*ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో ప్రధాన అధికారులపై ఆరోపణలు కంపెనీ షేర్లపై ప్రభావం చూపాయి. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లలో ఆ కంపెనీ షేర్లు మంగళవారం కుప్పకూలాయి. నేటి ట్రేడింగ్‌లో ఇన్ఫీ షేరు ధర ఒక దశలో 16శాతానికి పైగా పతనమైంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీలో 10శాతం నష్టంతో మొదలైన షేరు ధర ఒక దశలో 15.94శాతం విలువ కోల్పోయింది. ప్రస్తుతం కాస్త కోలుకున్నా నష్టాల్లోనే ట్రేడవుతోంది.ఉదయం 10.30 గంటల సమయంలో బీఎస్‌ఈలో ఇన్ఫీ షేరు ధర 13.38శాతం నష్టంతో రూ. 665.15 వద్ద, ఎన్‌ఎస్‌ఈలో 13.41శాతం నష్టంతో రూ. 664.85 వద్ద కొనసాగుతోంది. అటు న్యూయార్క్ స్టాక్ మార్కెట్లలోనూ ఇన్ఫీ షేరు భారీగా పతనమయ్యాయి. సోమవారం నాటి ట్రేడింగ్‌లో షేరు విలువ 10 నెలల కనిష్ఠానికి పడిపోయింది. కంపెనీకి చెందిన ‘అమెరికన్ డిపాజిటరీ రిసీట్స్’ కూడా 12శాతానికి పైగా విలువ కోల్పోయాయి. 2013 నుంచి ఈ రిసీట్స్ ఇంత భారీగా పడిపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇన్ఫీ సీఈవో సలీల్ పరేఖ్, సీఎఫ్‌ఓ నీలాంజన్ రాయ్‌లు అనైతిక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ ఉద్యోగులమని చెప్పుకుంటున్న గుర్తుతెలియని బృందం ఒకటి తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ మేరకు బోర్డుతో పాటు అమెరికా మార్కెట్ల నియంత్రణ సంస్థకు ఆ బృందం లేఖ రాసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఆరోపణలపై నిన్న కంపెనీ స్పందించింది. సీఈఓ, సీఎఫ్‌ఓలపై ఫిర్యాదును ఆడిట్ కమిటీ ముందు ఉంచినట్లు పేర్కొంది.
* దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఒడిదుడుకుల మధ్య ప్రారంభమైన మార్కెట్లు వెనువెంటనే కోలుకుని 100 పాయింట్లకు పైగా ఎగిసాయి. తద్వారా వరుసగా ఏడో రోజు లాభాలు నమోదు చేశాయి. ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ ప్రస్తుతం సెన్సెక్స్250 పాయింట్లు నష్టపోయి 39,044 వద్ద నిఫ్టీ సైతం 58 పాయింట్లుపతనమై 11,608 వద్ద ట్రేడవుతోంది.
*జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్(జీహెచ్ఐఏఎల్)పై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. విమానాశ్రయాల రంగంలో గుత్తాధిపత్యం చలాయించడంతోపాటు ఓ అగ్రగామి ఎంఆర్ఓ సేవల సంస్థకు మార్కెట్ యాక్సె్సను నిరాకరించినట్లు జీహెచ్ఐఏఎల్ ఆరోపణలు ఎదుర్కొంటోంది.
*వివిధ మార్కెట్లలో సోమవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.38,550, విజయవాడలో రూ.38,500, విశాఖపట్నంలో రూ.39,540, ప్రొద్దుటూరులో రూ.38,600, చెన్నైలో రూ.38,220గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.36,730, విజయవాడలో రూ.35,700, విశాఖపట్నంలో రూ.36,370, ప్రొద్దుటూరులో రూ.35,730, చెన్నైలో రూ.36,570గా ఉంది.
వెండి కిలో ధర హైదరాబాదులో రూ.45,400, విజయవాడలో రూ.47,000, విశాఖపట్నంలో రూ.47,200, ప్రొద్దుటూరులో రూ.46,800, చెన్నైలో రూ.49,400 వద్ద ముగిసింది.
*ఫ్లిప్కార్ట్ బిగ్ దివాలీ సేల్ ప్రారంభమైంది. ఈ నెల 25 వరకు కొనసాగనున్న ఈ సేల్లో భాగంగా స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, బిగ్ స్క్రీన్ టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. స్టేట్బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డు యూజర్లకు 10 శాతం తక్షణ డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు తెలిపింది.
*ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి సాగర్ సిమెంట్స్ నికర లాభం 133 శాతం పెరిగింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంతో పోలిస్తే సెప్టెంబరుతో ముగిసిన మూడు నెలలకు స్టాండ్అలోన్ ప్రాతిపదికన నికర లాభం రూ.2.62 కోట్ల నుంచి రూ.6.12 కోట్లకు చేరింది. సమీక్ష త్రైమాసికానికి మొత్తం ఆదాయం రూ.206.59 కోట్ల నుంచి రూ.195.13 కోట్లకు తగ్గింది.
*సైబర్ సెక్యూరిటీ రంగంలో డచ్ ప్రభుత్వం, హేగ్ సెక్యూరిటీ డెల్టా, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సహకరించుకోనున్నాయి. సైబర్ దాడులను తిప్పి కొట్టడానికి ఈ సహకార ఒప్పందం ఇరు వర్గాలకు దోహదం చేస్తుంది.
*ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్లో మరోసారి లుకలుకలు బయటపడ్డాయి. మాజీ సారథి విశాల్ సిక్కా హయాంలో కంపెనీ పాలనా ప్రమాణాలపై ఆరోపణలు రాగా.. ప్రస్తుత సీఈఓ సైతం అనుచిత విధానాలకు పాల్పడుతున్నారంటూ కంపెనీకి చెందిన కొందరు ఉద్యోగుల బృందం తాజాగా ఆరోపించింది.
*వాతావరణ మార్పుల వల్ల కలిగే అలర్జీలను తగ్గించడానికి వినియోగించే ఫెక్సోఫెనడైన్ హైడ్రోక్లోరైడ్ ఔషధాన్ని అమెరికాలో విడుదల చేయడానికి గ్రాన్యూల్స్ ఇండియా దాఖలు చేసిన అబ్రివేటెడ్ న్యూ డ్రగ్ దరఖాస్తుకు యూఎ్సఎ్ఫడీఏ ఆమోదం తెలిపింది.
ఆరోపణల నేపథ్యంలో కుప్పకూలిన ఇన్ఫోసిస్ షేర్లు-వాణిజ్యం-10/22
Related tags :