ScienceAndTech

ముగ్గురు భారతీయులు దంచికొట్టారు

Three Indian Origin CEOs Gets Into HBR 2019 List

ప్రపంచంలోనే ఉత్తమ పనితీరు ప్రదర్శించిన సీఈవోల జాబితాలో టాప్10లో ముగ్గురు ప్రవాస భారతీయులు చోటు దక్కించుకున్నారు. హార్వర్డ్ బిజినెస్ రివ్యూ(హెచ్బీఆర్) అనే సంస్థ ప్రతి యేటా సీఈవోల పనితీరుపై జాబితా విడుదల చేస్తుంది. అందులో భాగంగానే 2019 సంవత్సరానికి కూడా పనితీరు ఆధారంగా టాప్ 100 సీఈవోల పేర్లను ప్రకటించింది. ఈ జాబితాలో ప్రవాసభారతీయులైన ముగ్గురు సీఈవోలు టాప్10లో చోటు సంపాదించారు. ఆ ముగ్గురిలో అడోబ్ కంపెనీ సీఈవో శంతను నారాయణ్ ఆరో స్థానం సొంతం చేసుకోగా, మాస్టర్ కార్డ్ సీఈవో అజయ్ బంగా ఏడో స్థానాన్ని దక్కించుకున్నారు. కాగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల 9వ స్థానంలో నిలిచారు. ఇదిలా ఉండగా మొత్తంగా అమెరికన్ టెక్నాలజీ సంస్థ ఎన్వీడియా సీఈవో జెన్సెన్ హువాంగ్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. యాపిల్ కంపెనీ సీఈవో టిమ్ కుక్ 62 స్థానంలో, మరో ప్రవాస భారతీయుడైన డీబీఎస్ బ్యాంకు సీఈవో పీయూష్గుప్త 89 స్థానంలో ఉన్నారు. హెచ్బీఆర్ సంస్థ దాదాపు 2015 నుంచి దీన్ని కేవలం ఆర్థిక పనితీరే కాకుండా పర్యావరణ, సామాజిక, పరిపాలన(ఈఎస్జీ) వంటి అంశాలను ఆధారంగా చేసుకుని రేటింగ్ ఇస్తారు. కేవలం ఆర్థిక పనితీరు ఆధారంగా మాత్రం 2014 నుంచి అమెజాన్ సీఈవో జెఫ్బెజోస్ మొదటి స్థానంలో ఉన్నారు. 2019 జాబితాలో మొదటి భాగంలో నలుగురు మహిళా సీఈవోలు ఉండగా, 2018లో ముగ్గురే ఉన్నారు. ఈ సందర్భంగా హెచ్బీఆర్ నిర్వాహకులు మాట్లాడుతూ.. ‘ఈ జాబితాలో మహిళల సంఖ్య తక్కువగా ఉండటాన్ని ప్రతి సంవత్సరం పాఠకులు విమర్శిస్తుంటారు. కానీ పనితీరు వల్ల వారు చోటు సంపాదించకపోవడం జరగదు. అసలు పనిచేస్తున్న మహిళలే తక్కువ మంది ఉన్నారని చెప్పేందుకు మేం విచారిస్తున్నాం’ అని తెలిపారు.