1. కార్తికం… కైవల్య ప్రదాయకం-ఆద్యాత్మిక వార్హలు- 11/01
మాఘ మాసం స్నానానికీ, వైశాఖమాసం దానానికీ, కార్తికమాసం దీపానికీ ప్రశస్తమైనవి అంటారు.అయితే స్నానం, దీపం, దానం, ధ్యానం…వీటన్నిటికీ కార్త్తిక మాసమే ప్రశస్తమనీ, యోగ్యమనీ శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ మాసంలో దివ్యత్వంతో పాటు ఉత్సాహం, ఉల్లాసం వెల్లివిరుస్తాయి.
కాలం భగవత్స్వరూపం. మానవుడు తన మేధతో రూపొందించుకున్న పన్నెండు రేకుల కాలచక్రంలో- చైత్రం నుంచి ఫాల్గుణం వరకూ పన్నెండు మాసాలలో పరమ పవిత్రమైనది కార్తిక మాసం. ఈ మాసం శివకేశవులతో పాటు శక్తికీ పరమ ప్రీతికరం. కృత్తికా నక్షత్రంతో కలిసి ఉన్న పున్నమి కారణంగా దీనికి ‘కార్తిక మాసం’ అనే పేరు వచ్చింది. కృత్తిక అగ్ని నక్షత్రం. అగ్నిలో ఈశ్వర స్వరూపాన్ని ఆవిష్కరించి ఆనందించడమే దీప యజ్ఞం.
ఆ తత్త్వానికి సంకేతంగా వేకువనే స్నానం చేసి, ఆలయాల్లో దీపాలను
వెలిగించి ఆరాధిస్తారు. అలా కార్తికంలో స్నానం, దీపం ప్రాధాన్యాన్ని
సంతరించుకున్నాయి.
**సోమవార వ్రతం- దీపదానం
శివకేశవులు అభిన్నులు అయినప్పటికీ కార్తిక మాసం అనగానే శివుడే గుర్తుకువస్తాడు. శైవ క్షేత్రాలలో ఈ వైభవం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. దేశమంతటా శివ క్షేత్రాలలో పంచాక్షరీ ఘోష మిన్నంటుతుంది. ఈ మాసంలోని ప్రతి సోమవారమూ శివాలయాల్లో అభిషేకాలు, అర్చనలకూ అంతు ఉండదు. కార్తిక మాసంలో సోమవార వ్రతానికి ప్రత్యేక ప్రాశస్త్యం ఉంది. ఈ వ్రతం శివుడికి ప్రీతికరమైనది. పగలంతా ఉపవాసం ఉండి, భక్తి శ్రద్ధలతో శివ నామస్మరణ, అర్చనలు, పురాణపఠనం, శ్రవణంతో కాలం గడపాలనీ, సాయంత్రం నక్షత్ర దర్శనం తరువాత శివుడికి నివేదించిన ప్రసాదాన్ని ఆరగించాలనీ ఈ వ్రత విధానం చెబుతోంది. కొందరు శివ దీక్ష తీసుకొని, దీక్షావిధులను నలభై రోజులపాటు పాటిస్తారు. ప్రతిరోజూ ఉభయ సంధ్యలలో శివార్చనానంతరం శివుని సన్నిధిలో దీపదానం చేస్తారు. అన్నదానం కన్నా దీపదానం శ్రేష్టమని పురాణాలు చెబుతున్నాయి. దీక్ష కాలంలో భక్తులు వీలైనంత ఎక్కువ సమయాన్ని ధ్యానంలోనే గడపాలి. వృత్తుల పరంగా జీవితాన్ని సాగిస్తున్నా మనసును ఇతరత్రా వ్యవహారాల మీదకు మళ్ళించకుండా అంతరంగంలోనే తమ దైవాన్ని స్మరిస్తూ ధ్యానం చేయవచ్చన్న మినహాయింపు ఉంది. శైవులు, వైష్ణవులు, శాక్తేయులు, గాణపత్యులు… ఇలా ఏ ఆచారాన్ని పాటించేవారయినా దీప దానం చేయవచ్చునని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.
‘సర్వజ్ఞానప్రదం దీపం సర్వ సంపత్ సుఖావహం – దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామమ’ అంటూ దీప దానం చేయాలి. అన్ని విధాలా జ్ఞానాన్ని ఇవ్వగలిగే, సకల సంపదలనూ ప్రసాదించే ఈ దీపాన్ని దానం ఇస్తున్నాను అని భావం.
**ఉత్థాన ఏకాదశి- చాతుర్మాస్య సమాప్తి
కార్తిక మాసంలో శివునికి ఎంత ప్రాముఖ్యం ఉందో విష్ణువుకూ అంతే ప్రాధాన్యం ఉంది. ఈ మాసంలో దామోదర నామంతో విష్ణువును ఆరాధిస్తారు. అలాగే విష్ణువు పేరిట ఎన్నో నోములూ, వ్రతాలను ఈ మాసంలో నిర్వహిస్తారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజన శేష తల్పంపై పవళించి, యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీమహావిష్ణువు కార్తిక శుద్ధ ఏకాదశి నాడు మేలుకుంటాడు. అందుకే ఈ ఏకాదశి ‘ఉత్థాన ఏకాదశి’గా పేరుగాంచింది. ఈ రోజుతో చాతుర్మాస్య వ్రత దీక్షాపరులు ఆ దీక్షను విరమించి, స్వామిని ఆరాధిస్తారు. ఏకాదశి వ్రతం ఆచరిస్తున్న వారు వ్రత సమాప్తి చేస్తారు.
