DailyDose

మరో తహసిల్దారుపై పెట్రోల్ దాడి-తాజావార్తలు-11/19

Another MRO Attacked WIth Petrol-Telugu Breaking News Today-Nov 19 2019

*కరీంనగర్ జిల్లా చిగురుమామిడి తహశీల్దార్ కార్యాలయంలో లంబడిపల్లికి చెందిన రైతు పెట్రోల్ బాటిల్‌తో హల్‌చల్ చేశాడు. తన భూసమస్య పరిష్కరించడం లేదంటూ కనకయ్య అనే రైతు తహశీల్దార్ కార్యాలయంలోని కంప్యూటర్లపై పెట్రోల్ చల్లాడు. ఆ క్రమంలో పెట్రోల్ కార్యలయ సిబ్బంది, అధికారులపై కూడా పడింది. దీంతో వారంతా భయాందోళనకు గురయ్యారు. అధికారులు తన సమస్యను పరిష్కరించకపోవడంతోనే కనకయ్య ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. రైతు కనకయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా.. అన్నదమ్ముల మధ్య నెలకొన్న భూవివాదం కారణంగానే భూమి పట్టా చేయలేదని రెవెన్యూ సిబ్బంది చెబుతున్నారు.
*పెట్రోల్ ధరలు వరుసగా ఆరో రోజు కూడా పెరిగాయి. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర 15 పైసలు పెరగ్గా, డీజిల్ ధర 5 పైసలు పెరిగింది. ఈ నెల 11 వ తేదీ తర్వాత డీజిల్ ధర పెరగడం ఇదే మొదటిసారి కాగా గత 10 రోజుల పెట్రోల్ ధరలను పరిశీలిస్తే.. ఇప్పటివరకు రూపాయికి పైగానే ధరలు పెరిగాయి.
* ఎకానమీ నెమ్మదించడం వల్ల మనదేశంలోని ఐటీ సేవల కంపెనీలు ఈ ఏడాది దాదాపు 40 వేల మంది మిడిల్‌‌ లెవెల్‌‌ ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని ఇన్ఫోసిస్‌‌ మాజీ సీఎఫ్‌‌ఓ మోహన్‌‌దాస్‌‌ పాయ్‌‌ అన్నారు. ఐదేళ్లకోసారి ఇలాంటివి జరుగుతాయని చెప్పారు.
*దేశవ్యాప్తంగా కార్మిక చట్టాల పరిధిలోకి వచ్చే వేతన జీవులు, కార్మికులు కనీస పనిగంటలు మారనున్నాయి. ఇప్పటివరకు అమలులో ఉన్న 8 గంటలను 9 గంటలుగా మార్చనుంది.
*అక్రమంగా దేశంలోకి ప్రవేశించారని ఆరోపిస్తూ ఇద్దరు భారత జాతీయులను పాకిస్థాన్ అధికారులు అరెస్టు చేశారు. వీరిలో తెలుగువాడైన ప్రశాంత్ వైందం కూడా ఉన్నారు.
*దేశ సామాజిక, రాజకీయ పరిణామ క్రమంలో రాజ్యసభ కీలక పాత్ర పోషించిందని ఛైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు. రాజ్యసభ 250వ సమావేశాల సందర్భంగా సోమవారం ‘‘భారత రాజకీయ వ్యవస్థలో రాజ్యసభ పాత్ర.. భవిష్యత్తు ప్రస్థానం’’ చర్చలో ఆయన ప్రసంగించారు.
*తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఒకటి నుంచి అయిదో తరగతి వరకు నాణ్యమైన విద్య అందించేందుకు 66 మినీ గురుకులాలు ఏర్పాటు చేయాలని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖ మంత్రి థావర్ చంద్ గహ్లోత్కు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ విజ్ఞప్తి చేశారు.
*రాష్ట్రంలో అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) బాలారిష్టాలతో సతమతమవుతోంది. దరఖాస్తు చేసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పురపాలక శాఖ సూచించగా దాదాపు ఎక్కడా తగిన ఏర్పాట్లు చేయలేదు.
*ఆంగ్లం ఆవశ్యకతను గుర్తిస్తూనే తెలుగును కాపాడుకోవాల్సిన బాధ్యత పాలకులపై ఉందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు హితవు పలికారు. ఆంగ్ల మాధ్యమానికి సమాంతరంగా తెలుగును ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు.
