హుజూర్‌నగర్ శాసనసభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికకు పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. నియోజకవర్గం పరిధిలోని ఏడు మండలాల పరిధిలో పోలింగ్ జరిగింది. హుజూర్‌నగర్, మఠంపల్లి, మేళ్లచెరువు, చింతలపాలెం, నేరేడుచర్ల, గరిడేపల్లి, పాలకవీడు మండలాల్లోని ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈ ఉప ఎన్నికలో ముగ్గురు మహిళలు సహా 28 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రధాన పోటీ మాత్రం తెరాస, కాంగ్రెస్, తెదేపా, భాజపా మధ్యే కొనసాగింది. తెరాస తరఫున సైదిరెడ్డి, కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ పద్మావతి, తెదేపా అభ్యర్థిగా చావా కిరణ్మయి, భాజపా నుంచి కోట రామారావు బరిలో నిలిచారు. సాయంత్రం 5 గంటల వరకు 82.23 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. దాదాపు అన్ని పార్టీలు హుజూర్‌నగర్ ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఎలాగైనా ఇక్కడ పాగా వేయాలని తెరాస సర్వశక్తులూ ఒడ్డగా.. తమ స్థానాన్ని మళ్లీ నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ తీవ్రంగా కృషి చేసింది. మరోవైపు తెదేపా, భాజపా సైతం పోటీ ఇచ్చేందుకు ప్రయత్నించాయి. అయితే తెదేపా, భాజపా అభ్యర్థులు తెరాస, కాంగ్రెస్‌లో ఎవరి ఓట్లను చీల్చారనే దానిపై విజయావకాశాలు ఆధారపడే అవకాశముంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ఈసారి ప్రజలు తమకు పట్టంకడతారని తెరాస భావిస్తుండగా.. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత మళ్లీ తమను గెలిపిస్తుందని కాంగ్రెస్ వర్గాలు ధీమాగా ఉన్నాయి. ఈనెల 24న ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు చేపట్టి అదేరోజు ఫలితాన్ని వెల్లడించనున్నారు.
హుజూర్‌నగర్ ఉప-ఎన్నికల్లో 82% పోలింగ్
Related tags :