**క్షీరాబ్ధి ద్వాదశి- తులసీ లగ్నం
మరుసటి రోజైన ద్వాదశిని ‘క్షీరాబ్ది ద్వాదశి’ అనీ, ‘బృందావన ద్వాదశి’ అనీ అంటారు. ఏకాదశి నాడు ఉపవసించిన వారు ద్వాదశి నాడు స్వామిని అర్చించి, నివేదనను స్వీకరించాలి. కొన్ని ప్రాంతాల్లో క్షీరాబ్ది ద్వాదశి లేదా పున్నమి రోజున ధాత్రీ పూజ (తులసీ లగ్నం) చేస్తారు. తులసి కోటను శుభ్రపరచి, దీపాలతో చుట్టూ అలంకరించి, ఉసిరిక కొమ్మను (విష్ణువుకు ప్రతీకగా) తులసికోటలో నాటి, తులసీ-విష్ణువుల కల్యాణం జరిపిస్తారు. ఈ ద్వాదశి విశిష్టతను మహాభారతంలోని ‘అంబరీష చరిత్ర’లో పోతన ఎంతో రమ్యంగా రాశాడు. మహిళలు 365 వత్తులను ఒక్కటిగా చేసి, ఆవునేతితో తడిపి తులసికోట ముందు ప్రజ్వలింపజేస్తారు. ఈ రోజు కుదరకపోతే పౌర్ణమి రోజున చేయవచ్చు. ఇలా చేస్తే సంవత్సరంలో ప్రతిరోజూ దీపారాధన చేసిన పుణ్యం లభిస్తుందంటారు పెద్దలు.
**కార్తిక పౌర్ణమి- దేవ దీపావళి
కార్తిక పూర్ణిమ మరో ముఖ్యమైన పర్వదినం. ఇది శక్తి ఆరాధనకు ముఖ్యమైనది. సహస్రార చంద్రకళా స్వరూపిణి అయిన జగదంబ శ్రీలలితా మహాత్రిపురసుందరిని ఆరాధిస్తే అనంతమైన ఫలాలు లభిస్తాయి. అగ్ని స్వరూపుడైన స్కందుడి ఆరాధనకు కూడా ఇది శ్రేష్టమైన మాసం. తిరువణ్ణామలైలో స్కందుణ్ణి విశేషంగా పూజిస్తారు. కొండపై విశేష దీపాన్ని వెలిగించి, సుబ్రహ్మణ్యుడి నామోచ్ఛారణతో దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తారు. అదొక అద్భుత దృశ్యం. ఆధ్యాత్మిక యోగ సాధనలకు ఈ పూర్ణిమ విశిష్టమైనది. ఈ రోజున వెలిగించే దీపాలకు- ముఖ్యంగా కాశీ క్షేత్రంలో- విశేష ప్రాధాన్యం ఉంది. దీన్ని ‘దేవ దీపావళి’గా వ్యవహరిస్తారు. కార్తిక పున్నమి రోజు రాత్రి ఆలయాల్లో జ్వాలాతోరణం నిర్వహిస్తారు. శివాలయాల్లో శివ పార్వతులకు పూజలు చేసి, ఆ ఆది దంపతులను జ్వాలాతోరణం కిందినుంచి ముమ్మారు ప్రదక్షిణ చేయిస్తారు. భక్తులు దీన్ని అనుసరించి అనుగ్రహం పొందుతారు. ఇక సామాజికంగా వనభోజనాలు ప్రాచుర్యం పొందాయి. సామాజిక సామరస్యానికీ, ఐక్యతకూ ఇవి సంకేతాలు
2. రాజన్న ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనం!
వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో త్వరలో వీఐపీ బ్రేక్ దర్శనం అమలు చేయనున్నారు. నిత్యం భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో వీఐపీ భక్తుల కోసం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల వరకు దీన్ని అమలు చేయనున్నారు. బ్రేక్ దర్శనంలో రూ.1,250 టికెట్‌పై ఇద్దరిని అనుమతించనున్నారు. ప్రయోగాత్మకంగా ప్రతి సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాన్ని ప్రారంభించనున్నారు. టికెట్ తీసుకున్న భక్తులకు గర్భగుడి ప్రవేశంతోపాటు స్వామివారి శేషవస్త్రాలు, రూ.20 లడ్డూను అందజేస్తారు. వీఐపీ బ్రేక్ దర్శనంపై అభ్యంతరాలను ఈ నెల 4వ తేదీ లోగా కార్యాలయంలో తెలియజేయాలని ఆలయ ఈఓ కృష్ణవేణి ఒక ప్రకటనలో కోరారు.
3. తితిదేలో ఉద్వాసన పర్వం పూర్తి-డాలరు శేషాద్రి కొనసాగింపు
తిరుమల, తిరుపతి దేవస్థానంలో వివిధ విభాగాల్లో పని చేస్తున్న విశ్రాంత ఉద్యోగులతో పాటు పొరుగుసేవలు, ఒప్పంద సిబ్బంది తొలగింపు ప్రక్రియ గురువారం పూర్తయింది. దాదాపు 100 మందికి ఉద్వాసన పలకగా, ఓఎస్డీ డాలరు శేషాద్రిని కొనసాగించనున్నట్లు సమాచారం. ఉద్వాసన ప్రక్రియ పూర్తి వివరాలు శుక్రవారానికి వెల్లడయ్యే అవకాశం ఉందని తిరుపతి జేఈవో బసంత్‌కుమార్ తెలిపారు. శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలరు శేషాద్రి తొలగింపునకు సంబంధించిన ఉత్తర్వులను సంబంధిత విభాగం సిద్ధం చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ తాజా ఆదేశాలు ఆయనకు వర్తించవని ఉన్నతాధికారులు ఆలస్యంగా గుర్తించారు. ఆయన్ను కొనసాగించాలని భావిస్తున్నట్లు సమాచారం.
4. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనం కోసం 16 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి వున్నారు. సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. అలాగే టైం స్లాట్ సర్వ, దివ్య, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. కాగా
నిన్న శ్రీవారిని 74,533 మంది భక్తులు దర్శించుకున్నారు.
