ఆంధ్రుల అభిమాన అత్తగారి జయంతి సందర్భంగా నివాళులతో…
మన ఆంధ్రుల అభిమాన అత్తగారైన శ్రీమతి పెద్దిబొట్ల సూర్యకాంతం గారికి ఉన్న బిరుదు “ఆంధ్రత్వ నిరూపణా మూర్తి “.ఆమె ఏ పని చేసినా తెలుగుదనం ఉండాలని ఉవ్విళ్లూరేది. వంటల్లో అన్నీ తెలుగుదనమే. ఆమె అప్పటిలో వంటలమీద ఓ పెద్ద పుస్తకమే వ్రాశారు. ఆమెకు రాని శాకాహార వంట లేదంటే నమ్మండి. శుచిగా వండటమే కాదు, అందరికీ కొసరి కొసరి వడ్డించేది. భోజనం విషయములో చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా కోటి విద్యలు కూటి కొరకే శుభ్రంగా ఏమాత్రం మొహమాటం లేకుండా తినమని పెట్టేది. ఆమెకు ప్రొద్దున్నే లేచి పూజా పునస్కారాలు, వంటా అవీ చేసుకుని అరటి ఆకులతో సహా, భోజనాలు, పిండివంటలు అన్నీ క్యారియర్ లకు పెట్టుకుని సినిమా షూటింగులకు వెళ్లేది. ఇవన్నీ చూసుకోలేక ఓసారి పనిమనిషిని పెట్టుకోవాలని ఆశపడి దగ్గరి బంధువులకు ఆపని అప్పజెప్పింది. వారు కష్టపడి మద్రాస్ కి తీసుకువెళ్లారు. రైలు దిగి సూర్యకాంతం గారింటికి ఆమెను తీసుకువెళ్లారు రిక్షాలో. ఇల్లు రాగానే రిక్షా దిగగా వాకిట్లో ఎదురుపడిన కాంతమ్మ గారిని చూసి అమ్మబాబోయ్ ఈవిడింట్లోనా బ్రతికుంటే బలుసాకు తిని బ్రతుకుతా గానీ ఈ గయ్యాళి ఇంటిలో నేను చస్తే పని చేయనంటూ అదే రైలుకి తిరుగుప్రయాణం అయిందిట. సూర్యకాంతం గారికి పుస్తకాలంటే అమిత ఇష్టం. ఎపుడూ ఏవో పుస్తకాలు చదువుతూనే ఉండేవారు.సంగీతం,తెలుగు పద్యాలు, నాటకాలు అన్నా అమిత ఇష్టం.ఆమె బహుభాషాకోవిదురాలు, తన యాభయ్యవ యేట పట్టుబట్టి మరీ జర్మన్ భాష నేర్చుకున్నారు.