అమెరికాలోని డల్లాస్‌లో మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. మహాత్మాగాంధీ మెమోరియల్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు భారతీయులు వందలాదిగా హాజరయ్యారు. ముందుగా అమెరికాలోని అతిపెద్ద గాంధీ విగ్రహం వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ విచ్చేసి మహాత్ముడికి నివాళులు అర్పించారు. అనంతరం కార్తీకేయ చావలి, అభిరాం తాడేపల్లిలు మహాత్ముడికి ఇష్టమైన భజన వైష్ణవ జనతో గేయాన్ని ఆలపించారు. అబాట్‌తో పాటు ఇర్వింగ్ నగర మేయర్ రిక్‌స్టోఫర్, టెక్సాస్ ప్రతినిధి జులీజాన్సన్, డిప్యూటీ కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా సురేంద్ర అదానాలు ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంజీఎంఎన్‌టీ కమిటీ సభ్యులు గవర్నర్‌ను సత్కరించారు.
అనంతరం ఎంజీఎంన్‌టీ ఛైర్మన్ ప్రసాద్ తోటకూర తన ప్రసంగంలో గాంధీజీ చెప్పిన సిద్దాంతాలను తెలియజేశారు. 12దేశాల్లో స్వాతంత్ర్య ఉద్యమాలకు మహాత్ముడే స్ఫూర్తి అని వెల్లడించారు. ప్రపంచ నాయకులు జూ మార్టిన్‌లూథర్ కింగ్, నెల్సన్ మండేలా ఆయన మార్గాన్నే అనుసరించారని తెలిపారు. గాంధీజీ ప్రపంచంలోని 80 ప్రభావవంతమైన దేశాల్లో శాంతికి చిహ్నమని అన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. భారత్, టెక్సాస్ మధ్య మంచి సంబంధాలు కొనసాగుతున్నాయని చెప్పారు. మహాత్మాగాంధీ అనుసరించిన శాంతి, అహింస మార్గాలను మనం పాటించాలని కోరారు. భారత డిప్యూటీ కాన్సులర్ జనరల్ సురేంద్ర అదానా మాట్లాడుతూ.. గాంధీ శాంతి ర్యాలీ నిర్వహించినందుకు భారతీయ అమెరికన్లను అభినందించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులను ఎంజీఎంఎన్‌టీ కార్యదర్శి రావ్ కల్వల స్వాగతించగా, సంస్థ ఉపాధ్యక్షులు బీఎన్ రావు గాంధీ చెప్పిన సిద్ధాంతాలను గుర్తుచేశారు. ప్రసాద్ తోటకూర అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డైరక్టర్లు రావ్ కల్వల, బీఎన్ రావు, జాన్ హమ్మండ్, అభిజిత్ రాయ్‌ల్కర్, అక్రమ్ సయద్, కమల్ కౌశల్, పియూష్ పటేల్, తాయబ్ కుందావాలా, నిర్వహణ కమిటీ సభ్యులు ఆనంద్ దాసరి, డా. సాత్ గుప్త, మురళి వెన్నం, రానా జాని, శ్రీధర్ తుమ్మల, శ్రీకాంత్ పోలవరపు, శబ్నామ్ మోడ్గిల్, వెంకట్ గుత్తా, సంతే చారీ, రాజేంద్ర వంకవల పాల్గొన్నారు.