WorldWonders

హర్యానా ఎద్దు…బంగారం తినేసింది

Indian cow eats gold. Owners search its dung.

పొరపాటున చెత్త డబ్బాలో బంగారు ఆభరణాలు వేసి ఓ కుటుంబం ఇబ్బందుల పాలైంది. పోయిన బంగారాన్ని ఎద్దు పేడలో వెదుక్కుంటూ ఆశగా ఎదురు చూస్తోంది. ఈ వింత ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. వివరాలు… జనక్‌రాజ్‌ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి సిర్సాలో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో అక్టోబరు 19న జనక్‌రాజ్‌ భార్య, కోడలు వంట చేసేందుకు సిద్ధమయ్యారు. అదే సమయంలో సుమారు 4 తులాల బంగారు ఆభరణాలు శుభ్రం చేసుకునే నిమిత్తం ఓ పాత్రలో వేసి పక్కకు పెట్టారు. అయితే వంటపనిలో నిమగ్నమైన అత్తాకోడళ్లు.. కూరగాయల వ్యర్థాలతో పాటు ఆభరణాలు కూడా పొరబాటున ఇంటి బయట చెత్తబుట్టలో పడేశారు. అప్పుడే అక్కడికి వచ్చిన ఎద్దు చెత్తనంతా తినేసింది.ఈ విషయం గురించి జనక్‌రాజ్‌ మాట్లాడుతూ… ‘ ఆరోజు మా ఇంటి బయట చెత్త తిన్న ఎద్దును పట్టుకోవడానికి చాలా శ్రమించాం. దానిని పట్టుకున్న తర్వాత వెటర్నరీ డాక్టర్‌ ఇచ్చిన సలహా ప్రకారం మా ఇంటి వద్దే కట్టేసి దానికి రోజూ తిండిపెడుతున్నాం. పేడలో బంగారు ఆభరణాలు వస్తాయేమోనని చూస్తున్నాం. దాదాపు ఒకటిన్నర లక్షల రూపాయల బంగారం. అందుకే ఇంతలా బాధపడుతున్నాం. కొన్నిరోజులు ఇలా చూసిన తర్వాత ఎద్దును గోశాలకు అప్పగిస్తాం’ అని పేర్కొన్నాడు. దయచేసి చెత్త పారవేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలంటూ ప్రజలకు విఙ్ఞప్తి చేశాడు. కాగా గతంలో మహారాష్ట్రలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. బెయిల్‌ పోలా వేడుకలో భాగంగా ఎద్దు ఓ మహిళ మంగళ సూత్రాన్ని మింగేయడంతో దానిని ఆస్పత్రికి తీసుకువెళ్లగా.. వైద్యులు ఆపరేషన్‌ నిర్వహించి దానిని బయటకు తీశారు.