Editorials

కీర్తి క్రిమినల్ ఎందుకు అయింది?

The mind blowing story of Keerthi who killed her own Mom

తండ్రి శ్రీనివాస్ రెడ్డి.. ఓ లారీ డ్రైవర్. తల్లి నీరజ గృహిణి. వీరికి ఒక్కతే కూతురు కీర్తి. తల్లిదండ్రులు అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచారు. అమెరికాలో స్థిరపడేలా చూడాలని కలలు కన్నారు. అయితే, సామాజిక పరిస్థితుల ప్రభావంతో ఆ అమ్మాయి డిగ్రీ ఫస్టియర్లోనే ప్రేమ వ్యవహారం నడిపితే గొడవలయ్యాయి. ఇపుడు సెకండియర్ లో మరో అబ్బాయితో ప్రేమ పేరుతో తిరుగుతోంది ఆ కూతురు. ఈ విషయం బయటకొస్తే తమ కుటుంబం పరువు బజారున పడుతుందని ఆలోచించి, తప్పు చేయవద్దని కూతురిని మందలించి, ప్రవర్తన మార్చుకొమ్మని హెచ్చరించిందా తల్లి. దీంతో బాగా కోపం పెంచుకొని, తల్లిని చున్నీతో ఉరి తీసి చంపి శవం ఇంట్లో ఉండగానే ప్రియుడితో మూడు రోజులు గడిపి, తర్వాత కారులో శవాన్ని తీసుకెళ్లి రైలు పట్టాలపై పడుకోబెట్టి, అందరినీ నమ్మించిందంటే.. ఆ కూతురు ఎంతటి కసాయో అర్ధం చేసుకోవచ్చు. చివరకు తండ్రినే అందరూ అనుమానించేలా.. నీ గొడవల వల్లే తల్లి చనిపోయిందంటూ తప్పుడు నిందలేసి బలి పశువు చెయ్యాలని కూడా చూసింది .

కూతురుని అల్లారు ముద్దుగా పెంచినందుకు తల్లి దిక్కు లేని చావు చచ్చింది . కనీసం శవం కూడా సరైన దహన సంస్కారానికి నోచు కోలేదు. ఇక తండ్రి బతికిఉన్న శవమే. ఆ క్రిమినల్ కూతురికి కనీసం పదేళ్లు జైలు జీవితం. అంటే మొత్తం ఒక కుటుంబం నాశనం. కీర్తి పేరు పెట్టుకున్న కూతురు తల్లినే చంపి ఇంతటి అపకీర్తి ఎందుకు తెచ్చింది. కన్న పిల్లల మనసు ఇంత విషపూరితం ఎందుకు అవుతోంది? చందమామ, బాల మిత్ర కథలు, సత్య హరిశ్చంద్ర, రామాయణ, మహాభారత కథలు – ఇలా మొన్నటి దాక వినోదం అంటే నైతిక సూత్రాల పాఠాలు. ఇప్పుడు వినోదం అంటే కుటుంబంలో ఒకరిపై ఒకరు విద్వేషాలు పెంచుకొనే పాత్రలతో టీవీ సీరియల్స్, వీడియో గేమ్స్ , క్రైమ్ న్యూస్, చెత్త సినిమాలు నెట్ ఫ్లిక్ , యూట్యూబ్ షార్ట్ మూవీస్ – వీటితో పిల్లల మనస్సులోకి విషం ఎక్కించడమే. ఇలా తల్లితండ్రికి తెలియకుండానే ప్రతి ఇంట్లో మనసు విద్వేషాలతో నిండిన పిల్లలు తయారవుతున్నారు.

హైదరాబాద్ లో రాత్రి పది గంటల తరువాత ఏదైనా పబ్ లోకి అడుగుపెడితే అర్థం అవుతుంది. చెడును ఒంటపట్టించుకోవడంలో అమ్మాయిలు కూడా అబ్బాయిలను దాటిపోతూ.. లింగ భేదాన్ని ఎలా చెరిపేస్తున్నారో. మన పిల్లల బాగుకోసం ప్రభుత్వాలు, సంస్థలను నిందించి లాభం లేదు. ఈ సమస్యలకు పరిష్కారం తల్లితండ్రుల చేతుల్లోనే వుంటుంది.

– మీరు మంచి తల్లదండ్రులైతే మీ పిల్లల్ని స్మార్ట్ ఫోన్లకు దూరం చెయ్యండి.

– టీవీ, ఇంటర్ నెట్ పై వారు ఏమి చూస్తున్నారో ఒక కంట కనిపెట్టి వుండండి.

– మంచి పుస్తకాలను వారిచే చదివించండి. వారితో కొంత సమయం గడపండి.

– వారితో స్నేహితుల్లా ఉంటే వారు మీ చెయ్యి దాటిపోకుండా వుంటారు.

– పిల్లలను లక్ష సాధన వైపు సాగిపోయ్యేందుకు వారికీ మంచి మార్గం చూపాలి.

– అవును ఖచ్చితంగా చందమామ, బాల మిత్ర నీతి కథలు చెప్పాల్సిందే..

– సత్య హరిశ్చంద్ర, రామాయణ, మహాభారత కథలు అర్ధం చేయించాల్సిందే..

– ఈ దేశం కోసం, ఈ జాతి బాగుకోసం ప్రాణాలర్పించిన వారి గాథలు చెప్పాల్సిందే..

– ఈ పని కేవలం అవగాహన కలిగిన పేరెంట్స్ మాత్రమే చెయ్యగలరు. తప్పక చేస్తారు.

– అలాంటి మంచిపనిని ఈ రోజు నుంచే ప్రారంభించండి.