ప్రభుత్వం విమానాశ్రయాల విస్తరణ పై దృష్టి సారించింది. ప్రయాణికుల నుంచి డిమాండ్ పెరగటంతో పాటు మౌలిక సదుపాయా అభివృద్ధి ద్వారా పరిశ్రమలను ఆకర్షించాలన్న లక్ష్యంతో ముందడుగు వేస్తోంది. ప్రస్తుతం కొత్తగా రెండు విమానాశ్రయాలు అందుబాటులోకి రానున్నాయి. కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయం సేవలను ఒకటి రెండు నెలల్లో అందుబాటులోకి తేనున్నాయి. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో విమానాశ్రయాన్ని ప్రభుత్వ పరిధిలోకి తీసుకొచ్చి డొమెస్టిక్ విమానాలను నడిపే యోచనలో ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో తిరుపతి, విశాఖ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయాలు రాజమహేంద్రవరం కడపల్లో డొమెస్టిక్ విమానాశ్రయాలు సేవలు అందుబాటులో ఉన్నాయి. విజయనగరం జిల్లా భోగాపురం నెల్లూరు జిల్లాలోని దగదర్తి విమానాశ్రయాల నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తీ చేసేలా గుట్టేదారులపై ఒత్తిడి తెస్తున్నారు.
** ఓర్వకల్లు నుంచి త్వరలో విమానయానం
కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 639 ఎకరాల్లో విమానాశ్రయ నిర్మాణం పూర్తయింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జనవరి 2019న దీన్ని ప్రారంభించారు. అధికారికంగా విమానాశ్రయాన్ని ప్రారంభించినా, ఇంకా విమానాలను నడపటం లేదు. ఉడాన్ పథకం కింద మరో నెల రోజుల్లో ఇక్కడనుంచి అంతర్రాష్ట్ర సర్వీసులు అందుబాటులోకి తెచ్చే ఆలోచన చేస్తున్నారు.
**మరో నెలలో భోగాపురం పనులు
భోగాపురం విమానాశ్రయాన్ని తొలుత అయిదు వేల ఎకరాల్లో చేపట్టాలని భావించారు. ప్రస్తుతం దీన్ని 2,500 ఎకరాలకు పరిమితం చేశారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని 3,800 మీటర్ల పొడవైన రన్‌వేను నిర్మించనున్నారు. జీఎంఆర్ సంస్థ నిర్మాణ పనులను దక్కించుకుంది. రూ.4,200 కోట్లతో నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఒప్పందం ప్రకారం మొదటి దశ పనులను నిర్మాణ సంస్థ డిసెంబరు 2020 నాటికి పూర్తి చేయాల్సి ఉంది. విమానాశ్రయ పనులను మరో నెల రోజుల్లో ప్రారంభించనున్నారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రితో అవసరమైన తుది అనుమతుల కోసం సంప్రదింపులు జరిపారు. భోగాపురం అభివృద్ధిపై ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనికి పరిష్కారం చూపి పనులు ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు.
**ప్రభుత్వ పరిధిలోకి పుట్టపర్తి
పుట్టపర్తి విమానాశ్రయాన్ని తమ పరిధిలోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పుట్టపర్తి ట్రస్టుతో సంప్రదింపులు చేస్తోంది. పెనుకొండ దగ్గర కియా కార్ల పరిశ్రమ, అనుబంధ పరిశ్రమలు వచ్చాయి. ఇదే తీరులో బెంగుళూరుకు సమీపంలో ఉన్న హిందూపురంలో టెక్‌పార్కులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పారిశ్రామికంగా ఇప్పటికే అనంతపురం జిల్లా కీలకంగా మారటంతో విమానాశ్రయం అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం కియా కార్ల పరిశ్రమకు వచ్చే విదేశీ ప్రతినిధులు కర్ణాటకలోని దేవనహళ్లి విమానాశ్రయంపై ఆధారపడుతున్నారు.
**నెల్లూరుపై ప్రత్యేక దృష్టి
నెల్లూరు జిల్లా దగదర్తి సమీపాన విమానాశ్రయాన్ని 1,350 ఎకరాల్లో నిర్మించాలని ప్రతిపాదించారు. దీనికి అవసరమైన భూసేకరణ దాదాపుగా పూర్తయింది. నిర్మాణ పనులను టర్బోమేఘా సంస్థకు అప్పగించారు
. ఈ పనులు మార్చి 2020 నాటికి పూర్తి కావలసి ఉన్నాయి. ఇప్పటి వరకు నిర్మాణాన్ని చేపట్టలేదని పేర్కొంటూ ప్రభుత్వం మేఘా సంస్థకు నోటీసులు జారీ చేసింది. జిల్లాలో శ్రీసిటీ, కృష్ణపట్నం పోర్టు ఉన్నాయి. వారికి విమాన సేవలు అందుబాటులోకి వస్తే మరింతగా పారిశ్రామికవేత్తలను ఆకర్షించటానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రకాశం జిల్లాలో రామాయపట్నం పోర్టును కూడా అభివృద్ధి చేయాలన్న ఆలోచనలో ఉంది.
కర్నూలు జిల్లా ఓర్వకల్లు నుండి నూతన విమానాలు
Related tags :