5. నవంబ్రాలు-నవంబర్‌లో తలంబ్రాలు
భూమిపై పడ్డ ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు పెళ్లి చేసుకోవలసిందే. ఇందులో ఏదైనా దురర్ధం ధ్వనిస్తుంటే మీరు మరీ సున్నిత మనస్కులైనట్లు! పెళ్లి చేసుకోబోయేవారు ప్రతి దాన్నీ తేలిగ్గా తీసుకునే తత్వాన్ని అలవవరచుకోవాలి. పెళ్లి అనేది భూతం ఏమీ కాదు. అలాగని భూతలం మీది అత్యున్నత సౌఖ్యమూ కాదు. బేసిగ్గా పెళ్లి అంటే బాధ్యత. బాధ్యతలను మీద వేసుకోడానికి ఈ నవంబరులో బలమైన ముహుర్తాలు చాలానే ఉన్నాయి. కార్తీకం ఆరంభం అయింది కదా! ఏయే తేదీలు, తిథులు ఈ నెలలో పెళ్లికి దివ్యంగా ఉన్నాయో పంచాంగం తిప్పే ముందు.. పెళ్లిళ్లు, భార్యాభర్తల విశేషాలు కొన్ని తెలుసుకోవడం వల్ల నూతన వధూవరులకు కొంత ఉపయుక్తంగా ఉండొచ్చు.తొలిచూపులోనే ప్రేమలో పడి, పెళ్లి చేసుకున్న దంపతులలో 75 మంది విడాకుల వరకు వెళ్లే ప్రమాదం ఉంది. కంగారు పడకండి. మిగతా 25 మంది సక్సెస్ఫుల్ కపుల్స్‌లో మీరు ఉండొచ్చు కదా!
‘బ్రైడ్’ అంటే వధువు. బ్రైడ్కి ‘గ్రూమ్’ని కలిపితే వరుడు. (బైడ్ గ్రూమ్). సరే, ఈ నాలెడ్జికేంగానీ, బ్రైడ్ అంటే అసలు అర్థం తెలుసా! ‘వంట చేయడం’ అని!! ప్రాచీన జర్మన్ భాషల నుంచి బ్రైడ్ అనే పదం పుట్టుకొచ్చింది.
భర్తగానీ, భార్యగానీ రోజుకి కనీసం 45 నిముషాలు ప్రయాణంలోనే గడుపుతుంటే వాళ్ల పెళ్లి పెటాకులయ్యే ఛాన్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ అట. మీ ఇష్టం మరి.
ఆ మధ్య 99 ఏళ్ల ఓ భర్త తన 96 ఏళ్ల భార్యకు పెళ్లయిన 77 ఏళ్ల తర్వాత విడాకులు ఇచ్చాడు. నైంటీన్ ఫార్టీస్లో ఆమెకు ఎవరితోనో అఫైర్ ఉందని ఆయనకు తెలిసిందట! అదీ విడాకులకు కారణం.
పెళ్లికి ముందు దీర్ఘకాలం కలిసి ఉన్నవారు, పెళ్లయ్యాక అంతకన్నా తక్కువ సమయంలోనే విడిపోతారట! ఇదింకో అధ్యయనంలో తేలిన విషయం.
పెళ్లయిన మూడో ఏడాది.. ఏ దంపతుల జీవితంలోనైనా అత్యంత ఆనందకరమైన సంవత్సరంగా ఉంటుందట! మీరిప్పుడు పెళ్లి చేసుకుంటే అత్యంత ఆనందకరమైన ఆ ఏడాది కోసం రెండేళ్లు ఎదురు చూడాలన్నమాట. పెళ్లి ఖర్చు తక్కువగా ఉంటే ఎక్కువ కాలం, పెళ్లి ఖర్చు ఎక్కువగా ఉంటే తక్కువ కాలం దంపతులు కలిసి ఉంటారట! ఇది ఇంకో అబ్జర్వేషన్.
పెళ్లంటే ఉండే భయాన్ని ‘గామోఫోబియా’ అంటారు. మరి ఇలాంటి విషయాలన్నీ చెప్పుకుంటే గామోఫోబియా రాదా అని మీరు అనుకుంటుంటే ఈ టాపిక్‌ని ఇక్కడితో ఆపేద్దాం. అనుకోకపోతే ఇంకో రెండు విషయాలు చెప్పుకుని ముగిద్దాం.
ఒకటి: ధైర్యంగా పెళ్లి చేసుకోండి. ఏ ఫోబియాలూ మీ దరి చేరవు.
రెండు: ముహూర్త బలం ఎంత బలమైనదో.. దాంపత్య ఫలం అంతే బలమైనది. భార్యాభర్తల్లోని ఇచ్చిపుచ్చుకునే సర్దుబాటు ధోరణి పెళ్లిని పదికాలాల పాటు పదిలంగా ఉంచుతుంది. ముహూర్తానికే వన్నె తెస్తుంది.
భలే మంచి ముహూర్తము
8 నవంబర్ 2019 శుక్రవారం
ముహూర్తం: మధ్యాహ్నం 12.24 నుంచి నవంబర్ 9 తెల్లవారుఝాము 06.39 వరకు; నక్షత్రం: ఉత్తరాభాద్ర; తిథి : ద్వాదశి
9 నవంబర్ 2019 శనివారం
ముహూర్తం: ఉదయం 06.30 నుంచి నవంబర్ 10 ఉదయం 06.39 వరకు. నక్షత్రం: ఉత్తరాభాద్ర, రేవతి; తిథి: ద్వాదశి, త్రయోదశి.
10 నవంబర్ 2019 ఆదివారం
ముహూర్తం: ఉదయం 06.39 నుంచి 10.44 వరకు; నక్షత్రం: రేవతి; తిథి: త్రయోదశి
14 నవంబర్ 2019 గురువారం
ముహూర్తం: ఉదయం 09.15 నుంచి నవంబర్ 15 ఉదయం 06.43 వరకు; నక్షత్రం: రోహిణి, మృగశిర; తిథి: విదియ, తదియ
22 నవంబర్ 2019 శుక్రవారం
ముహూర్తం: ఉదయం 09.01 నుంచి నవంబర్ 23 ఉదయం 06.50 వరకు; నక్షత్రం: ఉత్తర ఫల్గుణి, హస్త; తిథి: ఏకాదశి
23 నవంబర్ 2019 శనివారం
ముహూర్తం: ఉ. 06.50 నుంచి మధ్యాహ్నం 02.46 వరకు; నక్షత్రం: హస్త; తిథి: ద్వాదశి
24 నవంబర్ 2019 ఆదివారం
ముహూర్తం: మధ్యాహ్నం 12.48 నుంచి నవంబర్ 25 అర్ధరాత్రి 01.06 వరకు; నక్షత్రం: స్వాతి; తిథి: త్రయోదశి
30 నవంబర్ 2019 శనివారం
ముహూర్తం: సాయంత్రం 06.05 నుంచి డిసెంబర్ 1 ఉదయం 06.56 వరకు; నక్షత్రం: ఉత్తరాషాఢ; తిథి: పంచమి.
