DailyDose

యూపీలో జైళ్ళుగా మారిన కళాశాలలు-తాజావార్తలు-11/08

యూపీలో జైళ్ళుగా మారిన కళాశాలలు-తాజావార్తలు-11/08-UP Colleges Converted Into Jails-Telugu Breaking News-11/08

*అయోధ్య స్థల వివాదంపై త్వరలో తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ ఉత్తరప్రదేశ్‌ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు.
*ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని ఆపడం మాతృభాష ఉనికికే ప్రమాదమని తెదేపా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాద్‌ ఆక్షేపించారు. ఈ విషయంలో ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.
*తెలంగాణ ఆర్టీసీలో 5,100 రూట్ల ప్రైవేటీకరణకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తదుపరి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది.
*కర్ణాటకలో అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు రాష్ట్రంలో జరగనున్న ఉప ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తమ అనర్హతపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించే వరకూ ఎన్నికలు వాయిదా వేయాలని వారు కోరారు. అయితే దీనికి సంబంధించి సరైన పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాలని సుప్రీంకోర్టు వారికి సూచించింది. కర్ణాటకలో డిసెంబర్‌ 5వ తేదీన ఉప ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ నిర్ణయించింది.
*బంగాళాఖాతంలో ఏర్పడిన ‘బుల్‌బుల్‌’ తుఫాను కొనసాగుతోంది. వచ్చే 24 గంటల్లో ఇది తీవ్ర తుఫానుగా మారవచ్చని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీంతో శుక్రవారం రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురవవచ్చని చెప్పారు.
*నాగాయలంక మండలం వక్కపట్లవారిపాలెం గ్యాస్‌ నిక్షేపాలు వెలికితీసే ప్రాంతంలో… ఫిల్లింగ్‌స్టేషన్‌ను కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించనున్నారు. ఆ తర్వాత వోఎన్జీసీ ప్లాంట్‌ వద్ద గ్యాస్‌ గేదరింగ్‌ స్టేషన్‌ను ప్రారంభిస్తారు.
నాగాయలంక మండలంలో ఆయన పర్యటించే ప్రాంతాలను మచిలీపట్నం ఆర్డీవో ఖాజావలి పరిశీలించారు.
*మానవహారాలు, భిక్షాటనలు, అర్ధనగ్న ప్రదర్శనలతో ఆర్టీసీ కార్మికులు హోరెత్తిస్తున్నారు. నిరసనలు, ఆందోళనలతో సమ్మెబాటలోనే కొనసాగుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మొండి వైఖరి విడనాడి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. నేటితో ఆర్టీసీ సమ్మె 35వరోజుకు చేరుకుంది.
*పార్లమెంటు సభ్యునిగా తనకున్న హక్కులకు భంగం కలిగించేలా ప్రవర్తించి పోలీసులు ఉల్లంఘనకు పాల్పడ్డారని.. వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ లోక్సభ సభాపతి ఓం బిర్లాకు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కుమార్ ఫిర్యాదు చేశారు.
*రామజన్మభూమి- బాబ్రీ మసీదు భూవివాదం అంశంపై సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది.
*జర్మనీకి చెందిన ప్రముఖ విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ సరికొత్త ఎంపీవీని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ‘విక్లాస్ ఇలైట్’గా పిలిచే ఈ కారు ఎక్స్షోరూం ధర రూ. 1.10 కోట్లుగా సంస్థ నిర్ణయించింది.
*మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఇచ్చిన షోకాజ్ నోటీసుకు జీఏడీ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాశ్ వివరణ ఇచ్చారు. ఈ మేరకు వివరణ లేఖను ప్రస్తుత ఇన్ఛార్జ్ సీఎస్ నీరబ్కుమార్కు పంపించారు.
*ఆంగ్లం సార్వత్రిక భాష అని, ఆ భాషా నైపుణ్యాలను విద్యార్థుల్లో పెంచడం చారిత్రక అవసరమని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. రాష్ట్ర విద్యార్థులు ప్రపంచ స్థాయి ప్రమాణాలను సాధించాలంటే ఆంగ్ల భాష నైపుణ్యం తప్పనిసరని వివరించారు.
*టీఎస్ఆర్టీసీ ఆవిర్భావానికి తమ అనుమతి లేదని, దాని ఉనికికి గుర్తిపులేదని కేంద్రం స్పష్టం చేసింది. తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై అక్కడి హైకోర్టులో గురువారం జరిగిన విచారణ సందర్భంగా కేంద్రం తరఫున వాదనలు వినిపించిన అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజేశ్వరరావు ఈ విషయం తెలిపారు.
