Food

చెట్టినాడ్ చూసొద్దాం రారండి

The history of Chettinad in Tamilnadu-Telugu Food News

ఓ వీధిలో రాజభవనం మరో వీధిలో ఇంద్రభవనం ఆ పక్క సందులోమహా ప్రాసాదం.. వందల్లో.. కాదుకాదు వేలల్లో.. అన్నీ మండువా లోగిళ్లే! ఒక్కో భవనం పాతిక ఇళ్ల పెట్టు.. అంత భారీగాఉంటాయవి.ఇంతకీ ఎక్కడ? అంటారా.. తమిళనాడులోని చెట్టినాడ్‌కు వెళ్తే చాలు.. కన్నుల విందుఖాయం. భోజన ప్రియులకైతే రుచుల విందు అదనం.చెట్టినాడ్‌సిమెంట్‌ గురించి తెలుసు. టీవీ ప్రకటనల్లో చూశాం. చెట్టినాడ్‌ మసాలా గురించితెలుసు. కోడి కూరలో అమ్మ వేస్తుండగా చూసుంటాం. అద్దాల టైల్స్‌ తయారవుతాయక్కడ.అందాల చీరలు రూపుదిద్దుకుంటాయక్కడ. ఇలా చెబుతూ పోతే ఎన్నో విశేషాలకు చిరునామాచెట్టినాడ్‌. అందుకు తగ్గట్టే చెట్టినాడ్‌ అంటే ఒక్క ఊరు కాదు. దాదాపు 78 ఊళ్ల సమాహారం. ఏ ఊరుకు వెళ్లినా భారీ మేడలు స్వాగతం పలుకుతాయి.చెట్టినాడ్‌ఒకప్పుడు తమిళనాడులో సంపన్న ప్రాంతం. శివగంగ జిల్లాలో దాదాపు 1,500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఒకప్పుడు 98 గ్రామాలు ఉండేవి. కాలక్రమంలో 78 మిగిలాయి. కరైక్కుడి ఇక్కడ ప్రధాన పట్టణం. దీనికి చుట్టుపక్కల ఈఊళ్లన్నీ ఉంటాయి. 19వ శతాబ్దంలో ఈ ప్రాంతంలోనాట్టుకోట్టై చెట్టియార్లు ఎక్కువగా ఉండేవాళ్లు. వడ్డీ వ్యాపారం ప్రధాన వృత్తి.ఉప్పు నుంచి రత్నాల వరకు రకరకాల వస్తువులు ఎగుమతి చేస్తుండేవారు. భారీ సంపదతోతులతూగేవారు. అలా వచ్చిన ఆదాయంతో అందమైన ఆవాసాలు కట్టించుకున్నారు. శతాధికసంవత్సరాలు గడుస్తున్నా.. ఆ ఇళ్లు చెక్కు చెదరలేదు.
**అడుగడుగునా అద్భుతం..
చెట్టినాడ్‌ప్రాంతంలో మండువా లోగిళ్ల సంఖ్య ఏకంగా పదకొండు వేల పైమాటే. దాదాపు అన్నీ నివాసయోగ్యంగానే ఉన్నాయి. ఒక్కో భవనం దాదాపు 30వేల నుంచి 40వేల చదరపు అడుగుల విస్తీర్ణంలోఉంటుంది. వీధంతా ఇల్లే! భారీ వేడుక నిర్వహణకు సరిపోయేంత లోగిలి.. వెయ్యిమందికిఆశ్రయమిచ్చే ప్రాంగణాలు, పదుల సంఖ్యలో గదులుఆశ్చర్యపరుస్తాయి. బర్మా టేకు, ఇటలీ మార్బుల్‌, స్పెయిన్‌ నుంచి సీలింగ్‌, బెల్జియం అద్దాలు.. ఇలా అడుగడుగునా అబ్బురపరిచే కళ దర్శనమిస్తుంది.వాకిట్లో ఇసుర్రాళ్లు, వరండాలో అరుగులు, మధ్య ఇంట్లో తూగుటుయ్యాల, గోడకు పాత గడియారం, పడగ్గదిలో పట్టెమంచం, వంటింట్లో గంగాళాలు, పెరట్లో పొత్రం.. ఓ పాత కాలం సినిమా కోసం కొత్తగా వేసిన సెట్‌లాఉంటుంది. ఒక ఇంటికీ మరో ఇంటికీ సంబంధం ఉండదు. ఒక ఇంటిని మించి మరో ఇల్లు. అందుకేచెట్టినాడ్‌ వచ్చే పర్యాటకులు ఒక్కో ఇల్లూ చూస్తూ రోజులు గడిపేస్తుంటారు.
