WorldWonders

అమెరికా అధ్యక్షుడికి ₹14కోట్ల జరిమానా

Trump 2Million Dollars Fined By NY Court

రెండు మిలియన్‌ డాలర్లు స్వచ్ఛంద సంస్థలకు చెల్లించాలని న్యూయార్క్‌ కోర్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ని ఆదేశించింది. నిజానికి ఇది ఆయనకు ఓ రకంగా జరిమానా లాంటిదనే చెప్పాలి! ఆయన ఆధ్వర్యంలో నడుస్తోన్న ‘ట్రంప్‌ ఫౌండేషన్‌’కు వచ్చిన విరాళాలను దుర్వినియోగం చేశారని న్యూయార్క్‌ అటార్నీ జనరల్‌ జేమ్స్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో తన రాజకీయ ప్రయోజనాల కోసం ఈ నిధుల్ని వాడుకున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్‌ సాలియన్‌ స్కార్పుల్లా.. మొత్తం ఎనిమిది స్వచ్ఛంద సంస్థలకు ట్రంప్‌, ఆయన కుటుంబ సభ్యులు రెండు మిలియన్‌ డాలర్లు చెల్లించాలని తీర్పు వెలువరించారు. దీనిపై స్పందించిన ట్రంప్‌.. అటార్నీ జనరల్‌ కావాలనే తీర్పును తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ట్రంప్ ఫౌండేషన్‌ చేసిన కొన్ని చిన్న సాంకేతిక ఉల్లంఘనల నేపథ్యంలో కోర్టుతో ఓ ఒప్పందం కుదిరిందని చెప్పారు. ఈ ఒప్పందాన్ని అటార్నీ జనరల్‌ కావాలనే రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. అయితే కోర్టు ఆదేశాల ప్రకారం స్వచ్ఛంద సంస్థలకు రెండు మిలియన్‌ డాలర్లు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. దీనిపై ట్రంప్‌ ఫౌండేషన్‌ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. కఠిన శిక్షలు విధించాలన్న పిటిషనర్‌ అభ్యర్థనని కోర్టు తిరస్కరించిందని తెలిపారు.మరోవైపు అటార్నీ జనరల్‌ జేమ్స్‌ స్పందిస్తూ.. ‘‘సేవా కార్యక్రమాల కోసం కేటాయించిన నిధులు పక్కదారి పట్టకుండా మేం చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి’’ అని అన్నారు. ట్రంప్‌ ఫౌండేషన్‌ నిధులు దుర్వినియోగం చేసిందని గత డిసెంబరులోనే అధ్యక్షుడు ట్రంప్‌ అంగీకరించారని చెప్పారు. అలాగే భవిష్యత్తులో మరోసారి సేవా కార్యక్రమాలు చేపడితే ఇలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని హామీ కూడా ఇచ్చారన్నారు. అలాగే స్వచ్ఛంద సంస్థల విధులపై అందులో పనిచేసే అధికారులకు తగిన శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని ట్రంప్‌ వారసులు చెప్పినట్లు ఆయన గుర్తు చేశారు.