రాజకీయ ప్రవేశంపై సందిగ్ధత నెలకొన్న వేళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడు ప్రజలు అద్భుతం చేయబోతున్నారని చెప్పారు. కమల్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధమని ప్రకటించిన నేపథ్యంలో గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘2021లో తమిళనాడు ప్రజలు రాజకీయంగా నూరు శాతం అతిపెద్ద అద్భుతం చేయబోతున్నారు’’ అని అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను కీలక పాత్ర పోషించబోతున్నట్లు తన వైఖరిని తెలియజేశారు. రజనీతో చేతులు కలిపేందుకు సిద్ధమంటూ మక్కల్ నీది మయ్యం అధినేత కమల్‌హాసన్ అనడం, తమిళుల సంక్షేమం కోసం కమల్‌తో చేతులు కలిపేందుకు తనకు సమ్మతమేనని రజనీకాంత్ స్పందించడం తమిళ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఈ నేపథ్యంలో రజనీతో కలిసి పనిచేసే అంశంపై పార్టీ నేతలతోనూ చర్చించారు. త్వరలో వీరిద్దరూ కలిసి పనిచేసే విషయమై చర్చించుకునే అవకాశముందని సమాచారం. మరోవైపు రజనీ, కమల్ రాజకీయ ప్రయాణంపై అధికార అన్నాడీఎంకే విమర్శలు గుప్పిస్తోంది. వారిద్దరిదీ పిల్లీ ఎలుక జోడీగా ఎద్దేవా చేసింది.
తమిళనాడులో అద్భుతం జరుగుతుంది

Related tags :