రానున్న పదేళ్ల కాలంలో మన దేశ జీడీపీ 10 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని, 2030 నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థ గల దేశంగా భారత్ ఎదుగుతుందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అంచనా వేస్తున్నారు. వినియోగం, పెట్టుబడుల్లో వృద్ధితో ఇది సాధ్యమవుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. దిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జైట్లీ అక్కడి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ‘ప్రస్తుతం మన దేశ జీడీపీ 2.9 బిలియన్ డాలర్లుగా ఉంది. 2024 నాటికి ఇది 5 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉంది. 2030 లేదా 2031 నాటికి భారత జీడీపీ 10 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. అప్పుడు మనం అమెరికా, చైనా తర్వాత ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థికశక్తి గల దేశంగా అవతరిస్తాం. మౌలిక సదుపాయాల కల్పన, లింగ సమానత్వం, గ్రామీణ విస్తరణ వంటిని మరింత మెరుగుపరిస్తే అభివృద్దిలో దేశం దూసుకెళ్తుంది’ అని జైట్లీ చెప్పుకొచ్చారు. 2011 జనాభా లెక్కల ప్రకారం.. దేశ జనాభాలో 21.9శాతం మంది దారిద్ర్యరేఖకు దిగువున ఉన్నారు. ప్రస్తుత వృద్ధిరేటును బట్టి చూస్తే ఇది 17శాతానికి తగ్గే అవకాశాలున్నాయి. ఇక 2021 జనాభా లెక్కల నాటికి దారిద్ర్య రేఖకు దిగువన ఉండే వారి సంఖ్య 15శాతానికి పడిపోతుందని జైట్లీ అంచనా వేస్తున్నారు. అదే సమయంలో మధ్యతరగతి జనాభా 44శాతానికి పెరిగే అవకాశాలున్నాయన్నారు. వినియోగం, పెట్టుబడులు పెరిగితే వృద్ధి వేగంగా సాగుతుందని జైట్లీ అన్నారు.
2030 నాటికి మూడో స్థానానికి…
Related tags :