DailyDose

కేసీఆర్ తొందరపడ్డారు-తాజావార్తలు-11/03

Kishan Reddy On KCR And TSRTC Strike-Telugu Breaking News-11/03

* కార్మికుల్లో ఎంత ఆవేదన ఉందో రోడ్లపైకి వచ్చిన వారినే చూస్తే తెలుస్తుందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా విశాఖలో లాంగ్‌మార్చ్‌ నిర్వహించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో పవన్‌ మాట్లాడారు. ప్రభుత్వం సరిగా పనిచేయనందునే ఇంతమందిలో ఆవేదన పెరిగిందన్నారు. ఇప్పటి వరకు 36 మంది భవన నిర్మాణ కార్మికులు చనిపోయారన్నారు. వైకాపా నేతల ఆరోపణలపై స్పందిస్తూ.. ప్రజలకు మాత్రమే తాను దత్తపుత్రుడినని, చంద్రబాబుకుకాదని స్పష్టం చేశారు.

* ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తప్పుబట్టారు. కేసీఆర్‌ మాటలు చూస్తుంటే రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టినట్లుందని ఆరోపించారు. కార్మికుల డిమాండ్లు న్యాయబద్ధమైనవి కాబట్టే ప్రతిపక్షాలు మద్దతిస్తున్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్లే ఆర్టీసీ నష్టాల్లోకి వెళ్లిందని.. దివాళా తీయించి ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నారని భట్టి ధ్వజమెత్తారు. గతంలో కేసీఆర్‌ ఇచ్చిన హామీలనే అమలు చేయాలని కార్మికులు అడుగుతున్నారని గుర్తు చేశారు.

* మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఎన్నికల్లో కూటమిగా అధిక స్థానాలు గెలిచినప్పటికీ భాజపా-శివసేన కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావడం లేదు. ఎన్నికల ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం సీఎం పదవీకాలాన్ని 50-50 పంచుకోవాలని శివసేన కోరుతుండగా.. అలాంటి ఒప్పందమేమీ లేదని భాజపా చెబుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితిపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ తనదైన శైలిలో వ్యంగ్య బాణాలు సంధించారు. ‘‘ఏమిటీ 50-50? మార్కెట్‌లోకి ‌ఏమైనా కొత్త బిస్కెట్‌ వచ్చిందా?’’ అంటూ వ్యాఖ్యానించారు.

* మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు 7వ తేదీలోపు ఏ పార్టీ ముందుకు రాకుంటే రాజకీయ పార్టీలతో గవర్నర్‌ నేరుగా చర్చలు జరపనున్నారని రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఆర్‌పీఐ) అధినేత, కేంద్ర మంత్రి రామ్‌దాస్‌ అథవాలే తెలిపారు. ఈ నెల 9తో 13వ అసెంబ్లీ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో నవంబర్‌ 7 వరకు గవర్నర్‌ వేచి చూస్తారని, ఒకవేళ ఎవరూ ముందుకు రాని పక్షంలో గవర్నరే స్వయంగా ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన పార్టీలతో చర్చలు జరుపు తారని అథవాలే తెలిపారు.

* మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత భాజపా, శివసేన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనే అనుకున్నారంతా. ముఖ్యమంత్రి పదవి విషయంలో భాజపా, శివసేనకు మధ్య సయోధ్య కుదరకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటు జరగలేదు. శివసేన నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్‌ రౌత్‌ ఈ విషయంలో రోజుకో ప్రకటన చేస్తుండడంతో మహారాష్ట్ర రాజకీయాలు పూటకో మలుపు తిరుగుతున్నాయి.

* ప్రభుత్వ ఏర్పాటుపై మిత్ర పక్షం భాజపాతో చర్చలు జరిగితే అది సీఎం పదవిపైనే జరుగుతాయని శివసేన అదివారం స్పష్టం చేసింది. అయితే, ఇప్పటివరకూ ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలేవీ జరగలేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్‌ రౌత్‌ అన్నారు. చెరి సగం కాలం సీఎం పదవిని పంచుకోవాలనే శివసేన డిమాండ్‌కు భాజపా అంగీకరించని సంగతి తెలిసిందే. సీఎంగా తానే ఐదేళ్లపాటూ కొనసాగుతానని కొద్ది రోజుల క్రితమే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ తేల్చి చెప్పారు.

