DailyDose

రావణాసురుడికి ప్రత్యేక పూజలు-తాజావార్తలు-10/08

Kanpur People Conducts Special Puja For Ravana Brahma

* భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌ పురస్కారం వరించింది. ఈ మేరకు పురస్కార కమిటీ మంగళవారం ప్రకటించింది. 2019గాను జేమ్స్‌ పీబెల్స్‌, మైకెల్‌ మేయర్‌, డైడియర్‌ క్యూలోజ్‌లకు ఈ పురస్కారాన్ని సంయుక్తంగా అందజేయనున్నట్లు ప్రకటించారు. భౌతిక విశ్వసృష్టిలో సైద్ధాంతిక ఆవిష్కరణలతో పాటు సూర్యుడిని పోలిఉండే నక్షత్రం చుట్టూ తిరిగే గ్రహం కనుగొన్నందున వారికి ఈ అరుదైన గౌరవం దక్కింది.

* మైసూరులో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మైసూరు రాజవంశస్థులు యదువీర్‌ కృష్ణదత్త చామరాజ ఒడయార్‌ సంప్రదాయబద్ధంగా శమీ వృక్షానికి పూజలు నిర్వహించారు. సాయంత్రం జరిగే జంబూ సవారీ కోసం గజరాజుల్ని నిర్వహకులు అందంగా అలంకరించారు. ఈ ఘట్టాన్ని వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. మరోవైపు మైసూర్‌ రాజభవనంలో క్రీడా, సాంస్కృతిక పోటీలు ప్రారంభమయ్యాయి.

* మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌, జనసేన మాజీ నేత ఆకుల సత్యనారాయణ వైకాపాలో చేరారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ వారిద్దరికీ పార్టీ కండువా కప్పి వైకాపాలోకి ఆహ్వానించారు. జగన్‌ సుపరిపాలనలో భాగమయ్యేందుకే పార్టీలో చేరుతున్నట్లు వారు చెప్పారు.

* మూసీ ప్రాజెక్ట్‌కు అత్యవసరంగా అమర్చాల్సిన గేటు ప్రత్యేక వాహనంలో ప్రాజెక్టు వద్దకు తరలించారు. చిత్తూరు జిల్లాలోని కల్యాణి డ్యామ్‌ వద్ద నుంచి ఈ గేటును తీసుకొచ్చారు. గేటు అమర్చే పనులు ఈరోజు నుంచే ప్రారంభమవుతాయని తెలంగాణ విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. మూసీ ప్రాజెక్టు వద్దకు తీసుకొచ్చిన గేటును ఆయన పరిశీలించారు.

* పాకిస్థాన్‌ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌ వద్ద ఉన్న హుస్సేనివాలా సరిహద్దు సమీపంలో పాక్‌కు చెందిన డ్రోన్‌ను భారత సరిహద్దు భద్రతా దళాలు గుర్తించాయి. పాక్‌కు చెందిన డ్రోన్‌ ఐదు సార్లు అక్కడే చక్కర్లు కొట్టి ఓసారి భారత సరిహద్దును కూడా దాటింది. దీన్ని గమనించిన భారత జవాన్లు వెంటనే సీనియర్‌ అధికారులను అప్రమత్తం చేశారు.

* మూకదాడులు పాశ్చాత్య సంస్కృతి అని..వీటితో దేశ ప్రతిష్ఠ దిగజార్చొద్దని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆరెస్సెస్‌) చీఫ్‌ మోహన్‌ భగవత్‌ కోరారు. అధికరణ 370ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ప్రశంసించారు. నాగ్‌పూర్‌లో దసరా సందర్భంగా మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. దేశంలో చోటుచేసుకుంటున్న మూకదాడులపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

* జమ్మూకశ్మీర్‌లో మంగళవారం భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. పుల్వామా సమీపంలోని అవంతిపుర పట్టణ శివార్లలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు, భద్రతా బలగాలు నిర్బంధ తనిఖీలు నిర్వహించి ఉగ్రవాదిని మట్టుబెట్టాయి.

* ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. అర్ధరాత్రి నుంచే అమ్మవారి దర్శనానికి భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. అమ్మవారిని రాష్ట్ర మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సహా పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.

* విజయదశమి సందర్భంగా దేశప్రజలు దుర్గామాతను కొలిచి రావణదహనం చేస్తారు. కానీ, కొన్ని ప్రాంతాల్లో ఏకంగా రావణాసురుడికే ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో భక్తులు రావణాసురుడికి ప్రత్యేకంగా గుడి కట్టి మరీ పూజలు చేస్తున్నారు. స్థానిక క్షత్రియ సమాజానికి చెందిన సభ్యులు ఆలయాన్ని అందంగా అలంకరించి… దీపారాధన నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు.

* ‘జార్జ్‌రెడ్డి’ సినిమా ట్రైలర్‌ వచ్చేసింది. 1970వ దశకంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి నేతగా ఎదిగిన జార్జ్ రెడ్డి జీవితం ఆధారంగా రూపొందిస్తున్న చిత్రమిది. టైటిల్‌ పాత్రలో ‘వంగవీటి’ ఫేమ్ సందీప్ కుమార్ నటిస్తున్నారు. ‘పేదలు ఇంకా పేదలు అవుతున్నారు.. ధనికులు ఇంకా ధనికులుగా మారుతున్నారు..’ అనే డైలాగ్‌తో ట్రైలర్‌ ఆరంభమైంది.