*సామాన్య ప్రజల కోరిక మేరకే ముఖ్యమంత్రి జగన్ ఆంగ్ల మాధ్యమంపై నిర్ణయం తీసుకున్నారని అధికార భాషా సంఘం అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పేర్కొన్నారు. దిల్లీలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్ ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేసే సమయంలోనే ఆయా వర్గాల వారు ఆంగ్ల మాధ్యమం కావాలని కోరారని చెప్పారు. ప్రాథమిక విద్య మాతృభాషలో చేస్తేనే బాలల వికాసం సాధ్యమనే భావన నుంచి తాను వైదొలగలేదని, అయితే ప్రజాభీష్టం ప్రకారం ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించలేమని అన్నారు.
*గ్రామ న్యాయాలయాల ఏర్పాటుపై వారంలోగా నిర్ణయం చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ విషయంలో విఫలమైతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలనాశాఖ ముఖ్యకార్యదర్శి కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టంచేసింది.
*సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ) అదనపు కార్యదర్శి కె.గురుమూర్తిని రాష్ట్ర ప్రభుత్వం గురువారం బదిలీ చేసింది. బీసీ సంక్షేమశాఖ అదనపు కార్యదర్శిగా నియమించింది. ఈ మేరకు జీఏడీ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రవీణ్ ప్రకాశ్ తనను దూషిస్తున్నారని, అతని ఆధ్వర్యంలో పనిచేయటం చాలా కష్టమని గత నెల 30న గురుమూర్తి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. తనను వేరే శాఖకు బదిలీ చేయాలని ఆ లేఖలో కోరారు.
*పురపాలక, నగరపాలక సంస్థల్లో కొత్తగా నియమితులైన వార్డు సచివాలయ ఉద్యోగులకు మిగతా ప్రభుత్వ ఉద్యోగులకు అందిస్తున్న తరహాలో 010 ఖాతా నుంచే ఖజానా శాఖ వేతనాలు చెల్లించనున్నది. సచివాలయ ఉద్యోగుల నియామకం నేపథ్యంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ గురువారం విడుదల చేసిన సర్వీసు నిబంధనల్లో ఈ విషయాన్ని పేర్కొంది. కొత్తగా నియమితులైన ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే అన్ని నిబంధనలు వీరికి సైతం అమలులో ఉంటాయని పురపాలక శాఖ వివరించింది.
*రాష్ట్రంలోని కేజీ బేసిన్లో ఉన్న రవ్వ బ్లాక్ నుంచి చమురు, సహజవాయు నిక్షేపాల వెలికితీతకు కెయిర్న్ ఎనర్జీ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో పదేళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకుందని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి ట్వీట్ చేశారు.
*చందా పింఛన్ విధానాన్ని(సీపీఎస్) తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఏపీ సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్(ఏపీసీపీఎస్ఈఏ) శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన దీక్ష చేపట్టనుంది. రాష్ట్రంలో అధికారం చేపట్టిన నెల రోజుల్లోనే దాన్ని రద్దు చేస్తామని గతంలో జగన్ హామీ ఇచ్చారని.. 5 నెలలు గడుస్తున్నా సమస్య పరిష్కారం గాకపోవడంతో అన్ని జిల్లాల్లోని కలెక్టరేట్ల వద్ద సంకల్ప దీక్ష పేరుతో నిరసన తెలుపనున్నట్లు సంఘం అధ్యక్షుడు రామాంజనేయులు యాదవ్ గురువారం వెల్లడించారు.
*ఆంధ్రప్రదేశ్ పొరుగుసేవల కార్పొరేషన్ (ఏపీసీవోఎస్) సీఈవోగా ఎం.మహేశ్వరరెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆయన సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఎంటర్ప్రైజస్ డెవలప్మెంట్ సంస్థ (సీడ్ఏపీ) సీఈవోగా ఉన్నారు. ఏపీసీవోఎస్ సీఈవోగా కూడా ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
*రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమం ఎత్తివేతపై కేంద్రానికి ఫిర్యాదు చేయనున్నట్లు భాజపా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు నాగోతు రమేశ్నాయుడు తెలిపారు. ప్రభుత్వం జీవోను ఉపసంహరించుకునే వరకు ప్రజా వ్యతిరేకతను కూడగట్టి ఉద్యమం చేస్తామని ఒక ప్రకటన విడుదల చేశారు.
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పోలీసు, న్యాయ వ్యవస్థ, జైళ్లు, న్యాయ సహాయం విభాగాల్లో మెరుగైన పనితీరు కనబరుస్తున్నట్లు టాటా ట్రస్ట్స్ నివేదిక పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ ఇందులో 13వ స్థానంలో నిలిచిందని తెలిపారు. మహారాష్ట్ర దేశంలోనే మొదటి ర్యాంకు సాధించగా కేరళ, తమిళనాడు తర్వాత స్థానాల్లో నిలిచాయి. తెలంగాణ 11వ స్థానంలో ఉంది.