Agriculture

60 వరి వంగడాలు ఒకేచోట సాగు-నిజామాబాద్ రైతు విన్యాసం

Telugu Agricultural Agriculture News | Nizamabad Farmer Growing 60 Varieties Of Rice In One Farm

గంగశాల, రవ్యకళి, నల్లకొండెం, పాలపట్టి, పంచరత్నం, బంగారు గులాబి…ఏమిటివి అంటారా?వరి వంగడాల పేర్లే ఇవి. ఇవే కాదు.. ఇలాంటి 60 రకాలు ఒకే దగ్గర సాగవుతుంటే ఎలా ఉంటుంది?ఆ అద్భుతం వీక్షించాలంటే నిజామాబాద్‌ జిల్లాకు వెళ్లాల్సిందే. దేశవిదేశాల నుంచి 102 రకాల విత్తనాలు తెచ్చి గూపన్‌పల్లిలో పండించే రైతు చిన్నికృష్ణుడి వ్యవసాయక్షేత్రం చూడాల్సిందే.చదివింది ఆరో తరగతే అయినా… 7 రకాల వంగడాలు సృష్టించ గలిగిన ఆయన కృషిని పరిశీలించాల్సిందే. భావితరాలకు వంగడ వారసత్వాన్ని పంచడానికి..! రేపటి పౌరుల ఆరోగ్యం పెంచడానికి..! తనవంతు కృషి చేస్తున్న కృషీవలుడి కథ ఇది.

ఇప్పుడు మనం తీసుకొంటున్న ఆహారం ఎలాంటిదో… ఆసుపత్రుల్లో క్యూలను చూసి అర్థం చేసుకోవచ్చు. పోటీ ప్రపంచంలో రైతు అధిక దిగుబడుల కోసం అంతగా నాణ్యత లేని వాటిపై మక్కువ చూపుతున్నారు. దీంతో మంచి పంటలు ప్రజలకు చేరడం లేదు. మన పూర్వీకులు పండించి తిన్న మంచి వంగడాలన్నీ దాదాపు కనుమరుగయ్యాయి. తాతలు, ముత్తాతలు పాటించిన ఆహార పద్ధతులు మనం మరచిపోయినా.. కొన్ని పాశ్చాత్య దేశాలేమో వాటిని అలవర్చుకొనేందుకు తహతహలాడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మన పురాతన ఆహారోత్పత్తులను తిరిగి బతికించుకొని, భావితరానికి అందించాలనే తపనతో ఓ నిజామాబాద్‌ రైతు ముందుకొచ్చారు. లాభాలు పక్కనబెట్టి పుష్కరకాలంగా సంప్రదాయ పద్ధతులతో ప్రకృతి సేద్యం చేస్తున్నారు. ఇప్పటి వరకు 109 వరి వంగడాలను సాగు చేస్తూ చిన్నికృష్ణుడు పెద్ద(వ్యవ)సాయం చేస్తున్నారు.

చిన్నికృష్ణుడు(గంగారాం) స్వస్థలం నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లి మండలం చింతలూరు. చదివింది ఆరో తరగతి. గూపన్‌పల్లిలో తనకున్న రెండున్నర ఎకరాల భూమినే నమ్ముకొని 50 ఏళ్లుగా సేద్యం చేస్తున్నారు. తనకు ముగ్గురు సంతానం. ఇద్దరు అమెరికాలో ఉంటూ తండ్రికి సహకరిస్తున్నారు. చిన్నికృష్ణుడు నాణ్యమైన ఉత్పత్తులనివ్వాలనే లక్ష్యంతో దేశ, విదేశాల్లో తిరిగి 102 వంగడాలు సేకరించారు. 7 అరుదైన కొత్త రకాలను తన ప్రయోగాలతో సృష్టించారు. 2007లో మొదలైన తన ప్రయోగాల ప్రస్థానాన్ని ఇంకా కొనసాగిస్తున్నారు. ఈ సీజన్‌లోనూ 60 రకాల వంగడాలతో సేద్యం చేస్తూ అందరిని అబ్బురపరుస్తున్నారు.