* ఇజ్రాయెల్‌కు చెందిన పెగాసస్‌ స్పైవేర్‌ భారత్‌లోని కొందరి ఫోన్లలో వాట్సప్‌లోకి చొరబడిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ స్పైవేర్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఫోన్‌లోకి కూడా చొరబడిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా ఆరోపించారు. ఇప్పటివరకూ ఈ స్పైవేర్‌ ముగ్గురు ప్రతిపక్ష నాయకుల ఫోన్‌లలో చొరబడిందని అన్నారు. ప్రియాంక సహా, బంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎన్సీపీ నాయకుడు ప్రఫుల్‌ పటేల్‌ల ఫోన్లను ఈ స్పైవేర్‌ పేరుతో ప్రభుత్వమే హ్యాకింగ్‌ చేయించిందని సుర్జేవాలా ఆరోపించారు.

* జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు పీఏ గల్లంతయ్యారు. అంతర్గాం శివారులోని ఎస్సారెస్పీ కాల్వలో ఈతకు దిగిన ఎమ్మెల్యే పీఏ గిరీశ్‌ కనిపించకుండా పోయారు. ముగ్గురు స్నేహితులతో ఈతకు వెళ్లిన ఆయన ఈత రాకపోవడంతో కాల్వలో గల్లంతయ్యారు. గిరీశ్‌ ఆచూకీ కోసం అంతర్గాంతో పాటు థరూర్‌ ప్రాంతాల్లో గాలింపు కొనసాగుతోంది.

* టీఎస్‌ ఆర్టీసీ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ తొందరపాటు చర్యలు తీసుకొన్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం కార్మికులపై కక్షపూరిత వైఖరితో వ్యవహరించకూడదని.. సానుభూతితో వ్యవహరించాలని హితవు పలికారు. ప్రజలకు సేవచేసే ఆర్టీసీని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని అన్నారు. పేద డ్రైవర్లు, కండక్టర్ల జీవితాల గురించి ఆలోచించాలని ఆయన కోరారు.

* పక్క రాష్ట్రాల్లో లేని ఇసుక కొరత ఇక్కడెందుకుందని ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉప విమర్శించారు. ఇసుక సమస్య పరిష్కరించకుండా ఎన్నాళ్లు సాగదీస్తారని ఆయన ప్రశ్నించారు. విజయవాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైకాపా చేస్తున్న వ్యాఖ్యలు, ట్వీట్లు మాత్రం అద్భుతంగా ఉన్నాయని, కానీ, ఇసుక కొరత కారణంగా ఆత్మహత్య చేసుకున్న నాగరాజు కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేకపోతున్నారని ఆరోపించారు.

* విధుల్లో చేరే తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు పూర్తి భద్రత కల్పిస్తామని గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని పోలీస్‌ కమిషనర్లు భరోసా ఇచ్చారు. ప్రభుత్వ లేదా ప్రైవేట్‌ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడం చట్టరీత్యా నేరమని రాచకొండ సీపీ మహేశ్‌భవగవత్‌ అన్నారు. విధులకు ఆటంకం కలిగిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం పిలుపు మేరకు విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నవారికి పోలీసు భద్రత కల్పిస్తామని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ వెల్లడించారు.

* దేశ రాజధానిలో వాతావరణ కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. నగరం మొత్తం దట్టంగా అలుముకున్న పొగమంచులో హానికర వాయువులు పెద్ద మొత్తంలో చేరినట్లు కాలుష్య నియంత్రణ బోర్డు ప్రకటించింది. దీని దృష్ట్యా ఆదివారం దిల్లీకి రావాల్సిన దాదాపు 32 విమానాలను దారి మళ్లించారు. ఈ మేరకు ఇందిరాగాంధీ విమానాశ్రయ అధికారులు ట్వీట్‌ చేశారు. దారి మళ్లించిన విమానాల వివరాలను సంబంధిత సంస్థను సంప్రదించి తెలుసుకోవచ్చని సూచించారు. అంతేకాక స్కూళ్లకు సెలవులను మంగళవారం వరకూ పొడిగించారు.