దగ్గు రావటానికి ఇన్ఫెక్షన్లు, ఆస్థమా, అలర్జీ వంటి రకరకాల అంశాలు దోహదం చేస్తాయి. మీ సమస్యకు మూలం ఏంటన్నది తెలుసుకొని చికిత్స తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. మీరు చెబుతున్న పీసీఓస్, థైరాయిడ్ సమస్యలకూ దగ్గుకూ ఎలాంటి సంబంధం లేదు. మధుమేహం విషయంలో మాత్రం అప్రమత్తత అవసరం. ఎందుకంటే మధుమేహం రోగనిరోధకశక్తిని తగ్గిస్తుంది. రోగనిరోధక వ్యవస్థలో భాగమైన టి కణాలు, బి కణాలు రెండింటినీ నిర్వీర్యం చేస్తుంది. దీంతో ఇన్ఫెక్షన్ల ముప్పూ పెరుగుతుంది. ముఖ్యంగా టి కణాల సామర్థ్యం తగ్గిపోతే క్షయ వచ్చే అవకాశం ఎక్కువ. సాధారణంగా వంద మందిలో ఒకరికి క్షయ వస్తే.. మధుమేహుల్లో 20 మందికి వచ్చే అవకాశముంది. అందువల్ల అశ్రద్ధ తగదు. ఆకలి లేకపోవటం, బరువు తగ్గటం, గ్లూకోజు నియంత్రణలో లేకపోవటం, నీరసం, త్వరగా అలసట, మాటిమాటికీ కోపం వంటి లక్షణాలు కనిపిస్తుంటే నిర్లక్ష్యం అసలే పనికిరాదు. ఛాతీ వ్యాధుల నిపుణులను సంప్రదించటం మంచిది. మీకు ముందుగా ఛాతీ ఎక్స్‌రే తీసి పరిశీలించాల్సి ఉంటుంది. అవసరమైతే కళ్లె పరీక్ష చేయాల్సి వస్తుంది. మామూలు ఇన్ఫెక్షన్ అయితే యాంటీబయోటిక్స్‌తో దగ్గు తగ్గిపోతుంది. అదే క్షయ అయితే తగు చికిత్స తీసుకోవాలి. ఒకవేళ ఎక్స్‌రే నార్మల్‌గా ఉన్నట్టయితే- ఊపిరితిత్తుల సామర్థ్య (లంగ్ ఫంక్షన్) పరీక్ష చేసి ఆస్థమా ఉందేమో చూడాల్సి ఉంటుంది. ఆస్థమాకు ఇప్పుడు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. కొన్నిసార్లు కాలుష్యం, పరిసరాల ప్రభావంతో అలర్జీ ప్రేరేపితమై దగ్గు రావొచ్ఛు ఇంట్లో బూజు దులపటం, అటకలు శుభ్రం చేయటం, బొద్దింకలను తరమటానికి స్ప్రేలు చల్లటం, ఆసిడ్‌తో బాత్రూమ్ శుభ్రం చేయటం వంటి పనులు ఇందుకు దోహదం చేస్తుండొచ్ఛు ఇంటి పరిసరాల్లో పావురాలు, పిట్టల వంటి వాటి రెక్కల, రెట్టల దుమ్ముతోనూ అలర్జీ ప్రేరేపితం కావొచ్ఛు ఇలాంటివి దగ్గుకు దారితీస్తున్నట్టు గమనిస్తే వాటికి దూరంగా ఉండాలి.
మధుమేహులు దగ్గుతో జాగ్రత్తగా ఉండాలి
Related tags :