వరి పొలమనగానే ఆకుపచ్చగా ఉంటుందనే తెలుసు. చిన్నికృష్ణుడి పొలానికి వెళ్తే అక్కడ నలుపు, ముదురు రంగు మడులూ కనిపిస్తాయి. త్వరలో తెలుపు రంగులోనూ పైరు చూస్తారని, ఎనిమిది రంగుల్లో ఇలా పైరును చూశానని ఈ అన్నదాత కళ్లు ఇంత పెద్దవి చేసి చెబుతారు. నరాల బలహీనత, అంధత్వ లోప నివారణకు, సుఖప్రసవానికి, దృఢత్వానికి కొన్ని ప్రత్యేక వంగడాలు ఉన్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం దేశ, విదేశీ రకాలతో సూర్య, చంద్ర మండలాలుగా మడులు కట్టి కనువిందు చేసేలా పొలం సిద్ధం చేశారు. ఏ వ్యవసాయ డిగ్రీ, పీహెచ్‌డీలు చదవకున్నా తనకున్న ఆపార మేధస్సుతో నూతన వంగడాల రూపకల్పనకు, శాస్త్రీయ సాగుకు ముందుకొచ్చిన చిన్నికృష్ణుడి వ్యవసాయక్షేత్రం పరిశోధన స్థానాలనే మురిపించేలా ఉంటుంది. శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోయేలా చేస్తున్న ప్రయోగాలు నేటి విద్యార్థి లోకానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. అందుకే వివిధ విద్యాసంస్థల విద్యార్థులు, ఇతర ప్రాంతాల రైతులు ఆయన పొలం చూసేందుకు తరలి వస్తుంటారు. సాగు పద్ధతులు, మెలకువలు సవివరంగా తెలుసుకొంటుంటారు. వరితోపాటు కొర్రలు, రాగులు, ఉలవలు, అరికెలు, సామలు.. వంటి చిరుధాన్యాలను పండిస్తూ వాటి ఆవశ్యకతను వివరిస్తున్నారీ హాలికుడు.

గతేడాది అమెరికాలోని తన కొడుకు దగ్గరకు వెళ్లినప్పుడు అక్కడ ఓ క్షేత్రంలో దేశ, విదేశాలకు చెందిన అతి పురాతన, నూతన వంగడాల బియ్యం మేళవింపుతో ప్రదర్శన జరుగుతోంది. అక్కడకి వెళ్లి పది రకాలను వెంట తెచ్చుకున్నారు. వచ్చీరాగానే నీటిలో నానబెట్టి ఓ తడిగుడ్డలో పోసి కట్టిపెట్టారు. అందులో చైనాకు చెందిన ఫర్‌బిడెన్‌ రైస్‌ నీళ్లలో వేయగానే కొద్దిసేపటికి అన్నంగా మారింది. మిగతావాటిల్లో ఏడు రకాలకు మొలకలు వచ్చాయి. అలా అమెరికా, థాయిలాండ్‌, ఇండోనేషియా, జపాన్‌, పాకిస్థాన్‌, పిలిప్పిన్స్‌ దేశాల వంగడాలకు కర్షక కృష్ణుడు ఇక్కడ కొత్తజీవం పోస్తున్నారు. ఎన్నో ప్రయోగాలు చేస్తున్న చిన్ని కృష్ణుడు అయిదేళ్ల కిందట కనుగొన్న ఓ రకానికి తన పేరునే(చిన్నికృష్ణ) పెట్టుకున్నారు. ఇలా చేసిన మరో ప్రయోగం ఇప్పుడు చింతలూరు సన్నాలు పేరుతో వేములవాడ, కృష్ణా జిల్లాల్లో సాగవుతుందని తెలిసి పరవశించిపోయారు. అంతేకాద[ండోయ్‌ మన తెలుగు రాష్ట్రాలతోపాటు పక్క రాష్ట్రాల నుంచీ విత్తనాలు తీసుకొచ్చి పండిస్తున్నారు. వంగడాల వైవిధ్యాన్ని సంరక్షిస్తున్నారు.

‘‘నేను సేకరించిన విత్తనాలను ఆసక్తి ఉన్న వారికి ఇచ్చి సాగు చేయిస్తా. నేను మళ్లీ కొత్త రకాలు తెచ్చి పంటవేస్తా. ఇలా అనేక ప్రయోగాలతో వెలుగులోకి వచ్చే వాటికి పేటెంట్‌ హక్కులు సాధించేందుకు దరఖాస్తు చేశా. అమెరికాలోని ఓ క్షేత్రంలో ఉన్న మూడు వందల ఎకరాల్లో త్వరలో సంప్రదాయ పద్ధతులతో ప్రయోగాలు చేయడానికి ప్రయత్నిస్తున్నా. మన దేశ పురాతన సాగు పద్ధతులతో నాణ్యమైన ఉత్పత్తులు సాధిస్తా. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన పౌర జీవితానికి రైతుగా నా వంతు కృషిచేస్తా.—చిన్నికృష్ణుడు