తానా మాజీ అధ్యక్షుడు, కృష్ణాజిల్లా మైలవరం మండలం వెల్వడంకు చెందిన ప్రవాసాంధ్ర ప్రముఖుడు కోమటి జయరాం-కల్పన దంపతుల ఏకైక కుమారుడు, మాజీ మంత్రి, మాజీ శాసనసభ్యులు కోమటి భాస్కరరావు మనవడు కోమటి రాహుల్ వివాహం ఇజాబెల్ జియోర్నోతో ఆదివారం నాడు అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో శాన్ఫ్రాన్సిస్కో నగరంలోని “ద ఫెయిర్మాంట్” హోటలులో వైభవంగా జరిగింది. గత వారం రోజులుగా ఈ వివాహ వేడుకకు భారీ ఏర్పాట్లు చేశారు. ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికా, కెనడా దేశాల నుండి బంధువులు, స్నేహితులు ఈ వేడుకల్లో పాల్గొనేందుకు తరలివచ్చారు. ఆదివారం ఉదయం 10గంటలకు బారాత్ కార్యక్రమంతో వివాహ వేడుక ప్రారంభమయింది. శాన్ఫ్రాన్సిస్కో వీధుల్లో భారతీయ నృత్యాల్లో తెలుగువారు పాల్గొని చిందేసి వేడుకకు మంచి ఊపు తెచ్చారు. అనంతరం పురోహితులు శాస్త్రోక్తంగా రాహుల్-ఇజాబెల్ల వివాహ క్రతువు జరిపించారు.
తానా సభలను విజయవంతంగా నిర్వహించడంలో సిద్ధహస్తుడిగా పేరుగాంచిన జయరాం…ఆయన కుమారుడి వివాహ వేడుకలోనూ తన మార్కును ప్రదర్శించారు. ఆయన నివాసం మిల్పిటాస్ నుండి 2బస్సులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి శాన్ఫ్రాన్సిస్కోకు అతిథులను తరలించారు. గత అయిదురోజులుగా అతిథులకు జయరాం “స్వాగత్” పలికారు. వివాహం జరిగిన “ద ఫెయిర్మాంట్” హోటల్ 1907లో ప్రారంభించారు. 112 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ హోటలులో అత్యద్భుతమైన, మంత్రముగ్ధులను చేసే శిల్ప కళల నడుమ వివాహ వేడుక కమనీయంగా రమణీయంగా కన్నుల పండువగా జరిగింది.
ఈ వేడుకలకు ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు డా.యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ప్రవాసాంధ్ర ప్రముఖులు డా.లకిరెడ్డి హనిమిరెడ్డి, డా.మూల్పూరి వెంకటరావు, డా.యడ్ల హేమప్రసాద్, తానా నుండి తోటకూర ప్రసాద్, డా.బండ్ల హనుమయ్య, నాదెళ్ల గంగాధర్, వేమన సతీష్, పొట్లూరి రవి, మురళీ వెన్నం, మందలపు రవి, లావు అంజయ్య చౌదరి, కొల్లా అశోక్బాబు, ఉప్పుటూరి రాంచౌదరి, ఎన్.ఆర్.సీ.నాయుడు, సూరపనేని లక్ష్మీనారాయణ, కోగంటి వెంకట్, ఉప్పాల వీరు, సూరపనేని రాజా, దిలీప్ కుమార్ చండ్ర, వేమన మల్లి, కొల్లా సుబ్బారావు, పోలవరపు శ్రీకాంత్, కసుకుర్తి రాజా, విద్యా గారపాటి, రావు యలమంచిలి, కాకర్ల విజయమోహన్, కూరేటి జయనారాయణ, గారపాటి ప్రసాద్, డా.కొడాలి నరేన్, రాజకీయ నాయకులు పాతూరి నాగభూషణం, గరికపాటి మోహనరావు, కోమటి సుధాకరరావు, ప్రవాసులు జూలూరి సుబ్బారావు, తుళ్లూరి శ్రీనివాసరావు, వైద్యులు డా.గుడారు జగదీష్, కాకర్ల రజనీకాంత్, పుసులూరి సుమంత్, యశ్వంత్ కుదరవల్లి, కోగంటి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.