(నవంబర్ 15, 19, 20, 21, 22 తేదీలలో పెళ్లి ముహూర్తాలు అతి స్వల్ప నిడివిలో మాత్రమే ఉండగా.. 27, 28, 29 మంచి ముహూర్తాలు లేవనే చెప్పాలి).
6. నవంబర్ 1 శుక్రవారం 2019.. మీ రాశిఫలాలు
మేషం
మేష రాశి : ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో కానీ, జీవిత భాగస్వామితో కానీ వ్యవహరించేటప్పుడు కొంత జాగత్త అవసరం. అనవసర వివాదాలకు తావివ్వకండి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. ఉదరసంబంధ లేదా మూత్ర సంబంధ అనారోగ్యం కారణంగా బాధపడుతారు.
వృషభం
వృషభం : ఈ రోజు మీ పైఅధికారులతో కానీ, సహోద్యోగులతో కానీ, స్నేహ పూర్వకంగా మెలగటం మంచిది. అనుకోని వివాదాలు జరిగే అవకాశముంటుంది కాబట్టి కోపానికి, ఆవేశానికి తావివ్వకండి. వాద వివాదాలకు దూరంగా ఉండండి. శివారాధన మేలు చేస్తుంది.
మిథునం
మిథునం : మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. మీ పిల్లలు మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తారు. ప్రయాణం కానీ, దేవాలయ సందర్శన కానీ చేస్తారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో అనుకూల ఫలితాలుంటాయి.
కర్కాటకం
కర్కాటకం : ఈ రోజు చాలా కాలం నుంచి వాయిదా పడుతున్న పనులు పూర్తి చేయటానికి అనుకూలంగా ఉంటుంది. వాటిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే ఉద్యోగంలో మీ పనికి మంచి గుర్తింపు వస్తుంది. ప్రయాణాలకు సాధారణ దినం.
సింహం
సింహం : ఈ రోజు డబ్బు విషయంలో కొంత సామాన్యంగా ఉంటుంది. అవసరానికి తగిన డబ్బు లభించకపోవడం కానీ, పెట్టుబడుల కారణంగా నష్టపోవడం కానీ జరుగవచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపార లావాదేవీలకు అనువైన దినం కాదు.
కన్య
కన్య : ఈ రోజు ఆరోగ్యం కొంత సామాన్యంగా ఉంటుంది. ఉదర లేదా ఛాతి సంబంధ సమస్యలు ఉండే అవకాశముంది. అలాగే మీ కుటుంబ సభ్యులు, బంధువుల ఆరోగ్యం కూడా మీ ఆందోళనకు కారణమవుతుంది. నీరు, ఆహారం విషయంలో జాగత్త అవసరం.
తుల
తుల : ఈ రోజు ఆర్థికంగా చాలా అనుకూలంచే దినం. రావలసిన బకాయిలు రావటమే కాకుండా మీరు తీర్చవలసిన బాకీలు కూడా తీర్చగలుగుతారు. అనుకోని డబ్బు కానీ, చేపట్టిన పనిలో విజయం కానీ వరిస్తుంది. ఉద్యోగం విషయంలో శుభవార్త వింటారు.
వృశ్చికం
వృశ్చికం : ఈ రోజు చేపట్టిన పనులు వాయిదా పడటం కానీ, అనుకోని అడ్డంకులు రావటం కానీ జరుగవచ్చు. ఇది కేవలం తాత్కాలికమే కాబట్టి పట్టువదలక ప్రయత్నించండి. విజయం మీ సొంతమవుతుంది. పని ఒత్తిడి కారణంగా స్వల్ప అనారోగ్యానికి, మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశముంటుంది. తగిన విశ్రాంతి తీసుకోవడం మంచిది.
ధనుస్సు
ధనుస్సు : ఈ రోజు దూర ప్రదేశం నుంచి ఒక శుభవార్త వింటారు. మీరు చేసిన పనికి మంచి గుర్తింపు లభిస్తుంది. పైఅధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రయాణం చేసే అవకాశముంటుంది. బంధువులను కలుసుకుంటారు.
మకరం
మకరం : ఈ రోజు ఆరోగ్యం విషయంలో కొంచెం శ్రద్ధ అవసరం. నేత్ర సంబంధమైన సమస్యలు కానీ, ఎలర్జీ బారిన కానీ పడే అవకాశముంటుంది. అలాగే మానసికంగా ఏదో తెలియని ఒత్తిడిని ఫీల్ అవుతారు. ఆర్థిక విషయాల్లో కూడా కొంత జాగ్రత్త అవసరం. డబ్బు ఎక్కువ దగ్గర పెట్టుకుని ప్రయాణం చేయకండి.
కుంభం
కుంభం : ఈ రోజు మీకు ఆనందంగా, లాభ దాయకంగా ఉంటుంది. అనుకోని మిత్రులను కలువడం, వారితో రోజును ఆనందంగా గడుపడం చేస్తారు. అలాగే మీ కుటుంబ సభ్యులను కలుసుకుంటారు. ఆర్థికంగా లాభిస్తుంది. పెట్టుబడుల నుంచి అనుకోని లాభం వస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది.
మీనం
మీనం : ఈ రోజు వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. మీ కోరిక నెరవేరటం, లక్ష్యానికి చేరువకావడం జరుగుతుంది. వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగం విషయంలో విదేశీయానానికి సంబంధించి శుభవార్త వింటారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.
