మోకాళ్ల నొప్పులను ఆయుర్వేదంలో ‘సంధివాతం’ అంటారు. ఇది వాతదోషం వికారం చెందటం వల్ల వస్తుంది. సంధివాతంలో కొందరికి ఒక మోకాలులోనే నొప్పి, వాపు ఉండొచ్చు. కొందరికి రెండు మోకాళ్లలోనూ, ఇతరత్రా కీళ్లలోనూ సమస్య ఉండొచ్చు. కొందరికి వాపు లేకుండా కూడా నొప్పి వస్తుండొచ్చు. మీరు చెప్పిన వివరాలను బట్టి చూస్తుంటే రెండు మోకాళ్లలోనూ నొప్పి ఉన్నట్టు అనిపిస్తోంది. మీరు ఉదయం పూట రుమార్తో గోల్డ్, రుమార్తో ప్లెయిన్ ఒక్కొక్క మాత్ర.. సాయంత్రం రుమార్తో ప్లెయిన్ రెండు మాత్రల చొప్పున వేసుకుంటే గుణం కనబడుతుంది. అయితే వీటిని నిపుణుల సలహాతోనే తీసుకోవాలి. అందువల్ల మీరు ఆయుర్వేద వైద్యుడిని సంప్రతించటం మంచిది. అశ్వగంధాది చూరాన్ని పాలతో కలిపి తీసుకున్నా మంచి ఫలితం కనబడుతుంది. అయితే అశ్వగంధ చూర్ణంతో పాలు చేదవుతాయి. కాబట్టి ముందుగా కొద్దిగా పాలు తీసుకొని అందులో చెంచాడు అశ్వగంధాది చూర్ణం కలిపి తాగాలి. తర్వాత మిగతా పాలు తాగాలి. ఇలా ఉదయం, సాయంత్రం తీసుకోవాలి. అలాగే మహా నారాయణ తైలం మోకాళ్ల మీద నెమ్మదిగా మర్దన చేసుకోవచ్చు. ఈ తైలం మర్దన చేసుకున్నాక.. దాని మీద వెచ్చజేసిన వావిలాకును గుడ్డలో చుట్టి కాపడం పెడితే మరింత గుణం కనబడుతుంది. వీలైతే రాత్రిపూట మోకాళ్లపై పసుపు చల్లి.. దానిపై వావిలాకును వేసి కట్టు కట్టుకొని పడుకోవచ్చు. అయితే మీరు మధుమేహం ఉందో లేదో తెలియజేయలేదు. మధుమేహులకు వేడి కాపడంతో గుల్లల వంటివి తలెత్తొచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండటం అవసరం.
మహా నారాయణ తైలం మోకాళ్ల మీద మర్దన చేస్తే
Related tags :