Health

వేడినీళ్లతో గ్యాస్ సమస్యకు చెక్

Warm water helps with gastric troubles

1.వేడినీళ్లతో.. గ్యాస్ సమస్యకు చెక్
పరిమితికి మించి ఎక్కువగా తిన్నా, తక్కువగా తిన్నా కడుపులో ఇబ్బంది మొదలవుతుంది. కొందరికి ఆజీర్ణం అయితే మరికొందరు గ్యాస్ సమస్యతో సత మతమవుతుంటారు. అలాంటివారికి ఇంటి చిట్కాలేంటో తెలుసుకుందాం..!
కొత్తిమీర అజీర్ణానికి చక్కగా పనిచేస్తుంది. కడుపులో మంటగా ఉన్నప్పుడు కొత్తిమీర తీసుకుంటే తగ్గిపోతుంది. గ్లాస్ మజ్జిగలో కొత్తిమీర వేసుకుని, తాగితే గ్యాస్ సమస్య నుంచీ బయటపడవచ్చు. గ్యాస్ట్రిక్ సమస్యతో కడుపు మంట మొదలవుతుంది. కాబట్టి నల్ల మిరియాలు అజీర్ణానికి మంచిది. వీటిని పాలతో కలిపి తాగితే మంచిది. కడుపులో నొప్పి, అజీర్ణంగా ఉంటే గ్లాస్ వేడినీటిలో ఇంగువ వేసుకుని, బాగా కలిపి తాగాలి. ఇలా తాగితే కడుపునొప్పి, అజీర్ణం సమస్య తగ్గుతుంది. సోంపు గింజల్ని గ్రైండ్ చేసుకుని, నీటితో కలిపి తాగితే గ్యాస్ సమస్య తగ్గుతుంది. రోజూ కాస్త సోంపు గింజల్ని తినటం ఎంతో మంచిది. వాము గింజలు, ఉప్పు కలిపిన మిశ్రమాన్ని మంచినీటిలో కలుపుకొని, తాగాలి. మసాలా వంటలు తిన్నప్పుడు ఈ ద్రావకాన్ని తాగితే గ్యాస్ సమస్య ఉండదు.వేడినీటిలో మూడు టేబుల్ స్పూన్లు యాపిల్ సైడర్ వెనిగర్ వేసుకుని, తాగటం వల్ల గ్యాస్ సమస్య తీరుతుంది.
2.కరివేపాకుతో మేలెంతో..
కూరలో కరివేపాకు చూస్తే చాలు కొందరు వెంటనే ఏరిపారేస్తుంటారు. కానీ కరివేపాకు అంత తీసివేయదగినది ఎంత మాత్రమూ కాదు. దానితో కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. కరివేపాకుతో సమకూరే ఆరోగ్య ప్రయోజనాల్లో ఇవి కొన్ని మాత్రమే.. కరివేపాకులో క్యాన్సర్ను తరిమేసే గుణం ఉంది. కాబట్టే ఉత్తరాది వారితో పోలిస్తే.. కూరలతో పాటు చాలా వంటకాల్ని తాలింపు పెట్టుకునే అలవాటు ఉన్నందున దక్షిణాది ప్రాంతాలవారికి జీర్ణసంబంధిత క్యాన్సర్ల వంటి కొన్ని రకాల విస్తృతి చాలా తక్కువ. కరివేపాకుతో ల్యూకేమియా, ప్రోస్టేట్ క్యాన్సర్లు సైతం దూరమవుతాయి. కరివేపాకులో క్యాన్సర్లతో పోరాడే, నివారించే గుణం ఉందని నిపుణులు ఆధారాలతో సహా నిరూపించారు. కరివేపాకులో డయాబెటిస్తో పోరాడే గుణం కూడా ఉంది. ఈ విషయాన్ని చెన్నైలోని యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్కు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ బయోకెమిస్ట్రీ అండ్ మాలిక్యులార్ బయాలజీ విభాగం సైతం తమ అధ్యయనాల్లో నిరూపించింది. మన రక్తంలోని చెడుకొలెస్ట్రాల్ పాళ్లను కరివేపాకు గణనీయంగా తగ్గిస్తుందని ‘యూనివర్సిటీ ఆఫ్ కేరళ’లోని డిపార్ట్మెంట్ ఆఫ్ బయో కెమిస్ట్రీ పరిశోధకులు తేల్చి చెప్పారు. కరివేపాకులో విటమిన్-ఎ పాళ్లు పుష్కలంగా ఉన్నాయి. అందుకే మన ఆహారాల్లో కరివేపాకు వాడేవారి చూపు చాలాకాలం పాటు బాగుంటుంది. కరివేపాకు కాలేయం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఎన్నో రకాల ఇన్ఫెక్షన్ల నుంచి, సిర్రోసిస్ బారి నుంచి కాలేయాన్ని రక్షిస్తుంది. హెపటైటిస్ వంటి సమస్యల నుంచీ రక్షిస్తుంది. చర్మ సౌందర్యాన్ని ఇనుమడింప చేయడంలో కరివేపాకు భూమిక చాలా ఉందని తేలింది. జుట్టు బాగా పెరిగేందుకూ కరివేపాకు దోహదపడుతుంది. ఒత్తిడిని అధిగమించడంలోనూ కరివేపాకు బాగా ఉపయోగపడుతుందని తేలింది.