7. పంచాంగం 01.11.2019
సంవత్సరం: వికారి
ఆయనం: దక్షిణాయణం
ఋతువు: శరద్
మాసం: కార్తిక
పక్షం: శుక్ల
తిథి: పంచమి రా.తె.04:04 వరకు
తదుపరి షష్టి
వారం: శుక్రవారం (భృగు వాసరే)
నక్షత్రం: మూల రా.01:27 వరకు
తదుపరి పూర్వాషాఢ
యోగం: అతిగండ, సుకర్మ
కరణం: బవ
వర్జ్యం: రా.12:09 – 01:27
దుర్ముహూర్తం: 08:32 – 09:18
మరియు 12:22 – 01:08
రాహు కాలం: 10:33 – 11:59
గుళిక కాలం: 07:40 – 09:06
యమ గండం: 02:52 – 04:18
అభిజిత్ : 11:36 – 12:22
సూర్యోదయం: 06:14
సూర్యాస్తమయం: 05:44
వైదిక సూర్యోదయం: 06:17
వైదిక సూర్యాస్తమయం: 05:41
చంద్రోదయం: ఉ.10:10
చంద్రాస్తమయం: రా.09:34
సూర్య సంచార రాశి: తుల
చంద్ర సంచార రాశి: ధనుస్సు
దిశ శూల: పశ్చిమం
చంద్ర నివాసం: తూర్పు
లాభ పంచమి
పాండవ పంచమి
శ్రీ పంచమి
నాగ పంచమి
సౌభాగ్య పంచమి
8. చరిత్రలో ఈరోజు, నవంబర్ 1
*సంఘటనలు*
అమెరికా చే 1952 నవంబర్ 1 న మార్షల్ దీవులలో ‘ఎనెవెటాక్’ వద్ద మొదటి హైడ్రోజన్ బాంబు ఇవీ మైక్ పరీక్షించబడింది.
1956: బెజవాడ గోపాల రెడ్డి ఆంధ్ర రాష్ట్రం (ఆంధ్ర ప్రదేశ్ కాదు) రెండవ ముఖ్యమంత్రిగా పదవీ విరమణ (1955 మార్చి 28 నుంచి 1956 నవంబర్ 1 వరకు).
1956: ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాదు రాజధానిగా, రాష్ట్రముగా అవతరించింది.
1956: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంతో పాటు, కేరళ, మైసూరు, బీహార్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఏర్పడ్డాయి.
1956 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్ట మొదటి ముఖ్యమంత్రి గా నీలం సంజీవ రెడ్డి ప్రమాణ స్వీకారం.
1959 : ఆంధ్ర ప్రదేశ్ లో పంచాయితీ రాజ్ వ్యవస్థ ప్రవేశపెట్టబడింది.
1966: పంజాబ్, హర్యానా రాష్ట్రాలు ఏర్పడ్డాయి.
1973: మైసూరు రాష్ట్రం పేరును కర్ణాటకగా మార్చారు. లక్కదీవులు, మినికాయ్, అమీన్ దీవులను కలిపి లక్ష ద్వీపాను ఏర్పాటు చేసారు.
1983: ఆంధ్ర ప్రదేశ్‌లో లోకాయుక్త వ్యవస్థ ఏర్పాటయింది. మొదటి లోకాయుక్తగా ఆవుల సాంబశివ రావు నియమితులయ్యారు.
2000: చత్తీస్ఘడ్ రాష్ట్రం ఏర్పాటయింది.
*జననాలు*
1897: దేవులపల్లి కృష్ణశాస్త్రి, ప్రసిద్ధ తెలుగు కవి. (మ.1980)
1915: వట్టికోట ఆళ్వారుస్వామి, ప్రముఖ రచయిత, ప్రజా ఉద్యమనేత. (మ.1961)
1919: అంట్యాకుల పైడిరాజు, ప్రముఖ చిత్రకారుడు మరియు శిల్పి. (మ.1986)
1944: తెలంగాణ రాష్ట్ర సీనియర్ రాజకీయ నాయకులు మాజీ వైద్య విధాన పరిషత్ మంత్రి కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు జననం
1945 : భారతీయ హేతువాది మరియు మహారాష్ట్రకు చెందిన రచయిత నరేంద్ర దభోల్కర్ జననం (మ.2013).
1972: పరిపూర్ణానంద స్వామి, మత సామరస్య బోధకుడు.
1973: ఐశ్వర్యా రాయ్, అందాల తార, ప్రముఖ నటి,
1974: వి.వి.యెస్.లక్ష్మణ్, ప్రముఖ క్రికెట్ ఆటగాడు.
1987 : తెలుగు సినిమా నటీమణి ఇలియానా జననం.
*మరణాలు*
1989: హరనాథ్, తెలుగు సినిమా కథానాయకుడు. (జ.1936)
1996: శ్రీలంక మాజీ అధ్యక్షుడు జయవర్థనే.
1996 : సంగీత విద్వాంసుడు మల్లాది వెంకట సత్యనారాయణ రావు మరణం (జ.1932).
*మన పండుగలు/జాతీయ దినోత్సవాలు*
*ఆంధ్ర ప్రదేశ్అవతరణ దినోత్సవము.*
*కర్ణాటక, హర్యానా, కేరళ, మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవం.*
9. శ్రీరస్తు శుభమ
ది : 1, నవంబర్ 2019*
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : కార్తీకమాసం
ఋతువు : శరత్ఋతువు
కాలము : వర్షాకాలం
వారము : భృగువాసరే (శుక్రవారం)
పక్షం : శుక్లపక్షం
తిథి : పంచమి
(ఈరోజు తెల్లవారుజాము 1 గం॥ 1 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 0 గం॥ 51 ని॥ వరకు పంచమి తిధి తదుపరి షష్ఠి తిధి)
నక్షత్రం : మూల
(నిన్న రాత్రి 9 గం॥ 31 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 9 గం॥ 52 ని॥ వరకు మూల నక్షత్రం తదుపరి పూర్వాషాఢ నక్షత్రం )
యోగము : (అతిగండ ఈరోజు ఉదయం 7 గం ll 57 ని ll వరకు తదుపరి సుకర్మ రేపు ఉదయం 6 గం ll 51 ని ll వరకు)
కరణం : (బవ ఈరోజు మద్యాహ్నం 12 గం ll 56 ని ll వరకు)
అభిజిత్ : (ఈరోజు ఉదయం 11 గం ll 59 ని ll )
వర్జ్యం : (ఈరోజు తెల్లవారుజాము 5 గం॥ 38 ని॥ నుంచి ఈరోజు ఉదయం 7 గం॥ 15 ని॥ వరకు)(ఈరోజు రాత్రి 8 గం॥ 15 ని॥ నుంచి ఈరోజు రాత్రి 9 గం॥ 52 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 23 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 5 గం॥ 0 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 8 గం॥ 20 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 6 ని॥ వరకు)(ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 9 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 55 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 10 గం॥ 34 ని॥ నుంచి ఈరోజు ఉదయం 11 గం॥ 59 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 7 గం॥ 42 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 8 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 51 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 16 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 15 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 5 గం॥ 45 ని॥ లకు
సూర్యరాశి : తుల
చంద్రరాశి : ధనుస్సు
10. నేటి ఆణిముత్యం *
బురద జల్లవలదు పరులపై నెన్నడు
అంటు నదియె మనదు హస్తములకు!
