ఆరోగ్యానికి అరగంట!
వ్యాయామం చేసేందుకు సమయం లేదా… రోజులో అరగంట మీ కోసం కేటాయించుకోండి చాలు. బరువు అదుపులో ఉండటంతోపాటు ఫిట్‌గా మారతారు.
భుజాల ఆకృతికి… నిటారుగా నిల్చోవాలి. రెండు కేజీలున్న బరువుల్ని చేతులతో పట్టుకోవాలి. ఇప్పుడు చేతుల్ని నెమ్మదిగా పైకెత్తి దించాలి. ఇలా అరవైసార్లు చేయాలి. కొన్నాళ్లయ్యాక ఆ బరువుల్ని పెంచాలి. దీన్ని క్రమం తప్పకుండా చేయడం వల్ల భుజాల దగ్గర ఉన్న కండరాలు బలంగా మారతాయి.
స్క్వాట్స్… కొత్తగా వ్యాయామం మొదలుపెట్టేవారు దీన్ని ఎంచుకోవచ్చు. నిటారుగా నిల్చుని… చేతుల్ని ముందుకు పెట్టి… నడుముభాగాన్ని వంచేందుకు ప్రయత్నించాలి. నడుముభాగంలో పేరుకొన్న కొవ్వు కరుగుతుంది. రోజూ అరవైసార్లు చేస్తే చాలు. .
పుషప్స్… ఛాతి, భుజాల దగ్గర ఉండే కండరాలు దృఢంగా మారేందుకు ఇవి తోడ్పడతాయి. కొత్తగా చేసేవారు బంతి సాయం తీసుకోవచ్చు లేదా మోకాళ్లపై బరువు వేస్తూ చేయొచ్చు. కొంచెం అనుభవం వచ్చాక కాళ్లు, చేతులపై శరీర భారాన్ని వేస్తూ అరవైసార్లు చేయాలి.
బరువులు ఎత్తడం… నిటారుగా నిల్చోవాలి. పొడవాటి రాడ్డుకు రెండుకేజీల బరువున్న ప్లేట్లు పెట్టి… దాన్ని పైకెత్తేందుకు ప్రయత్నించాలి.
ప్లాంక్… ఇదీ పొట్టకు సంబంధించిన వ్యాయామమే. బోర్లా పడుకుని… నెమ్మదిగా కాళ్లపై బరువు వేస్తూ… చేతుల్ని ఆసరా చేసుకుని వీలైనంత సేపు ఉండేందుకు ప్రయత్నించాలి.
పొట్టకు బైసైకిల్ క్రంచ్… మొదట మ్యాట్ మీద వెల్లకిలా పడుకోవాలి. కుడి మోకాలిని మడిచి ఛాతి దాకా తీసుకురావాలి. రెండో కాలిని నిటారుగా ఉంచాలి. చేతులతో కుడికాలిని పట్టుకోవాలి. ఇదేవిధంగా రెండోవైపు చేయాలి. పిరుదులు, పొట్టపై ఒత్తిడి పడుతుంది. ఆ భాగంలో పేరుకొన్న కొవ్వు కరుగుతుంది.
లాభాలు ఏమిటంటే…
* ప్రతిరోజూ అరగంటపాటు ఈ వ్యాయాయాలు చేయడం వల్ల గుండెపోటు, గుండె సంబంధ వ్యాధులు, జీవక్రియలకు చెందిన సమస్యలు, మధుమేహం…వంటి సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.
* బరువు నియంత్రణలో ఉంటుంది. శరీరం ఫిట్‌గా మారుతుంది. రోజంతా చురుగ్గా ఉంటారు.
* ఒత్తిడీ తగ్గుతుంది.