3. పోషకాహారంతో ఆరోగ్యం సొంతం
ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉన్నారు. కొందరు కొద్ది నలతగా ఉన్నప్పటికీ పట్టించుకోరు. పరిస్థితి అదుపు తప్పిన తర్వాత వైద్యుల దగ్గరికి వెళ్తుంటారు. ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. కాకపోతే కాస్త శ్రద్ధ తీసుకోవాలి. శరీరానికి అవసరమైనంత పౌష్టికాహారం తీసుకుంటే.. నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండవచ్చని చెబుతున్నారు డాక్టర్లు. పండ్లు, కూరగాయలు, పాలు, మాంసకృత్తుల వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచి స్తున్నారు. ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేక చాలామంది వ్యాధులబారిన పడుతున్నారు. ఆహారంలో ఎక్కువగా కొవ్వు పదార్థాలు తీసుకోవడం, సమయాలు పాటించకపోవడం, కల్తీ పదార్థాలను తీసుకోవడం వల్ల అనారోగ్యాల పాలవుతున్నారు. మంచి ఆహారం, సరిపోయి నంత నిద్ర, వ్యాయామం ఇవన్నీ పాటిస్తూ, మనసు ప్రశాంతంగా పెట్టుకుంటే మంచి ఆరోగ్యం సొంతమవుతుందని సూచిస్తున్నారు నిపుణులు. అసలు ఎలాంటి ఆహారం ఎలా తీసుకోవాలనే విషయాలను వివరిస్తున్నారు వైద్యులు.ఆహారం ఒకేసారి కాకుండా ప్రతి మూడు గంటలకు ఒక సారి కొంచెం.. కొంచెంగా తీసుకోవడం ఉత్తమం.
* ఆహారంగా తీసుకునే పదార్థాలను ఎక్కువ సేపు ఉడకపెట్టకూడదు. రోజూ ఆహారంలో తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఉండేలా చూసుకోవాలి. కూరగాయలు, పండ్లలో ఉండే సూక్ష్మ పోషక పదార్థాలు, ఫైబర్ శరీరానికి మేలు చేస్తాయి. పసుపు, నారింజ రంగులో ఉండే పళ్లు కొన్ని రకాల దీర్ఘకాల జబ్బులనూ నిరోధిస్తాయి. తాజాగా ఉండే పచ్చి కూరగాయలు, పళ్లను సలాడ్ల రూపంలో తీసుకోవచ్చు.
* ఆహారంలో ‘ఎ’ విటమిన్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ‘ఎ’ విటమిన్ అంధత్వాన్ని నివారించడంతో పాటు పిల్లల్లో వాంతులు, విరేచనాలు, తట్టు, శ్వాసకోశ సంబంధ వ్యాధులు తదితరమైన వాటిని నివారిస్తాయి.
* కెరోటిన్ ఉన్న మునగాకులు, తోటకూర, మెంతికూర, పాలకూర, క్యారట్, మంచి గుమ్మడి, మామిడి, బొప్పాయిలను తీసుకున్నట్లయితే అవి శరీరంలో ‘ఎ’ విటమిన్‌గా మారతాయి.
* ‘డి’ విటమిన్ కూడా అవసరం మేరకు ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి.
వీటిని తక్కువగా తీసుకుంటే మంచిది:
* వంటనూనెలు, నెయ్యి, వెన్న, వనస్పతి వంటివి చాలా తక్కువగా వినియోగించాలి. ఎక్కువగా తీసుకుంటే కొవ్వు పెరిగి స్థూలకాయం తద్వారా గుండెజబ్బులు, కేన్సర్ లాంటివి వచ్చే ప్రమాదం ఉంది. మాంసాహారులు మేక మాంసం, కోడి మాంసం బదులు చేపలు తీసుకోవడం మేలు. మాంసాహారంలోనూ లివర్, కిడ్నీ, బ్రెయిన్ వంటి పదార్థాలను మానుకోవడం మంచిది.
* ఫ్రై చేసిన ఆహార పదార్థాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి.
* రెండు మూడు రోజులు ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన ఆహారం తీసుకోవద్దు.
* విపరీతమైన ఉపవాసాలు లాంటివి చేయడం మంచిది కాదు.