మాట యనెడి ముందు మర్యాద నెరుగుమా
నింద యెప్పుడైన పొందు చెరుపు!
*భావం:*
ఇతరులమీద బురదజల్లే ప్రయత్నం చేయవద్దు.అది నీ చేతికి కూడా అంటుకునే అవకాశంఉంది.ఎవరినైన మాట అనేముందు హద్దులు తెలుసుకో.పరులను నిందచేయడం వల్ల అది స్నేహాన్ని చెరుపుతుంది…చూసుకో.
11. నేటి సుభాషితం*
*మహోన్నత వ్యక్తిత్వాన్ని గుర్తించడం చాలా కష్టం. ఆ ఛాయలు ఎంతో కొంత మనలో కూడా ఉంటేనే అది సాధ్యం.*
12. నేటి సామెత *
*పండిత పుత్ర పరమ శుంఠ*పండితుని కొడుకు పరమ మూర్కుడవుతాడని ఈ సామెతకు అర్థం. ఇది ప్రాస కొరకు మాత్రమే పుట్టిన సామెత.
13. నేటి తీయం*
*కొత్తల్లుడు*ఎక్కువగా మర్యాదలు, అధిక గౌరవం పొందుతున్న వ్యక్తి. అన్నీ చక్కగా అమరుతున్నవాడు.
14. మన ఇతిహాసాలు *
*బలరాముడు*
బలరాముడు, బలదేవుడు లేదా బలభద్రుడు, వీరు స్వయం భగవానుడు అయిన శ్రీకృష్ణుల వారికి సోదరులగా జన్మించిన అంశావతారము.వీరి ఆయుధము హలము, నాగలి.వీరు గొప్ప వీరులు, దయామయులు, కృష్ణుని అన్ని వేళలా తోడుగా ఉన్నవారు. వీరి భార్య రేవతి.
ఒకసారి కోపం వచ్చి యమునా నది దిశ మార్చారు, మరొకసారి హస్తినాపురాన్నే నేటి ఢిల్లీని తన హలాయుధంతో యమునలో కలప ఉద్యుక్తులయినారు.వీరు కురుక్షేత్ర యుద్దమప్పుడు శాంతి కాముకులై తీర్థ యాత్రలు చేసారు. అప్పుడు దర్శించిన ప్రదేశాలలో తిరుమల కూడా ఉంది.
*బలరాముని కి గల పేర్లు*
బలభద్రుడు
ప్రలంభఘ్నుడు
బలదేవుడు
అచ్యుతాగ్రజుడు
రేవతీరమణుడు
కామపాలుడు
హలాయుధుడు
నీలాంబరుడు
రోహిణేయుడు
తాలాంకుడు (తాటి చెట్టు గుర్తు కలవాడు)సంకర్షణుడు (ఒక గర్భము నుండి మరియొక గర్భమునకు లాగబడిన వాడు)సీరపాణికాళినేఛేదనుడు (కాళిందిని భంగ పరచినవాడు)భీమదుర్యోధనులిద్దరూ ఆయనకి గదాయుద్ధంలో శిష్యులు. వాస్తవానికి భీముడికన్నా దుర్యోధనుడికే గదాయుద్ధంలో కాస్త ప్రావీణ్యం ఎక్కువ. భారత యుద్ధంలో తనకి కౌరవపాండవులిద్దరూ సమానమే కాబట్టి తటస్థంగా ఉంటాడు. యుద్ధంలో ఎవరి పక్షమూ వహించక తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు. కొన్ని విషయాల్లో శ్రీకృష్ణునితో ఏకీభవించకపోయినప్పటికీ, ఆయనను అతిక్రమించి మాత్రం ప్రవర్తించలేదు. ఇక్కడే బలరామునిలో ప్రకృతి తత్త్వం కనిపిస్తుంది.
