తన పెండ్లికి ముందు తండ్రి మరణించడంతో ఆ యువతి ఎంతో బాధపడింది. తండ్రి జ్ఞాపకాలను పదిలపరుచుకోవాలనుకొన్నది. పెండ్లి సమయంలో తండ్రి లేని లోటును ఆ విధంగా తీర్చుకోవాలనుకొని ఆయన చితాభస్మంతో గోళ్లను అందంగా అలంకరించుకున్నది. బ్రిటన్‌కు చెందిన చార్లట్ వాట్సన్ అనే యువతికి నిక్ అనే వ్యక్తితో వివాహం నిశ్చయమైంది. అయితే ఆమె తండ్రి మిక్ బార్‌బర్ క్యాన్సర్ బారిన పడటంతో వారి పెండ్లి వాయిదా పడింది. అనంతరం నాలుగు నెలలకు ఆయన చనిపోయారు. అయితే వివాహం సందర్భంగా తండ్రి జ్ఞాపకాలు తన వెంట ఉండాలని వాట్సన్ భావించింది. తన మనసులోని మాటను బంధువైన క్రిస్టీ మెకిన్‌కు చెప్పింది. గోళ్ల అలంకరణలో నిఫుణురాలైన ఆమెకు ఓ ఉపాయం తట్టింది. వాట్సన్ తండ్రి చితాభస్మంతో ఆమె గోళ్లను అందంగా అలంకరిస్తానని చెప్పింది. దీనికి ఆమె అంగీకరించడంతో తనలోని సృజనాత్మకతను ప్రదర్శించింది. వధువు గోళ్లను ఆమె తండ్రి చితాభస్మంతో అందంగా తీర్చిదిద్దింది. అలాగే పాదరక్షలతోపాటు పెండ్లిలో ఉపయోగించే పుష్ఫగుచ్ఛంపై ఆమె తండ్రి మిక్ బార్‌బర్ ఫోటోలను ముద్రించింది. ఆయన జీవించి ఉన్నప్పుడు ధరించిన దుస్తులతో ఓ బొమ్మను కూడా తయారు చేసింది. వీటన్నింటితో తండ్రి తనతోనే ఉన్నట్లుగా భావించిన ఆ యువతి బంధువుల సమక్షంలో నిక్‌ను పరిణయమాడింది. కాగా ఈ అందమైన గోళ్ల అలంకరణ దృశ్యాలను క్రిస్టీ మెకిన్ తన యూట్యూబ్ చానల్‌లో పోస్టు చేసింది. ఆమెకున్న లక్షలాది అభిమానుల నుంచి ప్రశంసలు అందుకున్నది.
తండ్రి అస్థికలతో గోళ్ల రంగు
Related tags :