DailyDose

ఏపీలో ఆంగ్ల మాధ్యమంపై జీవో విడుదల-తాజావార్తలు-11/20

English Medium GO Released In AP-Telugu Breaking News-11/20

* ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1 నుంచి 6వ తరగతి వరకు ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రభుత్వం తెలిపింది. తదుపరి ఏడాది నుంచి ఒక్కో తరగతిలో ఆంగ్లమాధ్యమాన్ని పెంచుతామని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

* శబరిమల ఆలయ నిర్వహణకు కొత్త చట్టం రూపొందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జనవరి మూడో వారంలోపు కొత్త చట్టం తీసుకురావాలని కేరళ ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. కేరళలోని ఇతర ఆలయాలతో కలిపి చట్టం తీసుకురావడం సమంజసం కాదని జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. పండలం రాజ కుటుంబం వేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది.

* ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస నేతలు ఎంజీబీఎస్‌లో అత్యవసరంగా సమావేశమయ్యారు. హైకోర్టు తీర్పు ప్రతి, భవిష్యత్ కార్యాచరణపై నేతలు సమాలోచనలు చేస్తున్నారు. సమ్మెపై ఐకాస నేతలు ఇవాళ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సాయంత్రం మరోసారి సమావేశమై సమ్మెపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సమ్మెను కొనసాగింపు అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

* ఆర్టికల్‌ 370 రద్దు చేసిన తర్వాత కశ్మీర్‌లో పరిస్థితులు మళ్లీ సాధారణ స్థితికి వచ్చాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. కశ్మీర్‌ అంశంపై రాజ్యసభలో చర్చ సందర్భంగా అమిత్ షా ప్రసంగించారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకే ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశామని, త్వరలోనే వాటిని పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు.

* ఆర్టీసీ సమ్మె పరిష్కారంపై చొరవ చూపాలని కోరుతూ విపక్ష నేతలు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను కలిశారు. హైకోర్టులో ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌పై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అఫిడవిట్‌ సమర్పించిన ఆర్టీసీ ఇన్‌ఛార్జ్‌ ఎండీ సునీల్‌శర్మపై చర్యలు తీసుకోవాలని నేతలు గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. అవసరమైతే దిల్లీ వెళ్లి రాష్ట్రపతి, కేంద్రమంత్రులను కలిసి సమస్యను వివరిస్తామని చెప్పారు.

* భారత్‌లోని ప్రముఖుల ఫోన్లపై పెగాసస్‌ స్పైవేర్‌ ద్వారా జరిగిన సైబర్‌ దాడి విషయంలో ప్రభుత్వంతో కలిసి మరింత లోతుగా పనిచేయాల్సిందని వాట్సప్‌ అభిప్రాయపడింది. భారత పౌరుల వ్యక్తిగత గోప్యతను కాపాడడంలో మున్ముందు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని హామీ ఇచ్చింది. భారత్‌లోని 400 మిలియన్‌ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని కాపాడేందుకు సంస్థ కట్టుబడి ఉందని పేర్కొంది.

* అసోం జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ) ప్రక్రియపై అమెరికాకు చెందిన ఇంటర్నేషనల్‌ రిలీజియస్‌ ఫ్రీడమ్‌(యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌) ఆందోళన వ్యక్తం చేసింది. దీని ద్వారా దాదాపు 20లక్షల మంది నిరాశ్రయులయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడింది. సరైన నియంత్రణ, పారదర్శకత లేని ఒక ప్రక్రియ ద్వారా లక్షల మందికి పౌరసత్వం లభించకుండా చేయబోతున్నారని యూఎస్‌సీఐఆర్‌ఎఫ్ కమిషనర్‌ అనురిమా భార్గవ వ్యాఖ్యానించారు.

* మున్సిపల్‌ ఎన్నికల కేసులపై హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడింది. ఈ సందర్భంగా పిటిషన్లన్నీ కొట్టివేయాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కోరింది. ఇప్పటికే అభ్యంతరాలను సీజే ధర్మాసనం తోసిపుచ్చిందన్న ప్రభుత్వం… పిటిషనర్లకు అభ్యంతరాలుంటే ఇప్పటికైనా అధికారులను సంప్రదించవచ్చని స్పష్టం చేసింది.

* నేటి ట్రేడింగ్‌లో సరికొత్త రికార్డులను తాకిన సూచీలు ఆ తర్వాత లాభాల స్వీకరణతో వెనక్కి వచ్చాయి. 250 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టిన సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 40,816 వద్ద సరికొత్త జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. అటు నిఫ్టీ కూడా 12వేల మార్క్‌ పైన కదలాడింది. సెన్సెక్స్‌ 181.94 పాయింట్లు లాభపడి 40,651.64 వద్ద, నిఫ్టీ 59 పాయింట్ల లాభంతో 11,999.10 వద్ద స్థిరపడ్డాయి.

* హైకోర్టు సూచన మేరకు కార్మిక న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి అన్నారు. ఆర్టీసీ ఐకాస నేతల కీలక సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రశాంత వాతావరణంలో ఎలాంటి షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఆంక్షల్లేకుండా ఆహ్వానిస్తే.. సమ్మెను విరమిస్తామని ప్రకటించారు.

