తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె మొదలై 14 రోజులు కావటంతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మంత్రి పువ్వాడ అజయ్ కు ఫోన్ చేసి సమ్మె మరియు ఇతర విషయాల గురించి ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్రత మరియు సెల్ఫ్ డిస్మిస్ గురించి వివరాలు మంత్రి పువ్వాడ అజయ్ ను అడిగినట్లు సమాచారం. సెల్ఫ్ డిస్మిస్ అనే పదం కార్మిక చట్టాల్లో ఉందా..? అని మంత్రిని గవర్నర్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
కార్మిక చట్టాల్లో సెల్ఫ్ డిస్మిస్ అనే పదం లేనప్పుడు 48 వేల మంది ఆర్టీసీ కార్మికులను తొలగించినట్లు ప్రకటన ఎలా చేస్తారని ప్రశ్నించారని తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులు ఇప్పటికే పలు సందర్భాలలో గవర్నర్ ను కలిసి సమ్మె గురించి గవర్నర్ కు వివరించారు. ఆర్టీసీ జేఏసీ ప్రభుత్వ వైఫల్యం వలనే సమ్మె జరుగుతున్నట్లు గవర్నర్ కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
మూడు రోజుల క్రితం ప్రధాని మోదీతో భేటీ అయిన గవర్నర్ తమిళిసై ప్రభుత్వం యొక్క పనితీరు, ఆర్టీసీ సమ్మె మొదలైన విషయాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. గవర్నర్ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మను రాజ్ భవన్ కు పిలిపించి సమ్మె వలన ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి అడిగినట్లు సమాచారం. సునీల్ శర్మ 9 వేల బస్సులు నడుస్తున్నాయని, సమ్మెపై కొన్ని పార్టీలు, సంఘాల నుండి వినతి పత్రాలు వస్తున్నాయని చెప్పినట్లు తెలుస్తోంది.
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ఈరోజు కోర్టులో విచారణ జరగబోతుంది. ఆర్టీసీ కార్మికులు చర్చలకు సిద్ధమని చెబుతూనే ఉన్నా ప్రభుత్వం మాత్రం చర్చలు జరిపే ఉద్దేశం లేదని ప్రకటన చేసింది. మరోవైపు తాత్కాలిక డ్రైవర్లతో నడుస్తున్న బస్సులు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. మరి హైకోర్టు సమ్మె విషయంలో ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.