15. కార్తీక పురాణం – 5 *
* 5 వ అధ్యాయము : వనభోజన మహిమ, కిరాత మూషికములు మోక్షము నొందుట. *
*’ఓ శివధనుస్సంపన్నా! జనకరాజా! శ్రద్దగా విను. మనము చేసిన పాపాలన్నింటినీ- నశింపచేయగల శక్తి ఒక్క కార్తీక మాస వ్రతానికి మాత్రమే వుంది. కార్తీకమాసములో విష్ణుసన్నిధిని ఎవరయితే భగవద్గీతా పారాయణమును చేస్తారో – వారి పాపాలన్నీ కూడా పాము కుబుసములాగా తొలగిపోతాయి. అందునా పదీ – పదకొండు అధ్యాయాలను పారాయణ చేసేవారు – వైకుంఠానికి క్షేత్రపాలకులవుతారు. ఎవరయితే కార్తీకమాసంలో తులసీదళాలతోగాని, తెలుపు లేదా నలుపు గన్నేరు పూలతో గాని విష్ణుపూజను చేస్తారో -వాళ్లు వైంకుఠానికి చేరి, విష్ణు సమభోగాల ననుభవిస్తారు. ఈ కార్తీకమాసంలో హరిహరులెవరి సన్నిధినైనా సరే – ఏ పురాణాన్నయినా సరే ప్రవచించేవారు సర్వ కర్మబంధ విముక్తులవుతారు.*
*. కార్తీక వనభోజనము*
*శ్లో” యః కార్తీకే సితే వనభోజన మాచరేత్*
*సయాతి వైష్ణవం ధామ సర్వపాపైః ప్రముచ్యతే !!*
*కార్తీకమాస శుక్లపక్షంలో వనభోజనము చేసినవారు – పాపవిముక్తులై విష్ణుధామాన్ని పొందుతారు. జప, హోమ, పూజా, భోజన, తర్పణ ఫలాలతో – పాపీ క్షుద్ర ఛండాలాది అశౌచవంతుల యొక్క సంభాషణలను వినిన పాపం తుడిచి పెట్టుకు పోతుంది. కాబట్టి మహారాజా! కార్తీకమాస శుక్లపక్షంలో అన్నిరకాల వృక్షాలతో బాటుగా ఉసిరిచెట్టు కూడా వున్న తోటలోనే వనభోజనమును ఏర్పాటు చేసుకోవాలి. ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామము నుంచి, గంధ పుష్పాక్షతాదులతో పూజించి, యధాశక్తి బ్రాహ్మణుల నాహ్వానించి గౌరవించి, వారితో కలసి భోజనము చేయాలి. ఇలాగున – కార్తీక మాసములో వనభోజనాన్ని యెవరయితే నిర్వహిస్తారో, వాళ్లు ఆయా కాలాలలో చేసిన సర్వపాపాల నుంచీ తెములుకుని, విష్ణులోకాన్ని పొందుతారు. జనకజనపతీ! ఈ కార్తీక మహాత్మ్యాన్ని భక్తిశ్రద్ధలతో విన్న బ్రహ్మణుడొకడు దుర్యోనీ సంకటము నుంచీ రక్షింపబడ్డాడు. కథ చెబుతాను విను.*
. దేవదత్తో పాఖ్యానము:*
*పూర్వం కావేరీ తీరములో దేవశర్మ అనే సద్భ్రాహ్మణుడుండేవాడు. అతనికొక పరమ దుర్మార్గుడయిన కుమారుడు కలిగాడు. అతని పేరు దేవదత్తుడు. అతగాడి దుష్ట ప్రవర్తనలను గుర్తించిన తండ్రి, అతగాడిని పాపవిముక్తుని చేయాలని సంకల్పించి ‘నాయనా! రోజూ కార్తీక ప్రాతః స్నానాన్ని ఆచరించు. సాయంకాలమున హరి సన్నిధిలో దీపారాధనమును చేస్తూ వుండు. ఈ విధంగా కార్తీక వ్రతాన్ని ఆచరించి ధన్యుడివికా’ అని చెప్పాడు. కాని దుర్వర్తనుడయిన ఆ బ్రాహ్మణ పుత్రుడు – తానటువంటి కట్టుకథలను నమ్మననీ, కార్తీక వ్రతాన్ని ఆచరించననీ – తండ్రికి యెదురుతిరిగాడు. అందుకు కినిసిన దేవశర్మ తన కుమారుడిని ‘అడవిలోని చెట్టు తొర్రలో యెలుకవై పడివుండు’ అని శపించాడు. శాపానికి భయపడిన ఆ విప్రకుమారుడు తండ్రి పాదాలబడి, తనకు తరణోపాయం చెప్పమని కోరగా – ఆ తండ్రి ‘ నాయనా ! నీ వెప్పుడైతే కార్తీక మహాత్మ్యాన్ని సంపూర్ణముగా వింటావో అప్పుడే నీ యెలుక రూపము పోతుం’దని – శాపవిముక్తి అనుగ్రహించాడు.*
. దేవదత్తునికి శాపవిముక్తి:*
*పితృశాప కారణంగా అప్పటికప్పుడే మూషికరూపాన్ని ధరించిన బ్రాహ్మణ యువకుడు గజారణ్యములో ఫలవంతమైనదీ – అనేక జంతువుల కాధారభూతమైనదీ అయిన ఒకానొక మహావృక్ష కోటరములో మనసాగాడు. ఇలా కొంతకాలము గడిచాక, ఒకానొకప్పుడు మహర్షియైన విశ్వామిత్రుడు శిష్య సమేతంగా కార్తీక స్నానమాచరించి వచ్చి, ఆ యెలుక వున్న చెట్టు మొదలునందు దువిష్ణుడై తన పరివారానికి పరమపావనమైన కార్తీక మహాత్మ్యాన్ని వినిపించసాగాడు.
