* దేశీయ సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో కలకలానికి కారణమైన ఉద్యోగుల ఫిర్యాదుపై సెబీ స్పందించింది. కంపెనీ సీఈవో, సీఎఫ్‌వోపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన ప్రాథమిక దర్యాప్తును మొదలుపెట్టినట్లు ఆంగ్ల పత్రిక బిజినెస్ స్టాండర్డ్ వెల్లడించింది. ఇప్పటికే ఫిర్యాదు చేసిన ఉద్యోగుల బృందం సెబీకి లేఖతోపాటు, కొన్ని వాయిస్ రికార్డులు, ఇ-మెయిల్స్‌ను ఆధారాలుగా పంపింది. ఆరోపణలు తీవ్రంగా ఉండటంతో దీనిపై దర్యాప్తు అవసరమని సెబీ భావించింది. దీనిపై ప్రాథమిక దర్యాప్తునకు పరిశీలిస్తామని వెల్లడించినట్లు ఆ పత్రిక పేర్కొంది. ఇన్ఫీ ఇప్పటికే అమెరికాలోని నాస్‌డాక్‌లో కూడా నమోదై ఉండటంతో అక్కడికి కూడా ఫిర్యాదులు వెళ్లాయి. అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజి కమిషన్(ఎస్‌ఈసీ)కు లేఖ అందింది. దీంతో సెబీ, ఎస్‌ఈసీలు ఇంటర్నెషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ సెక్యూరిటీ కమిషన్ మల్టీలాటరల్ మెమొరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. దీనిపై ఇప్పటికే ఈ రెండు సంస్థలు సంతకాలు చేశాయి. దీనిని వాడుకుంటే కేసు దర్యాప్తు విషయంలో ఇరు సంస్థలు సమన్వయం చేసుకోవచ్చు. అవసరమైతే ఎస్‌ఈసీ సాయం తీసుకొంటామని సెబీ అధికారులు చెబుతున్నారు.
* టెలికాం సర్వీసు ప్రొవైడర్లకు సుప్రీం కోర్టు షాకిచ్చింది. సుమారు రూ.92వేల కోట్ల మేర సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) వసూలుకు కేంద్రానికి అనుమతించింది. ఈ మేరకు జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్‌తో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. టెలికాంశాఖ రూపొందించిన ఏజీఆర్ నిర్వచనాన్ని సుప్రీం కోర్టు ధర్మాసనం సమర్థించింది. టెలికాం సంస్థల వాదనలను తోసిపుచ్చింది. ఆయా కంపెనీలు పెనాల్టీ, వడ్డీని సైతం టెలికాం శాఖకు చెల్లించాల్సిందేనని ఆదేశించింది. దీనిపై తదుపరి వాదనలకు అవకాశం లేదని స్పష్టంచేసింది. నిర్దేశించిన గడువులోగా చెల్లించాలని పేర్కొంది.
* దేశీయ స్టాక్‌మార్కెట్లు స్వల్పనష్టాలతో నేడు ట్రేడింగ్‌ను ముగించాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు క్రమంగా నష్టాల్లోకి జారుకొన్నాయి. 38పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 39,020 వద్ద, 21 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ 11,582 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ షేర్లు భారీగా నష్టపోయాయి. మిడ్‌క్యాప్ సూచీ 0.2శాతం, స్మాల్‌క్యాప్ సూచీ 0.01శాతం పడిపోయాయి.
హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేరు 6శాతం లాభపడింది. కంపెనీ 1:1బోనస్ ప్రకటించడంతో లాభాల్లో ట్రేడైంది. జీవితకాల అత్యధిక ధరకు సమీపంలో ఈషేరు ట్రేడవుతోంది. భారత్ పెట్రోలియం, హిందూస్థాన్ పెట్రోలియం షేర్లు 5శాతం వరకు కుంగాయి. కేబినెట్ కమిటీ ఆన్ ఎకనమిక్ అఫైర్స్ ఇంధన ధర రిటైల్ వ్యాపార నిబంధనలు మార్చింది. దీంతో ప్రైవేటు కంపెనీలు కూడా పెట్రోల్ పంపులను ఏర్పాటు చేసేందుకు అవకాశం వచ్చింది. ఫలితంగా ఈ కంపెనీల షేర్లు పతనం అయ్యాయి. భారతీ ఎయిర్ టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐషర్ మోటార్స్, హెచ్‌సీఎల్ టెక్, టైటాన్ కంపెనీ షేర్లు లాభపడగా.. భారతీ ఇన్ఫ్రాటెల్, యస్‌బ్యాంక్, గ్రాసిమ్, ఎస్‌బీఐ, గెయిల్ షేర్లు నష్టపోయాయి.
* ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ప్రభుత్వ రంగ సంస్థలు బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్‌ను పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా ఈ రెండు సంస్థలను విలీనం చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు మంత్రివర్గ నిర్ణయాలను టెలికాం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. ఈ సందర్భంగా రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్ సంస్థలను మూసివేయడమో లేదా పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. మార్కెట్లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా వాటిని పోటీలోకి తీసుకెళ్లాలని నిర్ణయించాం. ఇందుకోసం పునరుద్ధరణ ప్రణాళిక కూడా రూపొందించాం. బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్‌ను విలీనం చేయనున్నాం. విలీన ప్రక్రియ పూర్తయ్యేంతవరకు ఎంటీఎన్‌ఎల్.. బీఎస్‌ఎన్‌ఎల్ అనుబంధ సంస్థగా పనిచేస్తుంది’ అని తెలిపారు.
ఇన్ఫోసిస్‌పై సెబీ దర్యాప్తు-వాణిజ్యం-10/24
Related tags :