*ఇసుక అక్రమాలపై కఠినంగా వ్యవహరించాలని టాస్క్ఫోర్స్ చీఫ్ సురేంద్రబాబుని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఎవరు తప్పు చేసినా విడిచిపెట్టవద్దని స్పష్టంచేశారు. ఇసుక అక్రమాలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ఫ్రీ నంబరు 14500ని సీఎం సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు.
*ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో వాయు కాలుష్యం పెరిగిపోతోందని, నియంత్రణకు చర్యలు తీసుకోవాలని జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశించింది. భూమి కాలుష్య నియంత్రణకు కూడా చర్యలు చేపట్టాలని పేర్కొంది. ఓ వార్తాపత్రికలో వచ్చిన అంశాన్ని సుమోటోగా స్వీకరించిన జస్టిస్ ఆదర్శకుమార్ గోయెల్ నేతృత్వంలోని ధర్మాసనం.. పారిశ్రామిక ప్రాంతాల్లో గాలి, నీరు, భూమి కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్రాల కాలుష్య నియంత్రణ మండళ్లకు ఆదేశాలు జారీ చేసింది.
*ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై హైదరాబాద్లోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం విచారణ చేపట్టింది. దాదాపు 14 ఏళ్ల కిందటి కేసులో స్టే తొలగిపోవడంతో కేసును విచారణకు స్వీకరించింది.
*మొక్కజొన్న క్వింటాలు ధర రూ.2,100 నుంచి రూ.1500కి పడిపోయే వరకూ ప్రభుత్వం మొద్దు నిద్ర పోయిందని, రైతుల్ని దళారులకు బలి చేసిందని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ధ్వజమెత్తారు.
*విశాఖలోని ఇండియన్ బ్యాంకు అధికారులు ప్రత్యూష రిసోర్సెస్, ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన ఆస్తులను వచ్చే నెల 20న ఈ-వేలం వేయనున్నట్లు సోమవారం ప్రతికా ప్రకటన విడుదల చేయడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఒకప్పుడు ఎండీగా వ్యవహరించిన ఆ సంస్థ ఇండియన్ బ్యాంకు నుంచి రుణం తీసుకుంది.
* దాదాపు మూడు నెలల తర్వాత పాకిస్థాన్ మళ్లీ భారత్‌కు పోస్టల్‌ సేవలను మంగళవారం ప్రారంభించింది. ఈ మేరకు పాకిస్థాన్‌ మీడియా వర్గాలు వివరాలను వెల్లడించాయి. ‘పాక్‌ నుంచి భారత్‌కు పోస్టల్‌ సేవలు మళ్లీ ప్రారంభమయ్యాయి. పార్శిల్ సేవలు ఇంకా పునరుద్ధరించలేదు. కానీ ఈ సేవల పునరుద్ధరణకు సంబంధించి పాకిస్థాన్‌ అధికారికంగా ఎలాంటి ప్రకటనా ఇవ్వలేదు’ అని తెలిపాయి. భారత ప్రభుత్వం జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు చేసిన తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో అప్పటి నుంచి పాక్‌ ఎలాంటి నోటీసు లేకుండా భారత్‌కు పోస్టల్‌ సేవలను నిలిపివేసింది. పాక్‌ చేపట్టిన ఈ చర్యలపై అక్టోబర్‌లో కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ స్పందిస్తూ.. ‘పాకిస్థాన్‌ ఏకపక్ష నిర్ణయం తీసుకుంది. ఇలా నోటీసు ఇవ్వకుండా సేవలు నిలిపివేయడం ప్రపంచ పోస్టల్‌ యూనియన్‌ నియమావళి ఉల్లంఘించడమే. అయినా పాకిస్థాన్‌ ఎప్పటికీ పాకిస్థానే’ అని విమర్శించారు.