**కథలు కథలుగా..
రెండో ప్రపంచయుద్ధ సమయంలో వ్యాపారాలు దెబ్బతినడంతో చాలామంది చెట్టియార్లు బర్మా, శ్రీలంక, మలేసియా, సింగపూర్‌ దేశాలకు వలస వెళ్లారు. తమ నివాసాలను చూసుకోవడానికిజీతాలిచ్చి సంరక్షకులను నియమించారు. ఈ విశాలమైన లోగిళ్లలో.. కొన్ని హోటళ్లుగామారాయి, కొన్ని రిసార్టులుగాఆతిథ్యమిస్తున్నాయి. కరైక్కుడి, కడియపట్టి, కొత్తమంగళం, కనాడుకథన్‌లో హోటళ్లు ఎక్కువ. గైడ్‌వెంట ఇళ్లిళ్లూ తిరుగుతుంటే బోలెడన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఆ ఇల్లుఎప్పుడు కట్టారు? ఎవరు కట్టారు? ఇలా కథలు కథలుగా చెబుతారు. వీధిలో వెళ్తుంటే.. అదిగో ఫలానా ఇంట్లోరజనీకాంత్‌ సినిమా చిత్రీకరించారనీ, ఈ ఇంట్లో కమల్‌హాసన్‌ సినిమా షూటింగ్‌ జరిగిందని సినిమా ముచ్చట్లూఏకరవు పెట్టేస్తారు. ఆ ముచ్చట్లు వింటూ.. గడప గడపా తిరుగుతుంటే అలసట రాకుండాఉంటుందా? అయినా ఏ బాధా లేదు. చెట్టినాడ్‌లోకన్నుల విందే కాదు.. ఎక్కడికి వెళ్లినా పసందైన విందు భోజనం సిద్ధంగా ఉంటుంది.
**రుచుల విస్తరి..
చెట్టినాడ్‌రుచులు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. ప్రతి ఇంటి నుంచి వచ్చే ఘుమఘుమలు ఆత్మారాముడినిఅల్లకల్లోలం చేస్తాయి. ఆబగా తినమని ఆరాటపెడతాయి. మాంసాహార ప్రియులకైతే మరీనూ! కోడిమాంసంతో రకరకాల వంటకాలు చేస్తారు. ఏ వంట చేసినా దిట్టంగా మసాలా దట్టించాల్సిందేఅంటారు అక్కడి పాకయాజులు. మునక్కాడల సాంబారు, వంకాయ కుర్మా సెగలు కక్కుతూ విస్తట్లో పడుతుంటే.. విస్తరి చుట్టూనాలుగైదు పచ్చళ్లు నోరూరిస్తుంటే.. పంటికింద కరకరలాడటానికి అందేంత దూరంలో అప్పడంఉంటే.. నాలుగు కాదు నలభై ముద్దలు ఎక్కువగా లాగించేస్తాం. చెట్టినాడ్‌ వంటలుఆరగించడం కోసమే ఇక్కడికి వచ్చేవాళ్లుంటారు. కళ్లారా వింతలు చూసి.. కడుపారా రుచులుఆస్వాదించి.. తృప్తిగా తిరుగు ప్రయాణం అవుతారు.
**ఎన్నో ప్రత్యేకతలు
చెట్టినాడ్‌ప్రాంతంలో ఆలయాలు ఎన్నో ఉన్నాయి. శతాబ్దాల కిందట నిర్మించిన ఈ గుళ్లు అనంత శిల్పసంపదతో అలరిస్తాయి. ఈ పల్లెల్లో జరిగే సంతలు చూసి తీరాల్సిందే! అపురూప వస్తువులుతక్కువ ధరకు సొంతం చేసుకోవచ్ఛు చెట్టినాడ్‌ చేనేతలు మగువల మనసు దోచేస్తాయి. ఇక్కడటైల్స్‌ తయారీ కుటీర పరిశ్రమగా విస్తరించింది. గ్రామగ్రామాల్లో బంకమన్ను, గాజుతో టైల్స్‌ తయారు చేసే విధానం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇదేప్రాంతంలో సిమెంట్‌ పరిశ్రమ ఉంది. నవంబరు నుంచి ఫిబ్రవరి మాసాంతం వరకు ఇక్కడప్రశాంత వాతావరణం ఉంటుంది. వేసవిలో వేడిగా ఉంటుంది. చేరుకునేదిలా చెట్టినాడ్‌లోని ప్రధాన పట్టణంకరైక్కుడి.. ఆలయాల నగరం మదురై నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సికింద్రాబాద్‌ నుంచి మదురైకిరైళ్లున్నాయి. అక్కడి నుంచి రోడ్డు, రైలు మార్గంలో కరైక్కుడి చేరుకోవచ్ఛు హైదరాబాద్‌ నుంచి నాన్‌స్టాప్‌విమాన సర్వీసులూ అందుబాటులో ఉన్నాయి.విజయవాడ, విశాఖపట్నం నుంచి కరైక్కుడికి రైళ్లున్నాయి. అక్కడి నుంచిట్యాక్సీలో చుట్టుపక్కల ఊళ్లన్నీ చుట్టేయొచ్ఛు.