*ఆ సమయంలో దయాహీనుడూ, పాపాలపుట్టా, అడవి జీవాలను హింసించి పొట్టపోసుకునేవాడూ అయిన ఒక కిరాతకుడాప్రాంతాలకు వచ్చాడు. పుణ్యపురుషుల దర్శనమువల్ల ఉపకారమేగాని, అపకారము యేనాడూ జరుగదు. అదేవిధముగా, విశ్వామిత్రాది తపోబృంద దర్శనమాత్రం చేత – రవంత పశ్చాత్తప్తుడూ – జ్ఞానీ అయిన ఆ కిరాతకుడు వారిని సమీపించి ‘అయ్యా ! మీరు చెప్పుకుంటున్న కథలేమిటి? అని వింటూంటే – నాకీ కిరాతక జీవితం పట్ల చిరాకు పుడుతోంది. దయచేసి ఈ రహస్యమేమిటో చెప్పండి’ అనగానే, అతనిలో వివేకం విచ్చుకుంటున్న వైనమును గమనించిన విశ్వమిత్రుడు – ‘నాయనా! మేము కార్తీక వ్రతాన్ని ఆచరిస్తున్నాము. ఈ కార్తీక మాసములో యెవరయినా సరే తెలిసిగాని, తెలియకగాని స్నాన దాన జప తపః పురాణ శ్రవణాదును చేసినట్లయితే వారు వారి సర్వ పాపాలనుంచీ విముక్తులవుతారు. ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించేవాళ్లు జీవన్ముక్తులవుతారు’ అని తెలియజేశాడు. ఈ విధముగా కిరాతకునికి చెబుతూన్న కార్తీక మహాత్మ్యాన్ని వినడమే తడవుగా – తొర్రలోనున్న యెలుక తన శాపగ్రస్తరూపాన్ని వదలివేసి, పూర్వ యువ బ్రాహ్మణ రూపాన్ని పొంది – విశ్వామిత్రాదులకు ప్రణమిల్లి తన పూర్వవుగాధను వినిపించి, ఆ బుషులనుండి సెలవు తీసుకొని తన ఆశ్రమానికి తరలిపోయాడు. అనంతరము ఆ కిరాతకుడు కూడా విశ్వామిత్రాదుల వలన కార్తీక మహత్మ్యాన్ని కడకంటా తెలుసుకోవడం వలన – ఆ జన్మకి కిరాతకూడయ్యీ కూడా – దేహంతరాన ఉత్తమగతులను పొందాడు. కాబట్టి ఓ జనకరాజా! ఉత్తమ గతులను కోరేవారు ప్రయత్నపూర్వకముగా నయినాసరే కార్తీక వ్రతమాచరించాలి. లేదా, కనీసము కార్తీక మహాత్మ్యాన్
16. శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా శ్రీ మనవాళ మహాముని సాత్తుమొర
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ మనవాళ మహాముని ఆలయంలో సాత్తుమొర శుక్రవారం ఘనంగా జరిగింది. అక్టోబరు 23న ప్రారంభమైన శ్రీ మనవాళ మహాముని సాలకట్ల ఉత్సవాలు పది రోజుల పాటు ఘనంగా జరిగాయి.ఈ దర్భంగా ఉదయం 10.00 నుండి సాయంత్రం 4.00 గంటల వరకు శ్రీ మనవాళ మహాముని ఉత్సవర్లకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరినీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం 4.00 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారు శ్రీమనవాళ మహాముని ఆలయానికి వేంచేపు చేశారు.సాయంత్రం 5.00 నుండి 6.00 గంటల మధ్య తిరుమల శ్రీవారి ఆలయం నుండి తీసుకువచ్చిన అప్పాపడిని తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయం నుండి ఊరేగింపుగా తెచ్చి శ్రీ మనవాళ మహాముని వారికి సమర్పిస్తారు. అనంతరం రాత్రి 7.00 నుండి 8.30 గంటల వరకు అలంకార శోభితుడైన శ్రీ గోవిందరాజస్వామివారు ఉభయనాంచారులు, శ్రీ మనవాళ మహామునితో కలసి తిరుమాఢవీధులలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించనున్నారు. అనంతరం శ్రీ మనవాళ మహాముని ఆలయంలో ప్రబంధపారాయణం, శాత్తుమొర, నైవేద్యం నిర్వహిస్తారు.ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ షడగోప రామానుజ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ గోవింద రామానుజ చిన్నజీయర్‌స్వామి, టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఇవో శ్రీ రవికుమార్ రెడ్డి, సూపరింటెండెంట్ శ్రీజ్ఞానప్రకాష్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ కృష్ణమూర్తి, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
17. కపిలతీర్థంలో ఘనంగా శ్రీ సుబ్రమణ్యస్వామివారి హోమం ప్రారంభం
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో నెల రోజుల పాటు జరుగుతున్న హోమ మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం శ్రీ సుబ్రమణ్యస్వామివారి హోమం ఘనంగా ప్రారంభమైంది.ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 9.00 నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు పూజ, హోమం, లఘుపూర్ణాహుతి, నివేదన, హారతి నిర్వహించారు. సాయంత్రం 6.00 నుండి 8.00 గంటల వరకు హోమం, సహస్రనామార్చన, విశేష దీపారాధన చేపట్టనున్నారు.కాగా శనివారం కూడా శ్రీ సుబ్రమణ్యస్వామివారి హోమం జరుగనుంది. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం 6.00 నుండి 8.00 గంటల వరకు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్య స్వామివారి దివ్యకల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. గృహస్తులు (ఇద్దరు) రూ.250/- చెల్లించి టికెట్ కొనుగోలు చేసి శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి కల్యాణంలో పాల్గొనవచ్చు. వీరికి అన్నప్రసాదాలు బహుమానంగా అందజేస్తారు.గృహస్తులు రూ.500/- చెల్లించి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేస్తారు. ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ రెడ్డి శేఖర్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
18. ఆన్లైన్లో 69,512 శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు విడుదల
శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించిన 2020, ఫిబ్రవరి నెల కోటాలో మొత్తం 69,512 టికెట్లను శుక్రవారం ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్లైన్లో విడుదల చేసింది.ఆన్లైన్ డిప్ విధానంలో 10,112 సేవా టికెట్లు ఉన్నాయి. ఇందులో సుప్రభాతం 7,332, తోమాల 120, అర్చన 120, అష్టదళపాదపద్మారాధన 240, నిజపాదదర్శనం 2300 టికెట్లు ఉన్నాయి. ఆన్లైన్లో జనరల్ కేటగిరిలో 59,400 సేవాటికెట్లు ఉండగా, వీటిలో విశేషపూజ 2,000, కల్యాణం 13,300, ఊంజల్‌సేవ 4,200, ఆర్జితబ్రహ్మోత్సవం 7,700, వసంతోత్సవం 15,400, సహస్రదీపాలంకారసేవ 16,800 టికెట్లు ఉన్నాయి.నవంబరు 5న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల ఫిబ్రవరి కోటా విడుదల భక్తుల సౌకర్యార్థం 2020 ఫిబ్రవరి నెల రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను నవంబరు 5న టిటిడి విడుదల చేయనుంది. ఐటి అధికారులు ఈ మేరకు చర్యలు చేపట్టారు. ఆన్లైన్, ఈ-దర్శన్ కౌంటర్లు, పోస్టాఫీసుల్లో ఈ టికెట్లను భక్తులు బుక్ చేసుకోవచ్చు.భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్లైన్లో ముందస్తుగా రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని టిటిడి కోరుతోంది.