ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియ భర్త భార్గవరామ్‌పై మరో ఫిర్యాదు అందింది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఇప్పటికే ఆయనపై రెండు కేసులు నమోదయ్యాయి. ఆళ్లగడ్డ ఎస్‌ఐ రమేశ్ కుమార్ తాజాగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆళ్లగడ్డలో నమోదైన రెండు కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న భార్గవరామ్‌ను అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు ఇక్కడికి వచ్చారు. సోమవారం సాయంత్రం తన కారు(నల్లరంగు ఫార్చునర్; ఏపీ 21 సీకే 0222)ను స్వయంగా నడుపుకుంటూ వెళుతున్నభార్గవను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఏపీ పోలీసులను గుర్తించిన భార్గవ కారు ఆపకుండా వేగంగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దారి గుండా తప్పించుకునే ప్రయత్నం చేశారు. గచ్చిబౌలిలోని ఓక్ వుడ్ హోటల్ వద్ద భార్గవ కారు ఆపేందుకు పోలీసులు ప్రయత్నించగా, కారు ఆపినట్లే ఆపి తప్పించుకున్నారు. తమ విధులకు ఆటంకపరచడంతో పాటు కారుతో గుద్దే ప్రయత్నం చేశాడని భార్గవపై ఎస్‌ఐ రమేశ్‌కుమార్ ఫిర్యాదు చేశారు. దీంతో ఐపీసీ సెక్షన్ 353, 336 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. భార్గవరామ్‌ను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
కారుతో గుద్దే ప్రయత్నం చేశాడని అఖిలప్రియ భర్తపై కేసు
Related tags :