Movies

స్క్రిప్ట్ మొత్తం చదివి వినిపిస్తున్నారు

Avasrala Sreenivas On Current Generation Film Makers

‘‘ఒకప్పుడు నటులకి కథ చెప్పేవాళ్లు కాదు. ఇన్ని రోజులు డేట్లు కావాలని అడిగేవాళ్లంతే. ఇప్పుడు నటులకి స్క్రిప్టు మొత్తం చెబుతున్నార’’న్నారు శ్రీనివాస్‌ అవసరాల. ఓ వైపు దర్శకత్వం చేస్తూనే, మరో పక్క నటుడిగా బిజీగా ఉన్నారాయన. తాజాగా నవీన్‌ విజయ్‌ కృష్ణతో కలిసి ‘ఊరంతా అనుకుంటున్నారు’లో నటించారాయన. ఆ చిత్రం శనివారం విడుదలవుతున్న సందర్భంగా శ్రీనివాస్‌ అవసరాల బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ…
* ‘‘చాలా రోజుల తర్వాత వస్తున్న కుటుంబ కథా చిత్రం ‘ఊరంతా అనుకుంటున్నారు’. ఈమధ్య కాలంలో అబ్బాయిలు, అమ్మాయిలు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే గతంలో పరిస్థితులు ఎలా ఉండేవనే విషయాన్ని ఆసక్తికరంగా చెప్పే చిత్రమిది. సంప్రదాయాల్ని గౌరవించే ఓ జంట కథే మా చిత్రం. నేను తమిళ కుర్రాడిగా కనిపిస్తా. సంగీత కళాకారుడైన అతడు ఒక అమ్మాయిని ప్రేమించి వాళ్ల ఊరికొస్తాడు. అక్కడికొచ్చాక ఏం జరిగిందనేదే ఈ చిత్రం. ఇందులో నవీన్‌తో పాటు నేనూ హీరోనే’’.
* ‘‘నటుడిగా కథ విన్నా నాలో దర్శకుడు, రచయిత ఉన్నారు కాబట్టి ఆ కోణంలోనూ ఆలోచిస్తా. నటులంతా స్క్రీన్‌ రైటింగ్‌ నేర్చుకోవాలి. ఒకసారి కథ విని ఒప్పుకొన్నాక దర్శకుడు చెప్పిందే చేస్తుంటా. ఒక్కోసారి కథ నచ్చితే ఉచితంగా కూడా చేస్తా. ఇటీవల ‘మిడిల్‌ ఫింగర్‌’ అనే లఘు చిత్రంలో అలాగే నటించా’’.
* ‘‘దర్శకుడిగా మారడంతో నటుడిగా మంచి పాత్రల్ని కోల్పోతున్నాననే అభిప్రాయం ఎప్పుడూ కలగలేదు. దర్శకత్వం నాలోని నటుడికి సాయం చేస్తుంది. ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాను. నాగశౌర్య, మాళవిక నాయర్‌ జంటగా నటిస్తున్నారు. 18 ఏళ్ల వయసులో ఉన్న ఒక జంట కథ అది’’.