చెరిసగం కాలం పాలనపై పట్టువీడని శివసేన ఆదివారం తన స్వరాన్ని మరింత పెంచింది. ఆ పార్టీ ప్రముఖ నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. భాజపాతో చర్చలంటూ జరిపితే అది కేవలం ముఖ్యమంత్రి పదవిపైనేనని తేల్చి చెప్పారు. తమకు ఇప్పటికే 170మంది ఎమ్మెల్యేల మద్దతుందని.. ఆ సంఖ్య 175కి కూడా చేరే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. యడియూరప్ప తరహా రాజకీయాలు ఇక్కడ చెల్లవంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎట్టిపరిస్థితుల్లో భాజపాకు శివసేన తలొగ్గదని.. కావాల్సింది సాధించుకొని తీరతామని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే భాజపా ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకుందని.. కానీ, శివసైనికుడే ప్రమాణం చేస్తారన్నారు.
అంతకుముందు శివసేన అధికారిక పత్రిక సామ్నాలో ‘అహంకారం అనే బురదలో రథం ఇరుక్కుపోయింది’ అనే శీర్షికతో రాసిన వ్యాసంలో సంజయ్ భాజపాపై విమర్శనాస్త్రాలు సంధించారు. శివసేనతో కలిసి పోటీ చేసినందు వల్లే భాజపా 105 స్థానాల్లో విజయం సాధించిందని.. లేనిపక్షంలో ఆ పార్టీ 75సీట్లకే పరిమితమయ్యేదన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఉద్దవ్ ఠాక్రేతో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ చర్చించి ఉంటే పరిస్థితులు దిగజారేవి కాదన్నారు. కేవలం ముఖ్యమంత్రి పదవిపైనే సందిగ్ధత నెలకొందన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ట్రబుల్ షూటర్ అమిత్ షా ఎందుకు రంగంలోకి దిగడం లేదో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. శివసేనకు సీఎం పదవి ఇవ్వడానికి ఫడణవీస్ ఏమాత్రం ఇష్టపడడం లేదన్నారు. ఎన్నికలకు ముందు పొత్తులో భాగంగా కుదిరిన ఒప్పందాల్ని ఆయన పాటించట్లేదని ఆరోపించారు. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటుకు ఐదు మార్గాలున్నాయన్నారు. అవేంటో ఆయన మాటల్లోనే..
‘‘ఒకటి.. అతిపెద్ద పార్టీగా అవతరించిన భాజపా.. శివసేన లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యొచ్చు. కానీ, 40మంది ఎమ్మెల్యేలు తక్కువ ఉండడం వల్ల విశ్వాసపరీక్షలో నెగ్గకపోవచ్చు. ఇక రెండోది.. కేంద్రంలో సుప్రియా సూలే, రాష్ట్రంలో అజిత్ పవార్ కీలక పదవుల హామీతో 2014 తరహాలో భాజపాకు ఎన్సీపీ మద్దతివ్వొచ్చు. కానీ 2014లో చేసిన తప్పుని ఎన్సీపీ పునరావృతం చేయదని ఆశిస్తున్నాను. ఇక మూడో మార్గంగా శివసేన, ఎన్సీసీ, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. ఇందులో ముఖ్యమంత్రి పదవి శివసేనకు దక్కుతుంది. ప్రజల ప్రయోజనాల దృష్ట్యా సిద్ధాంతాలు వేరైనా పార్టీలు కలిసి పనిచేయాల్సి ఉంటుంది. నాలుగోదానికి వస్తే.. భాజపా, శివసేన కలిసి కొన్ని విషయాల్లో వెనక్కి తగ్గి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. ముఖ్యమంత్రి పదవి మాత్రం చెరిసగం కాలం పంచుకోవాల్సిందే. ఇదే అన్నింటికంటే ఉత్తమమైన మార్గం కానీ, అహంకారం వల్ల ఇది సాధ్యం కాకపోవచ్చు. ఇక చివరిది.. దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకొని ఇతర పార్టీలని చీల్చి భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. కానీ, పార్టీ ఫిరాయించిన వారిని ప్రజలు ఎలా తిరస్కరించారో తాజా ఎన్నికల్లో చూశాం. ఈ నేపథ్యంలో పార్టీల్ని చీల్చడం ప్రధాని మోదీ ప్రతిష్ఠకే భంగం కలగజేస్తుంది’’ అంటూ సంజయ్ రౌత్ ఐదు మార్గాల్ని తన వ్యాసంలో వివరించారు.