DailyDose

బోరుబావిలోనే తమిళ బాలుడు-తాజావార్తలు-10/27

2Yr Old In Borewell Still Not Out-Telugu Breaking News-10/27

* కార్మిక సంఘాల నేతలతో నిన్న జరిగిన చర్చలపై అధికారులు అబద్ధాలు చెబుతున్నారని ఆర్టీసీ ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి విమర్శించారు. అధికారులు మళ్లీ ఎప్పుడు పిలిచినా చర్చలకు వెళ్తామని అయన స్పష్టం చేశారు. రేపు కోర్టు ప్రారంభమయ్యేలోపు పిలిచినా వెళ్తామని పేర్కొన్నారు. ఐఏఎస్‌ అధికారులు శనివారం నిర్బంధం మధ్య తమతో చర్చలు జరిపారని ఆక్షేపించారు. నిన్న చర్చల నుంచి మధ్యలో తాము వెళ్లిపోలేదని.. అధికారులే వెళ్లిపోయారని, వీడియోలో చూస్తే తెలిసిపోతుందన్నారు.

* అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురంలో వైకాపా, తెదేపా నాయకుల మధ్య ఏర్పడిన రహదారి వివాదం. ఆందోళనకు దారి తీసింది. గ్రామానికి చెందిన తెదేపా నాయకుడు నాగరాజు, వైకాపా నాయకుడు పెద్దిరెడ్డి మధ్య స్థలం విషయంలో వివాదం ఉంది. ఇదే విషయమై గ్రామంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరుగుతుండగా.. వైకాపా నాయకుడు పెద్దిరెడ్డి దౌర్జన్యంగా నాగరాజు ఇంటికి అడ్డుగా బండలు పాతాడు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు.

* మహారాష్ట్రలో వేగంగా రాజకీయాలు మారిపోతున్నాయి. శివసేనకు ముఖ్యమంత్రి పదవికాలాన్ని పంచుతున్నట్లు లిఖిత పూర్వకంగా రాసిఇవ్వాలని ఆ పార్టీ భాజపాను డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రత్యమ్నాయం చూసుకోవాలని శివసేనకు కాంగ్రెస్‌ సూచించడంపై ఆ రాష్ట్ర భాజపా నేతలు మండిపడ్డారు. ఈ మేరకు ఆ పార్టీ నేత సుధీర్‌ ముంగంటివార్‌ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. ‘మా రెండు పార్టీల మధ్య వచ్చిన సమస్యల్ని మేమే చక్కదిద్దుకుంటాం. ఆకలేస్తుంది కదా అని పులి వెళ్లి గడ్డి తినదు కదా!. మా కూటమి నుంచి ప్రభుత్వం ఏర్పాటవుతుంది’ అని అన్నారు.

* తమిళనాడులోని తిరుచ్చి జిల్లా మనప్పారైలో బోరుబావిలో చిక్కుకున్న మూడేళ్ల బాలుడిని రక్షించేందుకు సహాయక సిబ్బంది చేస్తున్న ప్రయత్నాలు ఇంకా ఫలించలేదు. చివరి ప్రయత్నంగా ఓఎన్‌జీసీ డ్రిల్లింగ్‌ యంత్రంతో బోరుబావికి సమాంతరంగా గొయ్యి తవ్వుతున్నారు. శుక్రవారం సాయంత్రం ఇంటి వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాత్తు 600 అడుగుల లోతు బోరుబావిలో సుజిత్‌ అనే బాలుడు పడ్డాడు. తొలుత బాలుడు 35 అడుగుల లోతులో చిక్కుకున్నట్లు గుర్తించారు. తాజాగా బాలుడు వంద అడుగుల లోతుకు జారిపోయినట్లు సహాయక సిబ్బంది తెలిపారు.

* హరియాణాలో కాంగ్రెస్‌ ఓటమి పార్టీ తప్పిదమేనని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్‌ అన్నారు. మేలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో పార్టీ శ్రేణులు నిరాశలో కూరుకుపోయాయని తద్వారా ఆవహించిన నిర్లక్ష్య వైఖరే పరాజయానికి కారణమైందన్నారు. ప్రముఖ ఆంగ్ల మీడియాకు శనివారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు హరియాణా పార్టీలో చేసిన మార్పులు ఆరునెలల ముందే చేసుంటే ఫలితాలు సానుకూలంగా ఉండేవని అభిప్రాయపడ్డారు.

* ఎన్ని అవాంతరాలు ఎదురైనా న్యాయం కోసం పోరాడతానని కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ ట్రబుల్‌ షూటర్ డీకేశివకుమార్‌ అన్నారు. శనివారం ఆయన ఓ మీడియా సమావేశంలో మాట్లాడారు. అధికార దర్పం చూపి నిర్దోషులను శిక్ష వేయాలని చూస్తే ఊరుకోమని ఘాటుగా స్పందించారు. ‘నేను చట్టాలను గౌరవించే వ్యక్తిని. ఓ గౌరవ ప్రదమైన స్థాయిలో ఉన్నప్పుడు వాటికి విలువిచ్చి తీరాలి’ అని చెప్పారు.

* టీమిండియా సీనియర్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ను కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ, మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌సింగ్‌ ట్రోల్‌ చేశారు. భారత జట్టు మాజీ సారథి కపిల్‌దేవ్‌తో కలిసి గోల్ఫ్‌ ఆడిన ఫొటోను భజ్జీ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ‘కపిల్‌ పాజీకి ధన్యవాదాలు. మీతో కలిసి క్రికెట్‌ ఆడకపోయినా, ఈ రోజు గోల్ఫ్‌ ఆడటం సంతోషంగా ఉంది. స్వతహాగా చాలా ఎంజాయ్‌ చేశాను’ అని పేర్కొన్నాడు. అది చూసిన కోహ్లీ పంజాబీ భాషలో స్పందిస్తూ సరదా వ్యాఖ్య చేశాడు.

* ‘అరుంధతి’, ‘భాగమతి’ వంటి కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటించి మంచి విజయాన్ని అందుకున్నారు నటి అనుష్క. ప్రస్తుతం ఆమె నటిస్తున్న చిత్రం ‘నిశ్శబ్దం’. ఈ సినిమాలో అనుష్క మూగ అమ్మాయి పాత్రలో కనిపించనున్నారు. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్‌ను వచ్చేనెల 7వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. దీనికి సంబంధించి ‘నిశ్శబ్దం’ ప్రీ టీజర్‌ను సోషల్‌టీడియా వేదికగా విడుదల చేసింది.