DailyDose

నేటి పది ప్రధాన వార్తలు-11/04

Today's Top 10 Breaking News-Telugu News Of The Day-11/04

1. తహసీల్దార్‌ సజీవ దహనం
హైదరాబాద్‌ నగర శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఘోరం చోటుచేసుకుంది. అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ దారుణ హత్యకు గురయ్యారు. కార్యాలయంలోనే తహసీల్దార్‌ విజయారెడ్డిపై ఓ దుండగుడు పెట్రోల్‌ పోసి నిప్పటించాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన ఆమె అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఓ దుండగుడు తహసీల్దార్‌ ఛాంబర్‌లోకి ప్రవేశించి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
2. ఏపీ సీఎస్‌ ఆకస్మిక బదిలీ
ఏపీ సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యంను రాష్ట్ర ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసింది. గుంటూరు జిల్లా బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డీజీగా ఆయన్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ పేరుతో ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. తన బాధ్యతలను తక్షణమే సీసీఎల్‌కే అప్పగించాలని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది. మరో ఐదునెలల సర్వీసు ఉండగానే ఎల్వీ సుబ్రహ్మణ్యంను బదిలీ చేసింది.
3. ఏటా ఈ పంట వ్యర్థాల దహనమేంటి?: సుప్రీం
దిల్లీలో గాలి కాలుష్యంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. దేశ రాజధాని ప్రాంతం పరిధిలో ఉన్న రాష్ట్రాలదే బాధ్యత అని స్పష్టంచేసింది. పంజాబ్‌, హరియాణాల్లో పంట వ్యర్థాల దహనం చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ దీనిపై బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రశ్నించింది. ఏటా పంట వ్యర్థాల దహనం ఎందుకు జరుగుతోందని ప్రశ్నించింది. దిల్లీలో గాలి కాలుష్యంపై దాఖలైన పిటిషన్లపై జస్టిస్‌ అరుణ్‌మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.
4. ఇసుక కొరత తాత్కాలికమే: సీఎం జగన్‌
రాష్ట్రంలో ఇసుక కొరత తాత్కాలిక సమస్య అని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అన్నారు. 90 రోజులుగా ఊహించని రీతిలో నదుల్లో వరద వస్తోందని ఆయన చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 265కి పైగా రీచ్‌ల్లో కేవలం 61 మాత్రమే పని చేస్తున్నాయని, మిగతావన్నీ వరదనీటిలోనే ఉన్నాయని ఆయన తెలిపారు. రహదారులు, భవనాల శాఖలపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వరద నీటి వల్ల ఇసుక తీయడం కష్టంగా మారిందని, లారీలు, ట్రాక్టర్లు రీచ్‌ల వద్దకు వెళ్లలేని పరిస్థితి నెలకొందని సీఎం చెప్పారు.
5. అన్యాయం జరుగుతోందంటే కేసులా?:చంద్రబాబు
అన్యాయం జరుగుతోందని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడితే కేసులు పెట్టి పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. వైకాపా నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు.విజయవాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. తెదేపా నేతలు, కార్యకర్తలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వేధిస్తున్నారని దుయ్యబట్టారు.
6. ‘మేకిన్‌ ఇండియా’.. ‘బై ఫ్రమ్‌ చైనా’ అవుతుంది
ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య (ఆర్‌సెప్‌) ఒప్పందంపై సంతకం చేస్తే ‘భారత్‌లో తయారీ’ కాస్తా ‘చైనా నుంచి కొనుగోలు (బై ఫ్రమ్‌ చైనా)గా మారుతుందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే దేశం మొత్తం చైనా నుంచి వచ్చే చౌక వస్తువులతో నిండిపోయి ఉద్యోగాలు పోయే పరిస్థితి నెలకొంటుందని ఆందోళన వ్యక్తంచేశారు. మూడు రోజుల పాటు బ్యాంకాక్‌లో జరిగే ఆసియాన్‌ దేశాల శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొన్న సంగతి తెలిసిందే.
7. ఎవరో చెప్పే మాటలపై స్పందించను: ఫడణవీస్‌
అధికారం చెరి సంగం పంచుకోవడంపై మిత్రపక్షమైన శివసేన పట్టువీడకపోవడంతో నెలకొన్న తీవ్ర ప్రతిష్టంభన మధ్య రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌.. భాజపా జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో దిల్లీలో సోమవారం భేటీ అయ్యారు. రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలు, శివసేన డిమాండ్లపై అమిత్‌ షాతో కీలకంగా చర్చించినట్టు తెలుస్తోంది. అనంతరం ఫడణవీస్‌ దిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. కొత్త ప్రభుత్వంపై ఎవరెవరో చెబుతున్న మాటలపై తాను స్పందించబోనన్నారు. త్వరలోనే నూతన ప్రభుత్వం కొలువుదీరుతుందని ధీమా వ్యక్తంచేశారు.
8. కొత్త ఫార్మాట్లో ఐసీసీ టీ20 ప్రపంచకప్‌
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ పూర్తి షెడ్యూలు విడుదలైంది. అర్హత పోటీలన్నీ ముగియడంతో ఏయే జట్లు మెగా టోర్నీలో తలపడుతున్నాయో స్పష్టత వచ్చేసింది. ఆస్ట్రేలియాలో 2020 అక్టోబర్‌ 18 నుంచి నవంబర్‌ 15 వరకు ప్రపంచకప్‌ జరగనుంది. మొత్తం 16 దేశాలు పాల్గొంటున్నాయి. టోర్నీలో పసికూనలు ఎక్కువగా ఉండటంతో షెడ్యూలను ఐసీసీ వినూత్నంగా రూపొందించింది. ఆటపై ఆసక్తి తగ్గకుండా కృషి చేసింది. ఈ చిన్నజట్లను ఏ, బీ అనే రెండు గ్రూపులుగా విడదీసింది.
9. కఠిన పరిస్థితుల్లో ఆడినందుకు థాంక్యూ: దాదా
టీమిండియా, బంగ్లాదేశ్‌ జట్లకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ ధన్యవాదాలు తెలిపారు. దిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా ఉన్నా బీసీసీఐ మ్యాచ్‌ను నిర్వహిస్తామని ఇదివరకే చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే బంగ్లాదేశ్ విజయం సాధించడంతో దాదా ఆ జట్టును అభినందించారు.
10. బ్యాంకింగ్‌ షేర్లు మిల మిల.. ఆటో షేర్లు విల విల..
లోహ, బ్యాంకింగ్‌ షేర్ల హవా కొనసాగిన వేళ దేశీయ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 136 పాయింట్లు లాభపడి, 40,301 వద్ద ముగియగా, నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 54 పాయింట్లు ముందుకు కదిలి 11,945వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 70.73గా ఉంది.