* విశాఖ, తిరుపతి, అనంతపురంలో కాన్సెప్ట్‌ సిటీల ఏర్పాటుపై ఆలోచించాలని..ఒక్కో సిటీ 10 చ.కి.మీ పరిధిలో ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రచించాలని అధికారులకు ఏపీ సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. సచివాలయంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ కమ్యూనికేషన్ల శాఖ అధికారులతో జగన్‌ సమీక్ష నిర్వహించారు. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ సక్రమంగా పనిచేస్తే అవినీతి తగ్గుతుందని సీఎం అభిప్రాయపడ్డారు.

* జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ)ను దేశమంతా అమలు చేస్తామని హోంమంత్రి అమిత్‌షా పునరుద్ఘాటించారు. ఎన్‌ఆర్‌సీ అనేది దేశంలోని ప్రజలను పౌరుల జాబితాలోకి చేర్చే ప్రక్రియ మాత్రమేనని, దీనిపై ఎవరూ అందోళన చెందాల్సిన అవసరం లేదని బుధవారం రాజ్యసభలో అన్నారు. ఎన్‌ఆర్‌సీ దేశమంతా నిర్వహించే సమయంలో మరోసారి అసోంలోనూ నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

* రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ తెరాస ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ భారత పౌరత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై రమేశ్‌ స్పందించారు. ‘పౌరసత్వ పరిరక్షణకు మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తా. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను హోంశాఖ పరిగణనలోకి తీసుకోకపోవడం శోచనీయం. పౌరసత్వ పరిరక్షణకు మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తా. న్యాయం జరుగుతుందని నమ్మకముంది’’ అని చెన్నమనేని తెలిపారు.

* విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్న తెలంగాణ ఆర్టీసీ కార్మికుల్ని సానుభూతితో తిరిగి చేర్చుకోవాలని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. నలభై రోజులకిపైగా సమ్మెలో ఉన్న కార్మికులు తిరిగి విధులకు హాజరయ్యే క్రమంలో వారికి కుటుంబ పెద్దగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తగిన భరోసా ఇస్తారని ఆశిస్తున్నానని వెల్లడించారు.

* వాటర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా రాజేంద్రసింగ్‌ నిన్న శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్బంగా బుధవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. శ్రీశైలం ప్రాజెక్టు ప్రమాదంలో పడిందని, వెంటనే మరమ్మతులు చేయకపోతే పెనువిషాదం తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వాలు నదులపై ప్రాజెక్టులు నిర్మిస్తున్నాయే తప్ప వాటి నిర్వహణ బాధ్యతలు సరిగా చూసుకోవడం లేదన్నారు.

* హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా తిరుమల శ్రీవారి ఆలయంపై మంత్రి కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ బ్రాహ్మణ సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. విజయవాడ నగరంలోని సూర్యారావుపేట పోలీస్ స్టేషన్‌లో రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన్‌ ఆధ్వర్యంలో బ్రాహ్మణ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ వేమూరి ఆనంద సూర్య, ఇతర నేతలు మంత్రిపై ఫిర్యాదు లేఖ అందజేశారు.

* ప్రభుత్వ రంగ సంస్థలు భారత్‌కు బంగారు బాతుల్లాంటివని, అవి దేశానికే గర్వకారణమని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. అప్పుల్లో కూరుకుపోయిన ఎయిర్‌ ఇండియా, భారత్‌ పెట్రోలియం సంస్థలను విక్రయించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండిస్తూ ఆమె బుధవారం ట్వీట్‌ చేశారు. ‘‘నవ భారతాన్ని నిర్మిస్తామని భాజపా హామీ ఇచ్చింది. కానీ వాళ్లు భారత ప్రభుత్వ సంస్థలను అమ్మేస్తున్నారు. ఇది దురదృష్టకరం.’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

* శ్రీలంక నూతన ప్రధానిగా మహింద రాజపక్స నియమితులు కానున్నారు. తన సోదరుడైన గోటబాయ రాజపక్స దేశాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో మహీందా రాజపక్సను దేశ కొత్త ప్రధానిగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు ఆ దేశ అధికార ప్రతినిధి వెల్లడించారు. ప్రస్తుత ప్రధాని రణిల్‌ విక్రమ సింఘే గురువారం ఉదయం రాజీనామా చేస్తారనీ.. ఆయన స్థానంలో మహింద రాజపక్స బాధ్యతలు చేపడతారని ప్రభుత్వ అధికార ప్రతినిధి విజయానంద హెరాత్ స్పష్టంచేశారు.

* దేశంలోనే అత్యంత సంపన్నమైన సంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మరో రికార్డువైపు దూసుకెళ్తోంది. రూ. 9.5లక్షల కోట్ల మార్కెట్‌ విలువ అధిగమించిన తొలి సంస్థగా చరిత్ర సృష్టించిన రిలయన్స్‌.. తాజాగా రూ. 10లక్షల కోట్ల మైలురాయికి మరింత చేరువైంది. బుధవారం నాటి ట్రేడింగ్‌లో కంపెనీ షేర్లు రాణించడంతో కొత్త రికార్డుకు కేవలం రూ. 20వేల కోట్ల దూరంలో నిలిచింది.