Food

భోజనానికి…అరిటాకు ఒక్కటే కాదు

Multiple Leaves Can Be Used To Eat-Not Just Banana Leaf

ఆకుల్లో భోజనంపై పెరుగుతున్న మక్కువ*కార్తిక మాసంలో హరితానికే పెద్దపీట కార్తిక మాసం వచ్చిందంటే ఎటు చూసినా ఆధ్మాతిక సందడి కనువిందు చేస్తుంటుంది.. వనాలన్నీ జనాలతో కిటకిటలాడుతుంటాయి. భక్తిశ్రద్ధలతో వ్రతాలు ఆచరించడం, కుటుంబ సమేతంగా వన భోజనాలు జరుపుకోవడం సంప్రదాయంగా వస్తోంది. ఉసిరి, వేప, మామిడి, రావి, మర్రి చెట్ల నీడన వన మహోత్సవం చేసుకోవడం, అక్కడి పరిశుభ్రమైన గాలిని ఆస్వాదించడం, ఆకుకూరలు, కూరగాయలతో చేసిన శాఖాహారాన్ని ఆకుల్లో భుజించడం, పండ్లు తీసుకోవడం వంటి వాటిలో ఎన్నో ఆరోగ్య సూత్రాలు కూడా ఇమిడి ఉన్నాయి. వన విహారంతో శారీరక, మానసిక ఉల్లాసం, ఆరోగ్యం ఇనుమడిస్తాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఆహారం తినేందుకు వినియోగించే ఆకుల్లో మనిషికి ఆరోగ్యాన్ని అందించే ఔషధ గుణాలు ఉన్నాయనీ వారు వివరిస్తున్నారు.
* పాలిథిన్‌ మానవాళికి ప్లాస్టిక్‌ చేస్తున్న చేటును ఇటీవల కాలంలో స్వచ్ఛభారత్‌, స్వచ్ఛ నమస్కార్‌ తదితర కార్యక్రమాల స్ఫూర్తితో అందరూ గ్రహిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుత కార్తికం, అయ్యప్ప స్వామి మాసంలో పాలిథిన్‌ ప్లేట్లు, గ్లాసులకు బదులుగా, విస్తర్లు, ఆకుల వాడకం కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో ఆకుల వినియోగంలో ఆరోగ్యాంశాలు, పోషక విలువల వివరాలు.. విశేషాలు తెలుసుకుందాం.
**భారతీయ సంస్కృతిలో..పక్షుల కిలకిల రావాలు.. పువ్వుల గుబాళింపులు. పచ్చని తోటలు.. చల్లని పిల్ల గాలులు.. కనువిందు చేసే తటాకాలు.. ఇవన్నీ ప్రకృతి వరాలు.. కార్తికంలో వన సమారాధనల పేరుతో ఒక్కరోజైనా ప్రకృతి ఒడిలో గడపాలని అందరూ కోరుకుంటారు. భారత సంసృతిలో ఇమిడి ఉన్న ఆరోగ్య సూత్రాల్లో ఆకులో భోజనం చేయడం ప్రధానమైంది. భోజనం చేయడానికి ఉపయోగించే వాటిలో ఆరటి, బాదం, తామర, రావిలతో పాటు అడవుల్లో దొరికే మోదుగ ఆకు ముఖ్యమైనవి. మన ప్రాంతంలో విరివిగా లభించే అరటి ఆకు అందరికీ సుపరిచితమే.
**తామరాకు…
తామరాకును ఎండ బెట్టిన తర్వాతే విస్తరిగా ఉపయోగించాలి. పచ్చి తామరాకులో మలినాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఎండబెట్టి వాడే తామరాకు విస్తరి అన్నింటికి అనుకూలంగా ఉంటుంది.
**అమృత వృక్షం…
ఉసిరి చెట్టును అమృత వృక్షంగా చెబుతారు. ఉసిరిలో అత్యధికంగా ఉండే సి విటమిన్‌ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఉసిరి తింటే చలువ చేస్తుంది. మలినాలను హరించడంతో పాటు అతిసార వ్యాధిని అరికడుతుంది. అందుకే కార్తిక మాసంలో ఉసిరి చెట్టుకింద కూర్చుని భోజనాలు చేస్తారు.
