిన్ (విటమిన్ బి3) కడుపులోని బిడ్డ ఎదుగుదలకు ఎంతగానో దోహదపడుతుంది. బిడ్డ మెదడు, జీర్ణవ్యవస్థ, మ్యూకస్ తదితర అవయవాలు సరిగ్గా పెరిగేలా చేస్తుంది.
3. చింతకాయల్లో ఉండే డైటరీ ఫైబర్ మలబద్దకం రాకుండా చూస్తుంది. అధిక బరువు పెరగకుండా రక్షిస్తుంది.
4. చాలా మంది గర్భిణీలకు ఉదయం నిద్ర లేవగానే వికారంగా వాంతికి వచ్చినట్లు అనిపిస్తుంది. అలాంటి వారు చింతపండు లేదా కాయలను కొద్దిగా తింటే ఫలితం ఉంటుంది.
5. చింతకాయలను తినడం వల్ల శిశువు నెలలు నిండకుండా పుట్టే స్థితి రాకుండా ఉంటుంది. అలాగే తల్లులకు జెస్టేషనల్ డయాబెటిస్ రాకుండా ఉంటుంది.
6. హైబీపీ సమస్య ఉండే గర్భిణీలు చింతకాయలను తీసుకుంటే మంచిది. అలాగే క్యాన్సర్ కణాలు పెరగకుండా చూసే ఔషధ గుణాలు కూడా చింతకాయల్లో ఉంటాయి.