ScienceAndTech

విక్రమ్ కోసం విశ్రమించని నాసా

NASA Still Searching Extensively For Vikram Lander

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 ప్రయోగంలోని ల్యాండర్‌ ‘విక్రమ్‌’ పరిస్థితిపై ఇంకా స్పష్టత రావట్లేదు. చంద్రుడి ఉపరితలంపై నిస్తేజంగా ఉన్న ల్యాండర్‌ విక్రమ్‌ ఫొటోలు తీసేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఇటీవల మరోసారి ప్రయత్నించింది. విక్రమ్‌ దిగినట్లుగా భావిస్తున్న ప్రాంతాన్ని నాసాకు చెందిన లూనార్‌ రికానసెన్స్‌ ఆర్బిటర్‌(ఎల్‌ఆర్‌వో) అక్టోబరు 14న ఫొటోలు తీసింది. అయితే ఈ తాజా చిత్రాల్లోనూ విక్రమ్‌ ఆచూకీ లభించలేదని నాసా వెల్లడించింది.‘విక్రమ్‌ సాఫ్ట్‌ల్యాండింగ్‌ కోసం నిర్దేశించిన ప్రాంతాన్ని అక్టోబరు 14న లూనార్‌ రికానసెన్స్‌ ఆర్బిటర్‌ ఫొటోలు తీసింది. ఆ ఫొటోలను క్షుణ్ణంగా పరిశీలించాం. అయితే, అందులో ల్యాండర్‌కు సంబంధించిన ఎలాంటి సాక్ష్యాలు లభించలేదు. అక్షాంశం తక్కువగా ఉండటం వల్ల లక్షిత ప్రాంతంలో ఎప్పుడూ నీడ ఉంటుంది. ఒకవేళ ల్యాండర్‌ ఆ నీడలో ఉండొచ్చు. లేదా నిర్దేశించిన ప్రాంతానికి అవతల ఉండొచ్చు’ అని ఎల్‌ఆర్‌వో డిప్యూటీ ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ జాన్‌ కెల్లర్ తెలిపారు. విక్రమ్‌ ఆచూకీ కోసం నాసా గతంలోనూ ప్రయత్నించిన విషయం తెలిసిందే. విక్రమ్‌ దిగినట్లుగా భావిస్తున్న ప్రాంతాన్ని సెప్టెంబరు 17న ఎల్‌ఆర్‌వో ఫొటోలు తీసింది. అయితే, ఆ సమయంలో చీకటి ఎక్కువగా ఉండటంతో విక్రమ్‌ గురించి ఎలాంటి ఆచూకీ తెలియలేదు.