* చక్కెర, కొవ్వు పదార్థాలున్న ఆహారాన్ని, మద్యాన్ని తగ్గించాలి.
* ఎక్కువ కొవ్వు ఉన్న పాలను తీసుకోవద్దు.
* ఊరగాయలు, ఉప్పు, బిస్కెట్లు, చిప్స్, వెన్న, పిజ్జా, శీతలపానీయాలు, ప్రాసెస్ చేసిన పదార్థాలను వీలైనంత తక్కువగా తీసుకోవాలి.
* పొగ తాగడం, పొగాకు నమలడం, గుట్కా, మద్యం వంటి వాటికి దూరంగా ఉండాలి.
* ముప్పై ఏళ్లు పైబడిన వారు రక్తంలో గ్లూకోజ్, లైపిడ్ల స్థాయి పరీక్షలతోపాటు బీపీ పరీక్షల్లాంటివి చేయించుకోవాలి.
* 30 ఏళ్లు దాటిన మహిళలు కేన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి.
* పిల్లలు, గర్భిణులకు రోగ నిరోధక మందులు, టీకాలు వంటివి ఇప్పించాలి.
* వినియోగానికి ముందు కూరగాయలు, పండ్లు శుభ్రంగా కడగాలి.
* వండిన పదార్థాన్ని సరైన విధంగా నిల్వ ఉంచి సూక్ష్మక్రిములు, ఎలుకలు, కీటకాల బారి నుంచి కాపాడాలి.
సురక్షిత పానీయాలు తీసుకోవాలి..
* పరిశుభ్రమైన నీటినే తాగాలి. మంచినీరు తాగితే 50 శాతం రుగ్మతలకు దూరంగా ఉండవచ్చు.
* నీరు కలుషితమైనదనే అనుమానం ఉంటే కాచి వడ పోసి తాగాలి.
* నీటితోపాటు పాలు కూడా ఆరోగ్యానికి ఎంతో అవసరం. రోజుకు 250 మి.లీ. కాచి, చల్లార్చిన లేదా పాశ్చరైజ్డ్ పాలను వాడితే మంచిది.
* కాఫీ కంటే టీ తీసుకుంటే మంచిది. అది కూడా ఒకటి రెండుసార్ల కంటే ఎక్కువ వద్దు.
**సరైన నిద్ర అవసరం
రోజుకు ఏడు గంటలపాటు నిద్రపోవడానికి ప్రయత్నం చేయాలి. నిద్ర వేళలతో పాటు, భోజన వేళలు కూడా మార్పు చెందుతున్నాయి ఇవి శరీరాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. దీనిని నివారించడానికి సమయం ప్రకారం నిద్ర పోవాలి. రాత్రి పూట నిద్ర వల్ల శరీరం పనితీరు మెరుగ్గా ఉంటుంది. రోగ నిరోధక విధానం అభివృద్ధి చెందుతుంది. గాఢనిద్ర వల్ల మెదడుకు విశ్రాంతి, ప్రశాంతత దొరుకుతుంది. రోజూ పెద్ద వాళ్లు కనీసం 7 నుంచి 9 గంటల పాటు నిద్ర పోవడం మంచిది. మరుసటి రోజుకు చురుకుగా పనిచేయడానికి నిద్ర చాలా ఉపయో గపడుతుంది. శరీరానికి వ్యాయామం తప్పకుండా అవసరం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
**ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి
ఆరోగ్యం విషయంలో అవగాహన ఇంకా పెరగాలి. చాలా మంది జబ్బు వచ్చిన తర్వాతే చుద్దామనే ధోరణితో ఉంటున్నారు. ఇలా కాకుండా 25 ఏళ్లు దాటగానే ప్రతి ఒక్కరూ ఆరు నెలలకు ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. ప్రతి రోజూ తప్పని సరిగ్గా 30 నుంచి 45 నిమిషాలు నడవాల్సిందే… అస్తమానం కుర్చీకే అతుక్కు పోకుండా… ప్రతి అరగంటకు ఒకసారి అలా నడవాలి. భోజనాలు, టిఫిన్లను సమయానికి పూర్తి చేయాలి. రాత్రిపూట ఎక్కువసేపు మెలకువగా ఉండకూడదు. అరటి, బత్తాయి, కమలాలు, ద్రాక్ష వంటి పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. ఎర్రటి మాంసం, మీగడ, వెన్న, నూనె వంటి వాటికి దూరంగా ఉండాలి. బయటి ఆహార పదార్థాల జోలికి అసలే వెళ్లొద్దు. టెన్షన్ సమయంలో ఆత్మీయులతో మాట్లాడాలి. మంచి సినిమా చూడాలి. సంగీతం వినాలి.ఇలా మంచి జీవనశైలిని అలవాటు చేసుకుంటే చక్కని ఆరోగ్యం సొంతమవుతుంది.