కొన్ని కాంబినేషన్ల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. మా హీరోతో ఆ దర్శకుడు ఎప్పుడు సినిమా తీస్తాడా? అని అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు. అలాంటి కాంబోనే రజనీకాంత్-మురుగదాస్. వీరిద్దరి కలయికలో వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘దర్బార్’. నయనతార కథానాయిక. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి రజనీకాంత్‌తో సినిమా చేసే అవకాశం మురుగదాస్‌కు ఎలా వచ్చింది? ఇన్నేళ్లు పట్టడానికి కారణం ఏంటి? ఎప్పుడు కథ వినిపించారు? ఇలాంటి ఆసక్తికర ప్రశ్నలకు ఆయనే ఓ ఇంటర్వ్యూలో ఇలా చెప్పుకొచ్చారు.
‘‘గజినీ’ విడుదలైన తర్వాత రజనీ సర్ నాకు ఫోన్ చేశారు. వెళ్లి కలిస్తే అభినందనలు తెలిపారు. అయితే, అప్పుడు మా ఇద్దరి మధ్య సినిమా గురించి ఎలాంటి చర్చా జరగలేదు. ఆ తర్వాత రెండేళ్లకు మళ్లీ ఓ సందర్భంలో కలిశాం. ‘మనిద్దరం కలిసి ఓ సినిమా చేద్దాం’ అని ఆయన అన్నారు. ఎందుకు ఆలస్యమైంది కారణాలు తెలియదు కానీ, వాయిదా పడుతూ వచ్చింది. ‘సర్కార్’ షూటింగ్ జరుగుతుండగా రజనీ మళ్లీ నన్ను పిలిచారు.’’
‘‘ఈసారి అవకాశం వదులుకోకూడదనుకున్నా. సింగిల్‌లైన్ స్టోరీ వినిపించా. ఆయనకు నచ్చింది. కొన్ని మార్పులు చెప్పారు. ఆ తర్వాత రోజు కలిసి మళ్లీ కథ వినిపించా. నెల రోజుల తర్వాత గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీంతో ‘దర్బార్’ పట్టాలెక్కింది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పటివరకూ నేనూ సినిమా చేయలేదు. నేను కూడా థియేటర్లో ఎప్పుడెప్పుడు చూద్దామా? అని ఎంతో ఆసక్తిగా ఉన్నా’’
‘‘మరో విషయం ఏంటంటే, ఇది రాజకీయ నేపథ్యంతో నడిచే కథ కాదు. థ్రిల్లింగ్ కమర్షియల్ ఎంటర్టైనర్. మళ్లీ చెబుతున్నా, ఇది రాజకీయ సినిమా మాత్రం కాదు. ‘అలెక్స్ పాండియన్’లాంటి పోలీస్ ఆఫీసర్ కథ’’ అని చెప్పుకొచ్చారు. రజనీకాంత్ ఇందులో రెండు వైవిధ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. అంతేకాదు, దాదాపు 25 సంవత్సరాల తర్వాత పోలీస్ పాత్రను చేస్తుండటం విశేషం. అంతేకాదు, నవంబరు 7న ‘దర్బార్’ మోషన్ పోస్టర్‌ను విడుదల చేయనున్నారు.