Sports

బీసీసీఐ సింహాసనం అధిష్టించిన దాదా

Ganguly Takes Charge As BCCI President

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) నూతన అధ్యక్షుడిగా సౌరభ్‌ గంగూలీ బాధ్యతలు చేపట్టారు. ముంబయిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో గురువారం జరిగిన సర్వసభ్య సమావేశంలో దాదా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీసీసీఐ అధ్యక్ష పదవికి గంగూలీ మినహా ఎవరూ నామినేషన్‌ దాఖలు చేయని సంగతి తెలిసిందే. 33 నెలల పాటు బీసీసీఐని నడపించిన సుప్రీంకోర్టు నియమిత పాలకుల కమిటీ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో 39వ అధ్యక్షుడిగా దాదా నియమితులయ్యారు. దాదాతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కుమారుడు జై షా బీసీసీఐ కార్యదర్శిగా, అనురాగ్‌ ఠాకూర్‌ తమ్ముడు అరుణ్‌ సింగ్‌ ధూమల్‌ కోశాధికారిగా బాధ్యతలు చేపట్టారు. ఒక మాజీ క్రికెటర్‌ పూర్తిస్థాయి బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం 65 ఏళ్లలో ఇదే తొలిసారి. చివరిగా 1954లో విజయనగరం మహారాజు విజయానంద గజపతిరాజు బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అతడు భారత మాజీ కెప్టెన్ కూడా. 2014లో సునీల్‌ గావాస్కర్‌, శివలాల్‌ యాదవ్‌ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారు. కానీ, వారు కొన్ని నెలలు మాత్రమే తాత్కాలికంగా విధుల్లో ఉన్నారు. పూర్తిస్థాయిలో బీసీసీఐ పగ్గాలు చేపట్టిన గంగూలీ మరో పది నెలలే పదవిలో ఉంటారు. అయిదేళ్లకు పైగా క్రికెట్‌ పాలనా వ్యవహారాల్లో దాదా ఉండటంతో లోధా కమిటీ ‘తప్పనిసరి విరామం’ నిబంధన ప్రకారం వచ్చే ఏడాది జులైలో పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. మూడేళ్ల తర్వాత తిరిగి బీసీసీఐ అధ్యక్ష పదవికి పోటీ చేయవచ్చు.