**అరటి ఆకు..
ఇందులో ఆహారం తీసుకుంటే జ్వరం, క్షయ, శ్వాస కోశ వ్యాధులను నివారించవచ్చు. ఆకలి పెరుగుతుంది. బలం, శరీర కాంతి కలుగుతాయి. విషపూరిత ఆహారం ఉంటే ఆకు నల్లగా మారుతుందని శాస్త్రం చెబుతోంది.
**రావి..
ఈ ఆకులో ఆహారం తీసుకుంటే రాగి లక్షణం కారణంగా ఎర్ర రక్తకణాలు చురుగ్గా పని చేస్తాయి. అందుకే కామెర్ల వ్యాధి బాధితులకు రావి ఆకులో ఆయుర్వేద మందు వేసి తాగిస్తుంటారు. గొంతు వ్యాధుల నివారణకు పనిచేస్తుంది
**మర్రి..
నోటిపూతను నియంత్రించడంలో మర్రి ఆకుతో తయారు చేసిన విస్తరితో భోజనం చేయడం ఉపయుక్తంగా ఉంటుంది. దాతు పుష్టినిస్తాయి. ఎన్నో ఆయుర్వేద మందుల్లో మర్రిని వినియోగిస్తారు.
**బాదం..
బాదం ఆకులో ఆహారం తింటే పొట్టకు, మూత్ర పిండాలకు బలం చేకూరుతుంది. గాయాలు, గొంతు సంబధిత వ్యాధులు తగ్గుతాయి. సమ శీతల గుణం ఉండటంతో క్షయ, కాలేయ వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది.
**తమలపాకు..
భోజనం తర్వాత తమలపాకు తాంబూలం తింటే రుచితో ఉండి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఈ తాంబూలంతో సుగంధద్రవ్యాలు వినియోగిస్తే మంచి రుచి, సువాసనతో పాటు ఔషధ గుణాలు ఎక్కువగా లభిస్తాయి.
**తులసీ వనం..
తులసీ వనంలో కాలక్షేపం చేస్తే శరీరం ఉత్తేజంగా మారుతుంది. వాతావరణంలో కార్బన్‌ డైఆక్సైడ్‌ను తీసుకుని ఆక్సిజన్‌ విడుదల చేయడంలో మిగిలిన మొక్కలకంటే తులసి మొక్కలు చురుగ్గా పనిచేస్తాయని వైద్యులు చెబుతున్నారు. జ్వరం, దగ్గును తులసి నివారిస్తుంది. ఆకలిని పెంచుతుంది.
**మోదుగు…
అడవుల్లో పొలం గట్ల మీద పెంచే మోదుగు ఆకును పలాస ఆకుగా, అడ్డాకుగా పిలుస్తారు. వీటిలో భోజనంతో చర్మ వ్యాధులను నివారించవచ్చు. జీర్ణక్రియకు మేలు చేస్తుంది. ఈ ఆకులు ఎక్కువ కాలం నిల్వ ఉండటంతో పాటు ఉపయోగించేందుకు అనువుగా ఉంటాయి.
**పంచక్షీర వృక్షాల ఆకులతో ప్రయోజనం ఆయుర్వేద వైద్యురాలు వన భోజనాలే కాదు ఇంటి వద్దా కచ్చితంగా ఆకుల్లో భోజనం చేస్తే ఆరోగ్య ఫలం లభిస్తుంది. మర్రి, జువ్వి, రావి, మేడి, అత్తి(పంచక్షీర వృక్షాలు) ఆకుల్లో మనిషి ఆరోగ్యానికి అవసరమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి కషాయ రసాన్ని కలిగి ఉంటాయి. ఇది యాంటీ బ్యాక్టీరియల్‌గా, అల్సర్లను పారదోలేదిగా పనిచేస్తుంది. కొన్ని చెట్ల ఆకులను విస్తళ్లుగా కుట్టి వాడొచ్చు. మరికొన్ని చెట్ల ఆకులు ఆల్పాహారం తీసుకునేందుకు, ఔషధాల తయారీకి ఉపయోగపడతాయి.